సాక్షి, హైదరాబాద్: అనంతపురం(ఏపీ) టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను.. BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకుగానూ ఈ పరిణామం చోటు చేసుకుంది. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆయన్ని నోటీసుల్లో హైకోర్టు ఆదేశించింది.
దివాకర్ ట్రావెల్స్ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసి.. కర్ణాటక, ఏపీలోని పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.
జేసీ ట్రావెల్స్ వ్యవహారాలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి విచారణకు అప్పగించాలని పిటిషన్ వేశారు. 2020, అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని తన పిటిషన్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment