కరోనా రావడమన్నది పాపం కాదు: సీఎం జగన్‌ | It Is Not A Sin To Tested Covid 19 Positive Says CM YS Jagan | Sakshi
Sakshi News home page

కరోనా రావడమన్నది పాపం కాదు: సీఎం జగన్‌

Published Tue, Jul 28 2020 2:19 PM | Last Updated on Tue, Jul 28 2020 3:11 PM

It Is Not A Sin To Tested Covid 19 Positive Says CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పులు చేయలేదని, కేసులు తక్కువ చేసి చూపలేదని పేర్కొన్నారు. దేశంలోనే రోజుకు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని సీఎం వ్యాఖ్యానించారు. దాదాపు ప్రతి మిలియన్‌కూ 31వేలకు పైగా టెస్టులు చేస్తున్నామని తెలిపారు. కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాజాగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఎక్కువ కేసులు వస్తున్నప్పుడు కాస్త భయపడతారు. కేసులు ఎక్కువగా వస్తున్నాయని భయపడి పరీక్షలు తగ్గించి.. రిపోర్టులు తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ అలా జరగలేదు. 90 శాతం టెస్టులు కోవిడ్‌ క్లస్టర్లలోనే చేస్తున్నాం. కోవిడ్‌ సోకిన వారికి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. విశ్లేషణాత్మక ధోరణితో ముందుకు పోవాలి. రాష్ట్రంలో లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. అందులో సగం మందికి నయమైపోయింది. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఆధునిక కార్పొరేట్ ఆస్పత్రులు లేకపోయినా.. మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేశాం’అని సీఎం పేర్కొన్నారు.
(చదవండి: పరిస్థితిని బట్టి అర్ధ గంటలో బెడ్‌ కేటాయించాలి: సీఎం జగన్‌)

’కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంది. కోవిడ్ వస్తుంది పోతుంది కూడా. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ వేచి చూడాలి. మధ్యప్రదేశ్‌ సీఎంకూడా కరోనా వచ్చింది. కరోనా రావడమన్నది పాపం కాదు.. నేరం కాదు. కరోనా కారణంగా చనిపోయిన వారి నుంచి...వైరస్ వ్యాపించకుండా చేయాల్సినవన్నీ చేస్తున్నాం. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్‌ ఉండదు. బంధువులకు కూడా మనం అంత్యక్రియలు చేయకపోవడం విచారకరం. మానవత్వమే మరగున పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15 వేలు అందిస్తున్నాం. 

బంధువులు రాకపోతే ప్రభుత్వమే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. పద్ధతి ప్రకారం వారికి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ప్రభుత్వమే దగ్గరుండి భౌతికకాయాలను తరలిస్తుంది. ప్రజలకు అండగా ఉన్నామని ప్రభుత్వం వైపు నుంచి గట్టి సంకేతం పోవాలి. కరోనాపై ఎవరికీ భయాందోళనలు ఉండకూడదు కరోనాపై అవగాహన పెంచుకుని, దైర్యంగా ఎదుర్కోవాలి’అని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకుముందు ఉపాధి హామీ, ఖరీఫ్ సీజన్, ప్రభుత్వ చర్యలపై సీఎం కలెక్టర్లతో చర్చించారు. పాఠశాలల్లో నాడు-నేడు పనులపైనా సీఎం సమీక్షించారు. మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, సురేష్, సీఎస్, డీజీపీ ఈ సమీక్షల్లో పాల్గొన్నారు.  
('రైతుభ‌రోసా' కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement