మాట్లాడుతున్న ఎంపీలు భరత్, గీత, రెడ్డెప్ప
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ఆంధ్రప్రదేశ్‌లోని 60 శాతం బీపీఎల్ కుటుంబాలకే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తూ అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో 76 శాతం బీపీఎల్ కుటుంబాలకు పంపిణీ చేస్తోందని తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, వంగా గీతావిశ్వనాథ్, ఎన్.రెడ్డెప్ప మీడియాతో మాట్లాడారు.
మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ కేంద్రానికి సంబంధం లేకుండా 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు. ప్రజా పంపిణీ, ఆహార భద్రత పథకాల కింద ఏపీకి పంపిణీ చేస్తున్న బియ్యానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు పొంతనలేదన్నారు. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. వాస్తవాలకు విరుద్ధంగా ‘కేంద్రం నుంచి తీసుకునే రేషన్ ఎక్కువ.. ప్రజలకు పంచేది తక్కువ..’ అంటూ ఈనాడు, ఇతర పత్రికల్లో కథనాలు వచ్చాయని చెప్పారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో డోర్ డెలివరీ విధానంలో రేషన్ అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1.54 కోట్ల బీపీఎల్ కుటుంబాలుండగా కేంద్రం 89 లక్షల కార్డుదారులకు మాత్రమే బియ్యం కేటాయిస్తోందని చెప్పారు. మిగిలిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం వల్ల ఏటా రాష్ట్రంపై రూ.3 వేల కోట్ల భారం పడుతోందన్నారు.
బియ్యం కోటా పెంచాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. రేషన్ పంపిణీలో మిగులు బియ్యం తర్వాత నెలకు సర్దుబాటవుతుందని, దాన్ని విస్మరించి బియ్యం కేటాయింపులపై కేంద్రం పార్లమెంటులో తప్పుడు నివేదిక ఇవ్వడం బాధాకరమని చెప్పారు. దీనిపై సంబంధిత మంత్రిని స్పష్టత కోరతామని ఆయన తెలిపారు.
ఏపీకి అన్యాయం జరిగిందని నీతి ఆయోగ్ చైర్మన్ అంగీకరించారు
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కేంద్రం మూడేళ్ల వివరాలు అందించడంలో క్లరికల్ పొరపాటు జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈనాడు తదితర పత్రికల్లో వార్తల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. కేంద్రం ఇచ్చిన సమాచారం కన్నా మరింత తప్పుడు సమాచారం జోడించి కథనాలు ప్రచురించడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీడీఎస్ లెక్కల గణనలో ఏపీకి అన్యాయం జరిగిందని 2020–21లో నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించగా నీతి ఆయోగ్ చైర్మన్ కూడా అంగీకరించారని ఆమె గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment