సహకార రంగంలో పత్రిక సాహసోపేతం | Invention of the sahakara Bhoomi logo | Sakshi
Sakshi News home page

Published Mon, May 29 2023 9:42 PM | Last Updated on Mon, May 29 2023 9:47 PM

Invention of the sahakara Bhoomi logo - Sakshi

విజయవాడ, మే 29: సహకార రంగం ఒకప్పుడు రాజకీయాలను శాసించే దశలో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సహకార వ్యవస్థకు సహకారభూమి పక్షపత్రిక నూతన జవసత్వాలు అందించాలని సి. రాఘవాచారి మీడియా కమిషన్ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సూచించారు. సహకార రంగంలోని సానుకూల అంశాలతో పాటు లోటుపాట్లను కూడా సహకారభూమి పత్రిక అందించాలని చెప్పారు. 

విజయవాడ శ్యామ్ నగర్ ఎన్జీవో కాలనీలోని సహకారభూమి కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన సహకారభూమి లోగోను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభకు సహకారభూమి వ్యవస్థాపక అధ్యక్షులు, కేడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కొమ్మినేని మాట్లాడుతూ.. సహకార రంగం ఒకప్పుడు రాజకీయాలను శాసించే దశలో ఉందని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. సహకార రంగంలో పత్రిక తీసుకురావడం ఒక సాహసోపేతమైన చర్య అనీ, దీనిని జయప్రదం చేసేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు.

మరో ముఖ్య అతిథి, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనాథ్ రెడ్డి సహకారభూమి కార్యాలయం ముందు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సభలో ఆయన మాట్లాడుతూ.. సహకారమంటే అపకారం కాదని, సహకార రంగంపై ఉన్న ఈ అపవాదును పోగొట్టేలా సహకార వ్యవస్థను తీర్చిదిద్దాలని హితవు పలికారు. పరస్పర సహకారంతోనే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. సహకార రంగ ప్రగతిని, సంక్షేమాన్ని కాంక్షిస్తూ త్వరలో విడుదల కానున్న సహకారభూమి పత్రిక చిరకాలం సేవలు అందించాలని అభినందనలు తెలిపారు. తప్పులు చేయడం మానవ సహజమని, వాటిని తగ్గించేందుకు జరిగే ప్రయత్నం హర్షణీయమన్నారు. తమ సిబ్బందికి ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని పంపించి జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. 

సహకారభూమి పక్షపత్రికకు తాము అన్నివిధాలా సహకరిస్తామని, అన్ని ప్రాథమిక సహకార సంఘాలకు ఈ పత్రిక చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు. తమ ఆప్కాబ్ సిబ్బందికి సహకారభూమి పత్రిక మార్గదర్శకత్వం వహించేలా ఉండాలని, సహకారం అంటే స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. సభాధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ సహకార రంగానికి జవసత్వాలు కల్పించేందుకు ఈ పత్రిక ఉపయోగపడాలని కోరారు. ఇప్పుడు ఉన్న సిబ్బందికి సమగ్ర సమాచారం అందడం లేదని, ఏ జీవోలో ఏముందో తెలియడం లేదన్నారు. ఈ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉందని, ఈ లోటును ఈ పత్రిక భర్తీ చేయాలని ఆకాంక్షించారు. 

కొన్ని లక్షల మంది ఉన్నా సహకార వ్యవస్థకు సమగ్ర సమాచారం అందించే పేపరు, పత్రిక లేకపోవడం పెద్దలోటేనని, ఈ లోటును సహకారభూమి తీర్చాలని ఆకాంక్షించారు. సహకారభూమి పత్రికు తాము అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సహకార ధర్మపీఠం సంపాదకులు, సహకార రంగ నిపుణుడు భూమయ్య  సహకారం రంగ పితామహుడు రామదాసు పంతులు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు.  

సభలో భూమయ్య మాట్లాడుతూ.. సహకార చట్టాల మార్పు తీరుతెన్నులను, వస్తున్న మార్పులను వివరించారు. సహకార వ్యవస్థకు కొత్త విధానాలు నిబంధనలు తీసుకొస్తామని చెపుతూ ఇప్పుడున్న చట్టాలను నిర్వీర్యం చేసే పరిస్థితి రానున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సహకారభూమి లాంటి పత్రికలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

ఈ కార్యక్రమంలో సహకారభూమి వ్యవస్థాపకులు దాసరి కేశవులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ ఎల్లారావు, సహకారభూమి పత్రిక సంపాదకులు అక్బర్ పాషా, సహకార రంగ ప్రముఖులు సాంబిరెడ్డి, వ్యవస్థాపక సభ్యులు కేవి కృష్ణ, కేఎస్ జ్యోతి శ్రీ, సిహెచ్ త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు. సహకారభూమి జర్నల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యదర్శి రత్నప్రసాద్ వందన సమర్పణ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement