సాక్షి, అమరావతి/హైదరాబాద్: నకిలీపత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్‌ఓసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారిన బాగోతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జేసీ కుటుంబ సభ్యులపై ఉచ్చుబిగుస్తోంది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీచేయడంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరయ్యారు.
ఆయనతోపాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి కూడా ఉన్నారు. దాదాపు 5 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. విచారణానంతరం ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అధికారులు విచారణకు రమ్మని నోటీసులివ్వడంతో వచ్చానని, లారీల కొనుగోలుపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. విచారణకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా తాను విచారణకు హాజరవుతానన్నారు.
అక్రమాల బాగోతం ఇలా..
టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్ పేరున 50, సి. గోపాల్‌రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నకిలీపత్రాలతో వాటిని బీఎస్–4 వాహనాలుగా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్‌ఓసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు నిర్వహిస్తున్నారు. మరో మూడు బస్సులు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డారు. వీటిని కొద్దిరోజులపాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో (ఎన్‌ఓసీ) వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశారు.
కానీ, వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదుచేశారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీ)’ రికార్డులను పరిశీలించారు. జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టుచేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
ప్రత్యేక దర్యాప్తునకు కేంద్రానికి లేఖ
ఆ తర్వాత జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర పోలీసులు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో జేసీ కుటుంబం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్నినెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి, వారి వ్యాపార భాగస్వామి సి. గోపాల్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాలతోపాటు తాడిపత్రి, హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక ఆధారాలు సేకరించి ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి ఫోన్లను జప్తుచేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment