జేసీ ప్రభాకర్‌రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది: పెద్దారెడ్డి | Kethireddy Pedda Reddy Sensational Comments On Jc Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్‌రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది: పెద్దారెడ్డి

Published Fri, Oct 11 2024 4:40 PM | Last Updated on Fri, Oct 11 2024 6:14 PM

Kethireddy Pedda Reddy Sensational Comments On Jc Prabhakar Reddy

సాక్షి, అనంతపురం: తనకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ కుట్రలు చేస్తున్నారని.. ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుసార్లు తానను చంపేందుకు జేసీ ప్రయత్నించారని పెద్దారెడ్డి అన్నారు.

‘‘మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపారు. అదే పద్ధతిలో నన్ను హతమార్చేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారు. జేసీ గూండాలకు ఎస్పీ జగదీష్ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. నాపై ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలి’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు.

కాగా, యాడికి మండలంలో జేసీ ముఠా బరితెగించింది. స్థానికులను భయకంపితులను చేసింది. చంపుతామంటూ పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలను బెదిరించడమే కాకుండా ఓ నాయకుడిని కిడ్నాప్‌ చేసింది. యాడికి మండలంలో త్వరలో 4 వైన్‌ షాపులు ఏర్పాటు కానున్నాయి. వాటికి సంబంధించి లైసెన్సుల కోసం యాడికి మండల కేంద్రం నుంచి ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌, ఉప సర్పంచ్‌ కాసా చంద్రమోహన్‌, వైఎస్సార్‌ సీపీ నాయకుడు బాలిరెడ్డి, రాయలచెరువు గ్రామానికి చెందిన జానా దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి తన ముఠాను ఉసిగొల్పారు.

ఆయన ఆదేశాలతో గురువారం మధ్యాహ్నం టీడీపీ నేత, మాజీ ఎంపీపీ రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్‌ రుద్మనాయుడు, పరిమి చరణ్‌ ఆధ్వర్యంలో వంద మందితో కూడిన పచ్చ ముఠా రంగంలోకి దిగింది. యాడికి మండలకేంద్రానికి చేరుకుని ఉప సర్పంచు కాసా చంద్రమోహన్‌ ఇంటి తాళాలను పగుల గొట్టింది. వైఎస్సార్‌ సీపీ నాయకుడు బాలిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయనతో పాటు కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది.

ఇదీ చదవండి: మద్యం షాపులన్నీ నాకే కావాలి..!

మద్యం షాపు కోసం చేసిన దరఖాస్తును విరమించుకోవాలని వార్నింగ్‌ ఇచ్చింది. ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌ ఓ టీ స్టాల్‌ వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడికే వెళ్లింది. ‘ఒరేయ్‌ నీకు ఎన్ని గుండెల్రా.. మా ప్రభుత్వంలో మద్యం షాపుల కోసం టెండర్లు వేస్తావా.. వాటిని విరమించుకోకపోతే చంపుతాం’ అంటూ బెదిరించింది. టెండర్‌ రసీదులు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బొంబాయి రమేష్‌ నాయుడు ఇంటి వద్ద ఉన్నాయని చెబుతుండగానే స్కార్పియో వాహనంలో రామ్మోహన్‌ను పచ్చ నేతలు ఎక్కించుకెళ్లారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎంపీపీ బొంబాయి ఉమాదేవి విషయాన్ని తాడిపత్రి డీఎస్పీ, జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి తెలియజేశారు. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన యాడికి సీఐ ఈరన్న తన సిబ్బందితో టీడీపీ శ్రేణులను వెంబడించారు. రాయలచెరువు వద్ద వారి వాహనాన్ని ఆపి రామ్మోహన్‌ను కాపాడారు. కాగా, రామ్మోహన్‌ కిడ్నాప్‌నకు గురయ్యారనే సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బొంబాయి రమేష్‌ నాయుడు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement