సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12వతేదీన స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్ధికీ జగనన్న విద్యా కానుక కిట్లను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగనన్న విద్యా కానుకకు సంబంధించి ప్రతి వస్తువును నిర్దిష్ట సమయంలోగా స్కూళ్లకు తరలించేలా తేదీలను నిర్ణయించారు. జూన్ 7వతేదీ నాటికే విద్యా కానుక కిట్లు పూర్తి స్థాయిలో పాఠశాలలకు చేరుకునేలా చర్యలు చేపట్టింది.
జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, స్కూళ్లకు తరలింపు ప్రక్రియ పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జగనన్న విద్యా కానుకలో ప్రతి వస్తువును మండల కేంద్రాల్లో నాణ్యత తనిఖీలు చేసేలా ఒక బృందాన్ని, పర్యవేక్షణ కోసం మరో బృందాన్ని ఏర్పాటు చేశారు.
మండల స్థాయి బృందాలకు సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా స్థాయిలో బృందాలను సిద్ధం చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌తో పాటు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
తయారీ దశలోనే తనిఖీలు
జగనన్న విద్యా కానుకలో ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ఇప్పటికే స్కూళ్లకు తరలింపు పూర్తి కాగా మే 31 నాటికి పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, బెల్టులు చేరుకోనున్నాయి. యూనిఫాం, నోట్ బుక్స్, బూట్లు, బ్యాగ్స్, యూనిఫామ్స్ తరలింపును జూన్ 7 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నిర్దేశించారు. తొలుత జిల్లా కేంద్రాలకు అక్కడ నుంచి 670 మండల కేంద్రాలకు తరలిస్తున్నారు.
అనంతరం అక్కడ నుంచి 45,534 స్కూళ్లకు తరలింపు ప్రక్రియ చేపట్టారు. మొత్తం 39,96,064 జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి వస్తువు అత్యంత నాణ్యతతో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి తయారీ దశలోనే అధికారులు నాణ్యత తనిఖీలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment