కరోనా భయంతో వృద్ధురాలిని గెంటివేసిన ఇంటి యజమాని House owner throw old women with corona fear | Sakshi
Sakshi News home page

కరోనా భయంతో వృద్ధురాలిని గెంటివేసిన ఇంటి యజమాని

Published Sun, May 9 2021 4:41 AM

House owner throw old women with corona fear - Sakshi

జగ్గయ్యపేట అర్బన్‌: కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నెట్టేసిన ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం చోటుచేసుకుంది. బొజ్జ సామ్రాజ్యం అనే వృద్ధురాలు పట్టణ శివారులోని పద్మావతినగర్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు గతంలో ఇంటిని అమ్మేసి కన్న తల్లిని ఒంటరిగా వదిలేసి ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె అద్దె ఇంట్లో ఉంటూ పెన్షన్‌ డబ్బుతో జీవనం వెళ్లదీస్తోంది. ఆమెకు కరోనా సోకిందన్న సమాచారం తెలుసుకున్న ఇంటి యజమాని సామాన్లతో సహా బయటకు గెంటేశాడు.

దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ఆరుబయట దీనావస్థలో పడి ఉండటంతో విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ చినబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఇంటి యజమానిని హెచ్చరించి తిరిగి ఆమెను ఇంటిలోకి చేర్చారు. మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా ఇల్లు, పరిసరాలు శానిటేషన్‌ చేయించారు. వెంటనే ఎస్‌ఐ ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వృద్ధురాలిని స్థానిక గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌లో చేర్చుకుని వైద్య సేవలందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement