సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విజయవంతగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు చెప్పుకొన్న సమస్యలు చకచకా పరిష్కారమవుతున్నాయి. టోల్‌ఫ్రీ నంబర్‌కు ప్రజలు సమస్యలు చెప్పగానే, వాటిని సంబంధిత శాఖలు వెనువెంటనే పరిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది మే 9వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఈ నెల 12వ తేదీ వరకు తెలిపిన సమస్యల్లో ఇప్పటివరకు 86 శాతం పరిష్కారమయ్యాయి. మిగతావి పరిష్కారదశలో ఉన్నాయి. 85 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడైంది.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు సమస్యలను తెలపడానికి ప్రభుత్వం 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ నంబరుకు వచ్చిన సమస్యలను నిర్ధారించిన గడువులోగా పరిష్కరించి, దాని స్థితిగతులను ఫిర్యాదుదారుకు తెలియజేస్తారు. ఇలా జవాబుదారీతనంతో కూడిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.
పరిష్కరించిన సమస్యల పట్ల ప్రజలు అభిప్రాయాన్ని కూడా తిరిగి ఆడిట్ ద్వారా తెలుసుకుంటున్నారు. 1902 నంబరుకు ఈ నెల 12వ తేదీ వరకు 2,57,311 సమస్యలు వచ్చాయి. అందులో 2,20,785 సమస్యలను పరిష్కరించారు. అంటే 86 శాతం పరిష్కారమయ్యాయి. మరో 14 శాతం అంటే 36,526 సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్లతో ఈ కార్యక్రమంపై సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించి, ప్రజల సంతృప్తి శాతాన్ని ఇంకా మెరుగుపరచాలని సూచించారు.
సమస్యల పరిష్కారంంలో ఇంధన శాఖ, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య, వ్యవసాయ శాఖల పట్ల ప్రజల్లో అత్యధికంగా సంతృప్తి వ్యక్తమైంది. అలాగే అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు. శ్రీకాకుళం జిల్లాల్లో జగనన్నకు చెబుదాంలో సమస్యల పరిష్కారం పట్ల అత్యధిక శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment