సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి 6.46 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక వార్షిక సర్వే నివేదిక వెల్లడించింది. 2018–19లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.3,76,143.34 కోట్లు కాగా 2019–20లో రూ.4,00,462.83 కోట్లుగా తెలిపింది. అంటే 2018–19తో పోలిస్తే 2019–20లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.24,319.49 కోట్లు (6.46 శాతం) పెరిగినట్లు సర్వే పేర్కొంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్ నేపథ్యంలో 2019–20కి సంబంధించిన పారిశ్రామిక సర్వేని ఆలస్యంగా.. 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.
ఈ సర్వే నివేదికను కేంద్ర కార్యక్రమాలు అమలు గణాంకాలశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్రంలో కొత్తగా 185 ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 2018–19లో రాష్ట్రంలో 16,739 ఫ్యాక్టరీలుండగా 2019–20లో ఆ సంఖ్య 16,924కు పెరిగింది. 2019–20లో రాష్ట్రంలో మొత్తం 6.63 లక్షల మందికి ఉపాధి కల్పించారు. 2018–19తో పోలిస్తే 2019–20లో ఉపాధి కల్పించిన వారిసంఖ్య 30,432 పెరిగింది. 2018–19లో 6.33 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల సంఖ్య 2018–19తో పోలిస్తే 2019–20లో 29,105 పెరిగింది.
2018–19లో 5.12 లక్షలమంది కార్మికులు పనిచేస్తుండగా 2019–20లో వారిసంఖ్య 5.41 లక్షలకు చేరింది. 2018–19లో కార్మికులకు వేతనాల రూపంలో రూ.8,954.25 కోట్లు చెల్లించగా 2019–20లో రూ.10,243.15 కోట్లు చెల్లించారు. 2019–20లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.29,921 కోట్లు కాగా నికరలాభం రూ.9,584 కోట్లు. 2018–19లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.23,406 కోట్లు కాగా నికరలాభం రూ.5,562 కోట్లు.
1948 ఫ్యాక్టరీల చట్టం కింద ఏర్పాటైన పదిమందికి మించి కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలను సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. రక్షణసంస్థలు, చమురు నిల్వ, పంపిణీ డిపోలు, రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్, కంప్యూటర్ సేవలు, రైల్వే వంటి డిపార్ట్‌మెంటల్ యూనిట్లు, వర్క్‌షాప్‌లు, ప్రభుత్వ మింట్‌లు, శానిటరీ, నీటిసరఫరా, గ్యాస్ నిల్వ మొదలైనవాటిని సర్వే పరిధి నుంచి మినహాయించారు.
రాష్ట్రంలో 2019–20లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6.46%
Published Sun, Aug 21 2022 5:20 AM | Last Updated on Sun, Aug 21 2022 10:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment