
విజయనగరం జిల్లా చింతపల్లి తీరంలో వెనక్కి వెళ్లిన సముద్రం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. థాయ్‌లాండ్, అండమాన్ నికోబార్ తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుని 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మరింత బలపడి ఏపీ తీరంలో 17, 18 తేదీల నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారాక దీనికి ‘జవాద్’గా నామకరణం చేయనున్నారు. విశాఖ, కాకినాడ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఏపీ తీరానికి 1,200 కి.మీ. దూరంలో ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. 15వ తేదీ నుంచి దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 17 నుంచి తీరం దాటే వరకూ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఎవరూ వేటకు వెళ్లొద్దని, వేటకు వెళ్లిన వారు 15వ తేదీలోపు తిరిగి వెనక్కి వచ్చేయాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తమిళనాడు తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ వైపు వచ్చి మరింత బలహీనపడింది. మయన్మార్‌కు సమీపంలో ఏర్పడిన అధిక పీడన ప్రాంతం కారణంగా ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంపై బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల రెండ్రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలూ కురవొచ్చు.
వెనక్కి వెళ్లిన సముద్రం
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో సముద్రం శనివారం 100 అడుగుల లోపలకు వెళ్లింది. అలల తాకిడి సైతం తగ్గింది. వాయుగుండం, ఆటు పోట్ల ప్రభావంతో నీరు వెనక్కి వెళ్లినట్టు మత్స్యకారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment