
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేదీన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. అప్పటిలోగా పంచాయతీల్లో అన్ని వనరులను సమీకరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చేనెల 8వ తేదీ నుంచి ప్రతి 250 నివాసాల నుంచి చెత్తను సేకరించే ఒకరిని గ్రీన్ అంబాసిడర్‌గా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సన్నాహక కార్యక్రమాల ద్వారా కోవిడ్ సమయంలో గ్రామాల్లో పారిశుధ్యం, శుభ్రత విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని, వారిని కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ పనులు ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్నాయని, ఆయా కాలనీల్లో ఉపాధిహామీ పథకంలో అవెన్యూ ప్లాంటేషన్ భారీగా చేపట్టాలని చెప్పారు.
నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల మొక్కలు నాటాలని, అవసరమైతే ప్రైవేటు నర్సరీల నుంచి కూడా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ ఏడాది, గత ఏడాది నాటిన మొక్కల్లో 66 శాతం బతికాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సెర్ఫ్ సీఈవో రాజాబాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, ఉపాధిహామీ పథకం డైరెక్టర్ చిన్నతాతయ్య, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment