సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8వ తేదీకి ఇది అల్పపీడనంగా ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం ఆగ్నేయ దిశగా కదిలి 9వ తేదీకి తుపానుగా మారి, ఉత్తర దిశగా మయన్మార్ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
అందువల్ల తుపాను ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. అల్పపీడనం, వాయుగుండంగా ఉన్నంతవరకు కొద్దిమేర వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా వుండగా తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో 2, 3 రోజులు రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు
శనివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టిలో 6.4, ఏలూరు జిల్లా చాట్రాయిలో 5.9, బాపట్ల జిల్లా లోవలో 5, కొల్లూరులో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో శనివారం పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు గాయపడ్డారు. 13 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
తిరుమలలో భారీ వర్షం
తిరుమల: తిరుమలలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా తిరుమలలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. శనివారం వర్షంతో భక్తులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు.
ఇది కూడా చదవండి: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు
Comments
Please login to add a commentAdd a comment