సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం దేశానికే ఆదర్శం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయం’ అంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ కొనియాడారు. మంగళవారం ఆయన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ను ప్రశంసిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘బేస్‌లైన్ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్ స్క్రీనింగ్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా పేదల ఆరోగ్యంపై శ్రద్ధకు శ్రీకారం చుట్టారు.
తెలుగునాట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ రూపంలో, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ‘ఆరోగ్య సురక్ష’ ద్వారా అధ్వానంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థకు జీవం పోశారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేవలం అనారోగ్యం, సరైన వైద్యం అందక, వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. అలాంటి సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం శుభపరిణామం.
ఆరోగ్యశ్రీలో పేదలు తమకు నచ్చిన నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుండటంతో.. ఆస్పత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం జీవనశైలి మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ముందుగానే వాటిని గుర్తించి సరైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’ అంటూ వీడియో సందేశంలో జయప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment