సాక్షి, హైదరాబాద్: ఎక్కడా రహస్యాలు, దాపరికాలు ఉండకూడదంటూ ఊదరగొట్టే రామోజీరావు, తన దినపత్రిక, తన గ్రూపు సంస్థల్లో జరిగే ఉదంతాలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచాలని చూస్తారు. ముఖ్యంగా ఫిల్మ్ సిటీలో ఏం జరిగినా అంత సులభంగా బయటకు పొక్కదు. రామోజీరావు అంగీకరిస్తే తప్ప ఫిల్మ్ సిటీ ఆనే కోటలోకి తమకు కూడా ఎంట్రీ ఉండదని పోలీసు వర్గాలే చెబుతుంటాయి. కాగా ఈ క్రమంలో తమతో పాటు అవస రమైతే ప్రభుత్వం పైనా ఒత్తిడి తీసుకువచ్చి విషయం బయట పడకుండా మేనేజ్ చేస్తారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉదంతాలు కొన్ని గతంలో చోటు చేసుకున్నాయి. అయితే గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో కన్నుమూసింది తమ ఉద్యోగి కాకపోవడం, బయటి వాడైన ప్రవాస భారతీయుడు కావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.
అప్పట్లో 22 మంది ఉద్యోగులు గాయపడినా..
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదాలు చోటు చేసుకోవడం కొత్తేంకాదు. చిన్న చిన్న ఉదంతాలు, తన ఉద్యోగులకు పరిమితమైన, ఒకరిద్దరికి సంబంధించిన అంశాలు ఆ కోట దాటి బయటకు రావు.. రానివ్వరు. కానీ 2008 నవంబర్‌లో చోటు చేసుకున్న ఓ భారీ అగ్నిప్రమాదం.. వారం తర్వాత ‘సాక్షి’ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వార్షిక సమావేశానికి దాని నిర్వాహకులు రామోజీ ఫిల్మ్ సిటీని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయిన తర్వాత వేదిక కూడా ఖరారైంది. ఆ ఏడాది నవంబర్ 2న దాదాపు 3,500 మంది హాజరైన ఆ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు.
ఫిల్మ్ సిటీకి చెందిన సిబ్బంది ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎగరేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టేజీ సమీపంలో దాదాపు 200 హైడ్రోజన్ బెలూన్లను ఉంచారు. ఈ కార్యక్రమం నిర్వహణను అప్పట్లో ఫైర్ సూపర్‌వైజర్‌గా ఉన్న శ్రీనివాసరావు, ఫైర్ మెన్ లక్ష్మణ్‌లు పర్యవేక్షించారు. అయితే ఈ ఉత్సవాలకు హాజరైన ఓ ప్రతినిధి హైడ్రోజన్ బెలూన్ల సమీపంలో సిగరెట్ కాల్చే ప్రయత్నం చేసినా ఫిల్మ్ సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సూపర్‌వైజర్, ఫైర్ మెన్ మాత్రం వారించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆ ప్రతినిధి విసిరేసిన సిగరెట్ పీక సమీపంలో ఉన్న హైడ్రోజన్ బెలూన్లపై పడటం, అవి ఒక్కసారిగా పేలిపోయి మంటలు వ్యాపించడం జరిగిపోయింది.
ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న దాదాపు 22 మంది ఫిల్మ్ సిటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. వీరికి తన కోటలోనే ఉన్న ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించిన రామోజీరావు.. పోలీసులు, అగ్నిమాప శాఖ అధికారుల వరకు విషయం చేరనీయలేదు. తన సంస్థ కోసం పని చేస్తూ గాయపడిన వారికి మొండిచేయి చూపారు. దాదాపు వారం తర్వాత ఈ విషయం నాటకీయంగా వెలుగులోకి రావడంతో హయత్‌నగర్ (అప్పట్లో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా లేదు) పోలీసులు సీన్‌లోకి వచ్చారు. దీంతో విషయం లీక్ చేశారంటూ రామోజీ సైన్యం రాద్ధాంతం చేసింది. చివరకు నామమాత్రంగా సిబ్బందికి సహాయం చేసింది.
ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం
ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచే రామోజీ రావులో మరో టాలెంట్ కూడా ఉంది. తన సంస్థల్లో చోటు చేసుకునే ఉదంతాలు పోలీసు రికార్డులకు ఎక్కకుండా చూడటమే కాదు.. తప్పంతా క్షతగాత్రులు లేదా బాధితులదే అన్నట్టుగా కూడా చూపించగలరు. బాధితులే ఆ విధంగా చెప్పేలా చేయగల నైపుణ్యం రామోజీరావు సొంతం. 2009లో బాలానగర్‌లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లో జరిగిన ప్రమాదమే దీనికి ఉదాహరణ. ఈ ఉదంతాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచిన యాజమాన్యం ఎట్టకేలకు పోలీసులకు తెలిపినా.. ఫిర్యాదు లేకుండా చూసుకుంది.
సీన్ కట్ చేస్తే తప్పు తనదే అంటూ చెప్పిన ఆ బాధితుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కొసమెరుపు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజయ్‌కుమార్ నిరుపేద. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. 2009 మే 19న బాలానగర్‌లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లో పనికి వచ్చాడు. అక్కడి మూడో అంతస్తులో పని చేస్తూ మధ్యాహ్నం వేళ కింద పడ్డాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయం రామోజీ కోటరీకి తెలిపారు. వాళ్ళ ఆదేశాల మేరకు విషయం బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో బిజయ్‌ను ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించాలని ప్రయత్నించారు.
అక్కడ పండ్ల వ్యాపారం చేసే సయ్యద్ ముస్తఫా ఈ వ్యవహారం గమనించి అడ్డుకుని ప్రశ్నించారు. క్షతగాత్రుడికి తక్షణ వైద్యం అందాలనే ఉద్దేశంతో ‘108’కు సమాచారం ఇచ్చారు. ఈ పరిణామంతో కంగుతిన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనపై దాడి చేసి తమపైనే దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ముస్తాఫా ద్వారా ఈ ప్రమాదం విషయం వెలుగులోకి రావడంతో బాలానగర్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో హడావుడిగా బిజయ్‌కుమార్ వద్దకు వెళ్ళిన ఈనాడు సిబ్బంది కథ మార్చేశారు. అదే రోజు అతడిని తీసుకుని బాలానగర్ ఠాణాకు వచ్చారు. తన తప్పిదం వల్లే ఈనాడు కార్యాలయం పైనుంచి కింద పడ్డానని, దీనిపై కేసు వద్దని అతడితోనే రాయించి పంపారు. ఫిర్యాదు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.
విస్టెక్స్ ఉదంతంలోనూ అనేక ప్రయత్నాలు
విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా మరణానికి కారణమైన రామోజీ ఫిల్మ్ సిటీపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న వైఫల్యాలను ఎత్తిచూపారు. అయితే విస్టెక్స్ ఉదంతంలోనూ రామోజీ తన మార్క్‌ను చూపించారు. దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ఆర్‌ఎఫ్‌సీ ఉద్యోగుల ఫోన్లన్నీ స్వాధీనం చేసుకోవాలని, విషయం బయటకు పొక్కనివ్వొద్దని హెచ్చరించారు.
పోలీసులకిచ్చిన ఫిర్యాదులోని అంశాలు రికార్డుల్లోకి ఎక్కకుండా ఉంచేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. జరిగిన ఉదంతంపై కేసు నమోదు చేసుకోవాలని, కానీ భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, అంబులెన్స్ రాక ఆలస్యం కావడం, అదనపు అంబులెన్స్ లేకపోవడం వంటివి ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్‌ఐఆర్) నమోదు కాకుండా చూడాలని అనేక ప్రయత్నాలు చేశారు. అవి రికార్డుల్లోకి ఎక్కి, బయటకు వస్తే ఫిల్మ్ సిటీ వ్యాపారం దెబ్బతింటుదంటూ తమ మందీమార్బలంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. కానీ పోలీసులు ససేమిరా అన్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడమే కాకుండా ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment