రివర్స్‌ టెండర్స్‌.. అదుర్స్‌ | A huge amount of public money being saved due to reverse tendering | Sakshi
Sakshi News home page

రివర్స్‌ టెండర్స్‌.. అదుర్స్‌

Published Sun, May 23 2021 3:19 AM | Last Updated on Sun, May 23 2021 3:31 AM

A huge amount of public money being saved due to reverse tendering - Sakshi

సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని రీతిలో విప్లవాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జ్యుడీషియల్‌ ప్రివ్యూ.. రివర్స్‌ టెండరింగ్‌ నిర్ణయం కారణంగా భారీ ఎత్తున ప్రజా ధనం ఆదా అవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టగానే టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. తద్వారా ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.3885.47 కోట్లు ఆదా అయినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. పది లక్షల రూపాయలకు మించి ప్రభుత్వ కొనుగోళ్లు, పనులకు సంబంధించి ఈ విధానాన్ని అమలు చేయాల్సిందిగా 2019లో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీంతో గత ఆర్థిక (2020–21) ఏడాదిలో వివిధ పనులకు సంబంధించి 271 టెండర్లకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా 1,838.67 కోట్ల ప్రభుత్వ ధనం ఆదా అయిందని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కొనసాగుతున్న పనులతో పాటు కొత్త పనులకు టెండర్‌ కమ్‌ రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. పనులకు సంబంధించి తొలుత టెండర్లలో ఎల్‌–1గా నిలిచిన ఏజెన్సీ కోట్‌ చేసిన ధరపై తిరిగి రివర్స్‌ టెండరింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఎల్‌–1 ఏజెన్సీ కోట్‌ చేసిన ధర కన్నా తక్కువ కోట్‌ చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తున్నారు. 
 
వస్తువుల కొనుగోళ్లలోనూ ఇదే విధానం  
– రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల అవసరాలకు వస్తువులు, ఫర్నీచర్, కంప్యూటర్లు తదితర కొనుగోళ్లకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌) ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.  
– గత ఆర్థిక ఏడాది (2020–21)లో ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు, సేవలకు సంబంధించి రూ.32,777 కోట్ల విలువగల 45,500 టెండర్లకు రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు చేశారు. తద్వారా రూ.2,046.80 కోట్లు ఆదా చేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.  
– గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫోన్లు, సిమ్‌ కార్డులు, ఇతర కొనుగోళ్లకు కూడా ఇదే విధానం అమలు చేసినట్లు సర్వే పేర్కొంది. ప్రభ్వుత్వ స్కూళ్లలో నాడు–నేడు కింద చేపట్టిన పనులకు, ఫర్నీచర్, టీవీలు, అల్మారాలు తదితర పరికరాల కొనుగోళ్లకు కూడత్వీ విధానం అమలు చేశారు.  
– ఎక్కడా టెండర్ల ప్రక్రియలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  
 
టీడీపీ సర్కారు హయాంలో నామినేషన్‌ దందా  

– గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముందుగానే ఏ టెండర్‌ ఎవరికి ఇవ్వాలో నిర్ధారించేసుకుని, వారికి టెండర్‌ వచ్చేలా నిబంధనలు రూపొందించే వారు. కొన్ని పనులను గత సీఎం చంద్రబాబు చెప్పిన కంపెనీకి టెండర్లు పిలవకుండానే నామినేషన్‌పై కట్టబెట్టేశారు.  
– నోటి మాటతో, ఎటువంటి పరిపాలన అనుమతులు లేకుండానే నామినేషన్‌పై ఆరీ్టజీఎస్‌లో టెండర్‌ను కట్టిబెట్టిన వైనం కూడా గత సర్కారు హయాంలో చోటు చేసుకుంది. గత ప్రభుత్వం నీరు–చెట్టు పేరుతో అస్మదీయులకు ఏకంగా 13 వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్‌పై పందేరం చేసింది.  
– నీరు–చెట్టు అంటే మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వడం.. ఇందుకోసం ఏకంగా రూ.13 వేల కోట్లు ఇవ్వడం అంటే ఇందులో 90 శాతం నిధులను ఆ పార్టీ నేతలు జేబుల్లో వేసుకున్నారు. 
 
నిపుణుల ప్రశంసలు 
– గత తెలుగుదేశం ప్రభుత్వం టెండర్ల ప్రక్రియలో అనుసరించిన ఇష్టారాజ్య విధానాలతో రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. అప్పటి ప్రభుత్వ పెద్దలకు, బడా కాంట్రాక్టర్లకు భారీ ప్రయోజనం కలిగింది.  
– ఇవన్నీ గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌.. గత ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా టెండర్‌ ప్రక్రియ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేశారు. పారదర్శకతను పెంచారు. దీంతో ఖజానాకు ప్రతి పని విషయంలో భారీగా ఆదా అవుతోందని వివిధ రంగాల నిపుణులు ప్రశంసిస్తున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement