హిందూ మహా సముద్రంలో పైచేయి భారత్‌దే.. | INS Vikrant Special Story In Visakhapatnam | Sakshi
Sakshi News home page

తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలోకి విక్రాంత్‌

Published Mon, Jan 25 2021 12:29 PM | Last Updated on Mon, Feb 28 2022 11:00 AM

INS Vikrant Special Story In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : భారత రక్షణ రంగం నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో అధునాతన అస్త్రం రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌ నిర్మాణంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన ఐదో దేశంగా... అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ సరసన భారత్‌ స్థానం సంపాదించింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది సీ ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.. 2022 నాటికి విశాఖలోని తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది.

రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్‌.. యుద్ధ విమాన వాహక నౌకల విషయంలో కూడా బలీయమైన శక్తిగా ఎదగాలన్న కాంక్షతో విక్రాంత్‌ తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్‌ క్లాస్‌ యుద్ధ నౌక సిద్ధమైంది. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొ దటి విక్రాంత్‌ క్లాస్‌ నౌక ఇది. వాస్తవానికి 1997లో విక్రాంత్‌ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్‌ యుద్ధ విమాన వాహక నౌక సిద్ధమవుతోంది.

దిగ్విజయంగా బేసిన్‌ ట్రయల్స్‌...
విక్రాంత్‌ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి షిప్‌యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటున్న విక్రాంత్‌ జయమ్‌ సమ్‌ యుద్ధి స్పర్థః అనే రుగ్వేద శ్లోకం స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటోంది. నాతో యుద్ధమంటే నాదే గెలుపు అనే అర్థం వస్తుంది. 1999లో ఇండియన్‌ నేవీకి చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ సంస్థ నౌకా డిజైన్‌ మొదలు పెట్టగా.. 2009లో కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్‌ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్‌ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. వివిధ సాంకేతిక పనుల అనంతరం ఇటీవలే బేసిన్‌ ట్రయల్స్‌ పూర్తి చేశారు.

ఎల్‌ఎం 2500 గ్యాస్‌ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్‌ ప్రొపైల్లర్‌ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్, స్టీరింగ్‌ గేర్, ఎయిర్‌ కండిషనింగ్‌ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్‌ పంప్స్, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ, డెక్‌ మెషినరీతో పాటు అంతర్గత కమ్యూనికేషన్‌ పరికరాల్ని ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. ఈ ఏడాది మధ్యలో సీ ట్రయల్స్‌ పూర్తి చేసిన తర్వాత... 2022 చివరిలో భారత నౌకాదళంలో సేవలు ప్రారంభించనుంది. ఈ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.. ఇండియన్‌ నేవీలో కీలకమైన తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది.

ఇక హిందూ మహా సముద్రంలో పైచేయి భారత్‌దే..
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మహా సముద్రం హిందూ మహాసముద్రం. రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్‌ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌. విక్రాంత్‌ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. 7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హిందూ మహా సముద్రంలో ఎలాంటి అడ్డు లేకుండా ముందుకు దూసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని విక్రాంత్‌ సొంతం చేసుకుంటుంది.

కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్‌
వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్, తూర్పు నౌకాదళాధిపతి
విక్రాంత్‌ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్‌ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ విమాన వాహక యుద్ధ నౌక అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలు భుజానికెత్తుకుంటుంది. ముఖ్యంగా నౌకాదళంలో చేరనున్న మిగ్‌–29 యుద్ధ విమానాలకు విక్రాంత్‌ ఉపయుక్తమవుతుంది. సీ ట్రయల్స్‌ పూర్తయిన తర్వాత ఏడా ది పాటు సిబ్బందికి నౌకలో శిక్షణ, సామర్థ్యాల నిర్వహణ అంశాలు పరీక్షిస్తారు. అనంతరం విక్రాంత్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement