ఇతరులెవరైనా దరఖాస్తు చేస్తే అంతు చూడండి
తాడిపత్రిలో అనుచర గణానికి జేసీ ఆదేశాలు
యాడికిలో వైఎస్సార్‌సీపీ నేత కిడ్నాప్.. ఎస్పీ జోక్యంతో విడుదల
నిడదవోలులో వాటా కోసం మంత్రి అనుచరుల బెదిరింపులు
ఇతరులు సాహసించి లాటరీలో దుకాణాలు దక్కించుకున్నా కేసులు తప్పవంటూ పోలీసుల హెచ్చరికలు
మీకు ఒక వేళ షాపులు వచ్చినా వాటిని నడవనీయం
ఏదో ఒక కారణం చూపి కేసులు పెడతామంటూ బెదిరింపులు
మద్యం టెండర్లకు నేడు తుది గడువు.. దరఖాస్తులు 70 వేలు దాటే అవకాశం
సాక్షి టాస్‌్కఫోర్స్, సాక్షి, రాజమహేంద్రవరం : ‘రేయ్..! ఇతరులు ఎవరైనా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నారో జాగ్రత్త..! ఊరుకునే ప్రసక్తే లేదు. అన్నీ నాకే కావాలి. నా మాట కాదని ఎవరన్నా దరఖాస్తు చేశారో వారి అంతు చూడండి..!’ అనుచర గణానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలివీ!! ఆయన కనుసైగ చేయడమే ఆలస్యం.. తాడిపత్రి నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఓ వైఎస్సార్ సీపీ నేతను టీడీపీ శ్రేణులు కిడ్నాప్ చేయగా మరో నేత ఇంటిపై దాడికి తెగబడి బెదిరింపులకు దిగాయి.
ఒకపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు పోలీసుల ద్వారా సామ, దాన, దండోపాయాలను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ‘‘అసలు మీరు ఈ టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు? సరే టెండర్లు దక్కించుకున్నారే అనుకోండి. టీడీపీ నేతలను కాదని అసలు మద్యం దుకాణాలను మీరు నిర్వహించగలరా? అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మీపై కేసులు నమోదవుతాయి. ఎక్సైజ్ దాడులూ జరుగుతాయి.
ఏదో ఒక కేసు బుక్ చేసి మిమ్మల్ని మూసి వేయడం ఖాయం. ఇదంతా ఎందుకొచి్చన గొడవ? మద్యం టెండర్ల నుంచి మీకు మీరే మర్యాదగా తప్పుకోండి..!’’ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇతర పార్టీల నేతలకు స్థానిక ఎస్సై, సీఐల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ఇదీ!!
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కిడ్నాప్
తాడిపత్రిలో 9 మద్యం షాపులు, రూరల్ పరిధిలో 3, యాడికిలో 4, పెద్దవడుగూరులో 3, పెద్దపప్పూరులో ఒక షాపు కలిసి మొత్తం 20 మద్యం దుకాణాలు తమ ఆదీనంలో ఉండాలని జేసీ ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన ఓ నేత 20 దుకాణాలకు దరఖాస్తు వేసేందుకు ప్రయత్నించగా ఆయన్ను విరమించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన ఇతర నేతలపై జేసీ వర్గం దౌర్జన్యాలకు తెగబడింది.
వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను స్కారి్పయోలో కిడ్నాప్ చేసి తరలించారు. ఎంపీపీ ఉమాదేవి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తేవడంతో యాడికి సీఐ ఈరన్న టీడీపీ శ్రేణుల నుంచి రామ్మోహన్‌ను విడిపించి తీసుకొచ్చారు. యాడికిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను టీడీపీ మూకలు గురువారం పగులగొట్టి బెదిరింపులకు దిగాయి. వైఎస్సార్ సీపీకి చెందిన మరో నాయకుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి దరఖాస్తు చేయవద్దని బెదిరించారు.
దరఖాస్తుకు నేడే చివరి రోజు
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం నాటికి 65,424 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,396 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం చివరి రోజు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు 70 వేలు దాటవచ్చని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12, 13వ తేదీల్లో దరఖాస్తులను పరిశీలించి 14న లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు.
దరఖాస్తులకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టీడీపీ సిండికేట్ బెదిరింపులు తీవ్రమయ్యాయి. టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న వ్యాపారులను టార్గెట్ చేసి నయాపైసా పెట్టుబడి పెట్టకుండా వాటా, గుడ్ విల్ ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. తమను కాదంటే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు.
» రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు తట్టుకోలేక దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. రూరల్ నియోజకవర్గంలో 11 షాపులకు గానూ బుధవారం వరకు 150 దరఖాస్తులే అందాయి. సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇతరులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి సంఘం నేతలను సైతం రంగంలోకి దించారు. నియోజకవర్గంలో 28 షాపులు ఉండగా బుధవారానికి 250 దరఖాస్తులు మాత్రమే అందాయి.
» నిడదవోలులో గతంలో మద్యం వ్యాపారం చేసిన టీడీపీ సీనియర్ నేత తన అనుచరులతో టెండర్లు వేయిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు తమకూ షాపులు ఇవ్వాలంటున్నారు. మంత్రి కందుల దుర్గేష్ అనుచరులు 20 శాతం వాటా ఇవ్వాలని టెండర్లు వేసిన వ్యాపారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. â రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులతో నియోజకవర్గంలో 13 దుకాణాలకు 206 టెండర్లు దాఖలు కాగా వీరంతా దాదాపుగా కూటమి నేతలే కావడం గమనార్హం.
» కొవ్వూరులో టీడీపీ సీనియర్ నేత అనుమతిస్తేనే టెండర్లు దాఖలవుతున్నాయి.
మద్యంపై ‘రౌండ్ ఫిగర్’ బాదుడు
అదనపు ప్రివిలేజ్ ఫీజు పేరిట భారీ దోపిడీకి సిద్ధం
» ‘‘మొత్తం రూ.3,850 అయింది. రౌండ్ ఫిగర్ చేస్తే రూ.5 వేలు అవుతుంది..!’’ ఖలేజా సినిమాలో హీరో డైలాగ్!!
» ‘‘అదేంటీ.. రౌండ్ ఫిగర్ రూ.4 వేలు కదా..?’’ హీరోయిన్ సందేహం!!
» ‘‘రూ.5 వేలులో ఎక్కువ సున్నాలున్నాయి కదా..! అందుకు..’’ హీరో సమర్థన !!
అదే రౌండ్ ఫిగర్ సూత్రాన్ని సీఎం చంద్రబాబు సర్కారు తన విధానంగా చేసుకుంది. ఇప్పటికే టీడీపీ సిండికేట్ ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాలతో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. మద్యం బాటిళ్ల ధరలను సమీపంలోని పదుల సంఖ్యకు చేరుస్తూ రౌండ్ ఫిగర్ చేయాలని నిర్ణయించింది.
రూ.100 కంటే అధికంగా ఉన్న మద్యం బాటిళ్ల ధరలను తరువాత వచ్చే దశాంశ మానానికి మార్చి రౌండ్ ఫిగర్ చేసి ధర నిర్ణయిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు ఉదాహరణను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓ మద్యం బాటిల్ ధర రూ.150.50గా ఉంటే... ఆ బాటిల్ ధరను రూ.160గా నిర్ణయిస్తారు. బాటిల్ ధర రూ.272గా ఉంటే... దాన్ని రూ.280 చేస్తారు. ఈ దందాకు ‘అదనపు ప్రివిలేజ్ ఫీజు’ అని నామకరణం చేస్తూ ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
చిలక్కొట్టుడు కాదు.. భారీ బాదుడే
ఇదేదో చిల్లర సమస్య లేకుండా చేసే చిలక్కొట్టుడు వ్యవహారం కానే కాదు! అదనపు ప్రివిలేజ్ ఫీజు ముసుగులో భారీ దోపిడీకి టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కాగా స్కెచ్ వేసింది. టీడీపీ హయాంలో 2018 నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే.. ఆ ఏడాది 3.84 కోట్ల లిక్కర్ కేసులు, 2.77 కోట్ల బీరు కేసులు విక్రయించారు. కేసుకు 48 లిక్కర్ బాటిళ్ల చొప్పున మొత్తం 184.32 కోట్ల లిక్కర్ బాటిళ్లు... కేసుకు 12 బీరు బాటిళ్ల చొప్పున మొత్తం రూ.33.24 కోట్ల బీరు బాటిళ్లు విక్రయించారు.
వాటిలో 90 శాతం బాటిళ్ల ధర రూ.100 కంటే అధికంగానే విక్రయించారు. ప్రస్తుతం 180 ఎంఎల్ చీప్ లిక్కర్‌ను రూ.99కి విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒక్క కేటగిరీ మినహా మిగిలిన అన్ని బ్రాండ్ల ధర రూ.వంద కంటే అధికంగానే ఉంటుంది.
ఆ ప్రకారం ఒక్కో బాటిల్‌పై రూ.2 నుంచి రూ.9 వరకు అదనంగా దోపిడీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుతంత్రం పన్నింది. ఆ లెక్కన ఏడాదికి ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడతారన్నది అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వమా.. మజాకానా!
Comments
Please login to add a commentAdd a comment