
రాజమహేంద్రవరం నుంచి సాక్షిప్రతినిధి: పెన్షన్ పెంపు వారోత్సవాల సభకు తరలివచ్చిన జనసందోహంతో గోదారమ్మ పులకించిపోయింది. రూ.2,500 నుంచి రూ.2,750కి పింఛన్ల పెంపు వారోత్సవాలలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటున్నారని తెలిసి వృద్ధులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రాజమహేంద్రవరం తరలివచ్చారు. సభాస్థలి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం ముఖ్యమంత్రి జగన్ రాకకు అరగంట ముందుగానే కిక్కిరిసింది.
పలువురు లోపల ఖాళీ లేకపోవడంతో రోడ్లపైనే నిలుచుని ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయ్యాక తిరుగుముఖం పట్టడం కనిపించింది. నగర వీధులన్నీ జనంతో నిండిపోయాయి. మున్సిపల్ స్టేడియంలోని హెలీపాడ్ దగ్గర నుంచి శ్యామలా సెంటర్, డీలక్స్ సెంటర్, సాయికృష్ణా ధియేటర్, రంభ ఊర్వశి మేనక థియేటర్, చర్చిగేట్, ఆర్యాపురం, నందంగనిరాజు జంక్షన్, వై జంక్షన్ మీదుగా ఆర్ట్స్ కాలేజీ వరకు దారికిరువైపులా ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్టేడియం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఆర్ట్స్ కాలేజీకి చేరుకోవడానికి సీఎంకు అరగంటపైనే పట్టింది.
► సీఎం జగన్ తొలుత వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడ నిరీక్షిస్తున్న పలువురి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించారు. ఆధార్ నమోదు కేంద్రం స్టాల్ వద్ద వృద్ధురాలు జి.చెల్లాయమ్మను పలకరించగానే భావోద్వేగానికి గురై నిలబడేందుకు ప్రయత్నించింది. ఆమెను సీఎం వారిస్తూ మోకాళ్లపై కూర్చోవడంతో చల్లగా ఉండాలని, మళ్లీ నువ్వే సీఎంగా వస్తావయ్యా అంటూ దీవించింది.
► కల్లుగీత, నేత కార్మికులు, చర్మకారులు, డప్పు వాయిద్యకారులు, ట్రాన్స్‌జెండర్లు తదితర పెన్షన్‌దారులతో సీఎం మాట్లాడి సమస్యలను సావధానంగా ఆలకించారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ధవళేశ్వరానికి చెందిన కోరుమిల్లి మేఘన పరిస్థితిని తండ్రి రాజన్న ప్రసాద్ సీఎం దృష్టికి తేవడంతో సమస్య పరిష్కరించాలని తూర్పుగోదావరి కలెక్టర్ డాక్టర్ మాధవీలతను ఆదేశించారు. అనంతరం పెన్షన్‌దారులతో ముఖ్యమంత్రి గ్రూపు ఫొటో దిగారు.
బస్సులో ఉన్నా, ప్రజల గురించే..
సభా ప్రాంగణానికి సీఎం జగన్ బస్సులో వెళుతుండగా ఆర్ట్స్ కాలేజీ వై.జంక్షన్ వద్ద ఓ మహిళ పాపను ఎత్తుకుని పరుగులు తీస్తుండటాన్ని అద్దంలో గమనించి వెంటనే వాహనాన్ని ఆపాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన చెట్టి సూర్యకుమారిని దగ్గరకు పిలిచి ఆమె కుమార్తె డయానా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయారు. పుట్టిన ఏడో నెల నుంచే స్పైనల్ మస్కిలర్ ఎట్రోపి టైప్–2 వ్యాధితో నడవలేని స్థితిలో ఉందని బాధితురాలి తల్లి కన్నీటి పర్యంతం కావడంతో పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించాలని కలెక్టర్ మాధవీలతను ఆదేశించారు.
ఉద్యోగం పోయింది.. ఆదుకోండి సారూ
తన భార్య ప్రసన్న గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, కుమార్తె కీర్తన బ్లెస్సీ తక్కువ బరువుతో పుట్టడంతో పాటు గుండెకు రంధ్రం పడిందని, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఆర్నెల్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారని రాజమహేంద్రవరం తుమ్మలావకు చెందిన సిరికొండ సురేష్ సీఎం జగన్ ఎదుట విలపించాడు. మంత్రులు, ఎంపీలు చెప్పినా ఏఈ, ఎంఈలు ఉద్యోగం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, కుటుంబం గడవడం కష్టంగా ఉందంటూ రోదించాడు. తల్లీ బిడ్డలకు వైద్య సేవలందించడంతో పాటు సురేష్ ఉద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం సూచించారు.
సొరియాసిస్ బాధిత చిన్నారికి పెన్షన్, వైద్యం..
పుట్టుకతో సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న తన మూడేళ్ల కుమారుడి వైద్యం కోసం సాయం అందించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడవల్లికి చెందిన విజ్జిన అమ్మాజీ ముఖ్యమంత్రి ఎదుట మొర పెట్టుకుంది. హెలీపాడ్ వద్ద సీఎంను కలిసిన ఆమె కుమారుడు వికాస్ చికిత్స కోసం ప్రతి నెలా మందులు వాడాల్సి వస్తోందని, కొబ్బరి ఒలుపు కార్మికుడైన తన భర్త ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతోందని తెలిపింది.
చిన్నారి వికాస్‌కు వైద్యసేవలు అందించడంతో పాటు నెలకు రూ.8 వేలు నుంచి రూ.10 వేలు పెన్షన్ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. ఒకవేళ సేవలు అందకపోతే తన కార్యదర్శికి తెలియచేయాలంటూ ఫోన్ నెంబర్ ఇచ్చి భరోసా కల్పించడంతో అమ్మాజీ కళ్లు చెమర్చాయి.
కిడ్నీ బాధితుడైన లాలాచెరువు హౌసింగ్ బోర్డుకాలనీకి చెందిన 16 ఏళ్ల సాయి గణేష్ తన తండ్రితో కలిసి సీఎం జగన్ వద్ద తన కష్టాలను మొర పెట్టుకున్నాడు. బాధితుడికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందేలా తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతను ఆదేశించారు. సీఎం జగన్ తన కుమారుడి సమస్యను సావధానంగా ఆలకించి వెంటనే స్పందించటాన్ని జీవితాంతం మరువలేమని సాయిగణేష్ తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు.
ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనన్నా
గత ప్రభుత్వ హయాంలో నా భర్త చనిపోతే ఎవరూ పట్టించుకోలేదన్నా. నాకు ఇద్దరు పిల్లలు. జన్మభూమి కమిటీల చుట్టూ పెన్షన్ కోసం రోజుల తరబడి తిరిగా. మీరు సీఎం అయ్యాక వలంటీర్ నేరుగా మా ఇంటికే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. నెల తిరగకుండానే వితంతు పింఛన్ చేతిలో పెట్టారు. నా పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. విద్యా దీవెన రూ.75 వేలు, వసతి దీవెన రూ.20 వేలు చొప్పున నాలుగేళ్లలో రూ.3,80,000 లబ్ధి పొందే అవకాశం మీ ద్వారా వచ్చింది.
చిన్న కుమారుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున రెండేళ్ళకు రూ.30,000 అమ్మఒడి వచ్చింది. నా పిల్లలకు మేనమామ జగనన్న ఉన్నాడనే ధీమాతో చదివిస్తున్నా. నాకు ఇంటి పట్టా ఇచ్చారు. ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. నా కుమారుడికి యాక్సిడెంట్ అయితే నాకంటే ముందే 108 వచ్చి ఆసుపత్రిలో చేర్చింది. ఆరోగ్యశ్రీ కార్డుతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించా. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ‘దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే నా అన్నలా ఉంటాడని చెబుతా’
– కోటా సామ్రాజ్యం, వితంతు పెన్షనర్, రాజమహేంద్రవరం.
Comments
Please login to add a commentAdd a comment