సాక్షి, అమరావతి: విద్యాశాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతోపాటు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులను సైతం మార్చనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో), ఆర్జేడీలకు కూడా స్థానచలనం కల్పించనున్నారు. ఈ అంశంపై నెల రోజుల క్రితమే వివరాలు తీసుకున్న విద్యాశాఖ మంత్రి కార్యాలయం... అధికారుల మార్పుపై తుది ఫైల్‌ను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా ఉన్న శ్రీనివాసులరెడ్డిని పదో తరగతి పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్‌గా బదిలీ చేస్తారని తెలిసింది.
ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న దేవానందరెడ్డిని ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డిని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా బదిలీ చేస్తారని సమాచారం. అలాగే కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్నకుమార్‌లలో ఒకరిని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా నియమించే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి నరసింహారావు, మధ్యాహ్న భోజన పథకం జాయింట్ డైరెక్టర్ గంగాభవానీలను సమగ్ర శిక్షకు బదిలీ చేస్తారని సమాచారం.
మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్‌గా ఇంటర్ విద్యలో పని చేస్తున్న శ్రీనివాసరావును, ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్‌రావును ఇంటర్ విద్యకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. వీరితోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులను సైతం బదిలీ చేయనున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా డీఈవో తప్ప మిగిలిన 25 జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆరు నెలల క్రితమే మార్చారు. అయినా ఇప్పుడు మరోసారి వీరందరికీ స్థానచలనం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో బదిలీల ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment