పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యమే లక్ష్యం
చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు వ్యూహాత్మకంగా..
ఇండియన్ యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి.. విశాఖలో భారత్, యూఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు
ఇండియన్ యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి
సాక్షి, విశాఖపట్నం: భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం కానుందని భారత్–యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పష్టం చేశారు. పసిఫిక్ సముద్రజలాల్లో అన్ని దేశాలూ స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో భారత్, యూఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఐఎన్‌ఎస్ జలాశ్వా యుద్ధనౌక ఆన్‌బోర్డుపై ఇరుదేశాల ప్రతినిధులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎరిక్ మాట్లాడుతూ సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. యూఎస్ సెవెన్త్ ఫ్లీట్ రిజర్వ్ వైస్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోక్విన్ జె మార్టినైజ్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ నిర్వహణతో భారత్, యూఎస్ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు.
తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ విన్యాసాల్లో భాగంగా హార్బర్ ఫేజ్‌లో విపత్తు, యుద్ధ సమయంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనే అంశాలతో పాటు ప్రీసెయిల్ చర్చలు, వృత్తిపరమైన విషయాలపై ఎక్స్‌పర్ట్స్ ఎక్స్చేంజిలు జరగనున్నాయని తెలిపారు. విన్యాసాల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, జాయింట్ రిలీఫ్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని వివరించారు.
29న కాకినాడలో మెడికల్ రిలీఫ్ క్యాంపుతో పాటు.. జాయింట్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. యూఎస్‌ఎస్ సోమర్‌సెట్ యుద్ధ నౌక కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ మిచైల్ బ్రాండ్, ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ రియర్ అడ్మిరల్ రాజేష్ ధన్‌కర్, ఐఎన్‌ఎస్ జలశ్వా కమాండింగ్ అధికారి కెప్టెన్ సందీప్ బిశ్వాల్‌తో పాటు ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment