డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. ఇప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన అవకాశాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరుగార్చారు. దేవుడిలా.. ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్ల విశాఖ కేంద్రంగా (రాజధానిగా) ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మళ్లీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరో 25 ఏళ్లలో ఇంకో విభజన యుద్ధం తప్పదు..’ అని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ పేర్కొన్నారు.
విశాఖలో శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనకు సంబంధించిన జెండాను శుక్రవారం విశాఖపట్నంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేఏసీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రీకరణ వల్ల ఇప్పటికే నష్టపోయాం. వికేంద్రీకరణకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష.. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమతో పాటు మధ్యాంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతాయన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అన్నివర్గాల ప్రజలు సహకరిస్తున్నారు..’ అని చెప్పారు.
విశాఖ కేంద్రంగా రాజధాని కోసం శనివారం విశాఖలో నిర్వహించనున్న విశాఖ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. విశాఖ వాసులు.. ఉత్తరాంధ్ర వాసులు ఈ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ ‘విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కోసం జరుగుతున్న ఉద్యమం. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనంపై ఎన్నో కమిటీలు చెప్పాయి. కేంద్రం కూడా గుర్తించింది. అటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ పరిపాలన రాజధానిగా, రాయలసీమ వాసుల కోసం కర్నూలు న్యాయ రాజధానిగా, మధ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి శాసన రాజధానిగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం..’ అని చెప్పారు. ఇది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. విశాఖపట్నం రాజధాని అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి బాటపడతాయని తెలిపారు.
1956 ఏప్రిల్ ఒకటినే..
జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ 1953లో ఆంధ్రరాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సిలో ఉండేదని, ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశంపంతులు ఉన్నప్పుడు తొలి అసెంబ్లీ సమావేశం విశాఖ ఏయూ టీఎల్‌ఎన్ సభా హాల్లో జరిగిందని చెప్పారు. కర్నూలు రాజధానిగా అప్పుడే ఒక తీర్మానం చేశారని గుర్తుచేశారు. తర్వాత పరిణామాల్లో 1956 ఏప్రిల్ ఒకటిన విశాఖ రాజధానిగా శాసనసభ్యులందరూ అప్పుడే తీర్మానం చేసినప్పటికీ, ఇక్కడి రాజకీయ నాయకులు చొరవ చూపకపోవడంతో రాజధాని హైదరాబాద్‌కు వెళ్లిపోయిందని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం నిలబెట్టుకోకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి విశాఖ రాజధానికి సహకరించాలని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment