ఇటు గ్రామాల అభివృద్ధితోపాటు.... అటు పరిశ్రమలు, ఐటీ అభివృద్ధికి ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రులు కీలకంగా వ్యవహరించనున్నారు. పంచాయతీలకు మరింత పవర్ వచ్చేలా కృషి చేస్తానని.... ఇందుకోసం వార్డు సభ్యుడి నుంచి అంచలంచెలుగా ఎదిగిన తనకు ఆ అనుభవం పనికొస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అంటున్నారు. పరిశ్రమలు, ఐటీ అభివృద్ధికి రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తానని మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హామీనిస్తున్నారు. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కేలా కృషి చేయడంతోపాటు స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా ప్రతీ నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వారు పేర్కొన్న అంశాలు ఇవే..!
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
రాబోయే రెండేళ్ల కాలంలో సాధ్యమైనంత వరకూ గ్రామాల్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతల్ని అప్పగించారనీ, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేసి రుణం తీర్చుకుంటానని బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే...
వార్డు సభ్యుడి స్థాయి నుంచి ఎదిగా...
1988లో వార్డు మెంబర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశాను. బహుశా నా ఈ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలించే పంచాయతీరాజ్‌శాఖను నాకు ముఖ్యమంత్రి కేటాయించారని భావిస్తున్నాను. గ్రామాల్లో సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఏం చెయ్యాలనే అంశాలపై నాకు అవగాహన ఉంది. ఆ అనుభవం ద్వారా పంచాయతీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. గత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాలు, సూచనలు తీసుకొని ప్రస్తుతం చేపడుతున్న పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను. రాబోయే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని పల్లెలు ప్రకాశవంతంగా మారేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకొని దానిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తాను. ప్రస్తుతం జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా చేపడుతున్న పనుల్ని సాధ్యమైనంత వరకూ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను.
రహదారుల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యం
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు అనుసంధానం చేసే అంశానికి ప్రథమ ప్రాధాన్యమిస్తాను. ప్రస్తుతం ఉన్న రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణం మొదలైన పనులపై దృష్టి సారిస్తాను. మార్కెట్ సెస్ ద్వారా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకొచ్చి... వీలైనంత త్వరగా రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాను.
ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించేందుకు కృషి
ఇప్పటి వరకూ ఉపాధి హామీ నిధులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వలంటీర్ల వ్యవస్థపై దృష్టి సారించాం. ఇకపై పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి చేసి.. గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచి.. ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాల్ని పల్లె ప్రజలకు అందించేందుకు కృషి చేస్తాను.
ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కు
స్థానికంగా ఉన్న వనరులు, వసతుల ఆధారంగా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాననీ.. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇంకా ఏమన్నారంటే...
పారిశ్రామిక పార్కులు...!
రాష్ట్రంలో ఉన్న 26 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. స్థానికంగా ఉన్న వనరుల్ని రాబోయే పరిశ్రమలు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఆధారంగా చిన్న లేదా భారీ ఇండస్ట్రియల్ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఈ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉన్న వనరులు వినియోగించుకోవడంతో పాటు అక్కడ యువతకు ప్రత్యక్షంగా ప్రజలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తాను.
విశాఖలో ఐటీ అభివృద్ధి... విశాఖపట్నంలో ప్రస్తుతం ఐటీ పరిశ్రమలు ఉన్నాయంటే అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలవే. ఆయన మరణం తర్వాత చంద్రబాబు హయాంలో పూర్తిగా అథఃపాతాళానికి పడేశారు. మళ్లీ ఇప్పుడు కొత్త ఐటీ పాలసీతో పరిశ్రమలకు రాయితీలు అందిస్తూ... ఇప్పుడిప్పుడే సీఎం వైఎస్ జగన్ ఊపిరిపోస్తున్నారు. విశాఖను ఐటీ హబ్‌గా చెయ్యాలన్నది ముఖ్యమంత్రి సంకల్పం. దానికనుగుణంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు నిరంతరం శ్రమిస్తాను. ఇక రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రస్తుతం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలతో పాటు ఫార్మాస్యుటికల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటాను. స్థానిక ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ పర్యావరణ హితంగా ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేస్తాను.
దుబాయ్ ఎక్స్‌పో ఒప్పందంలోని పరిశ్రమల రాకకు కృషి...
గౌతమ్‌రెడ్డి నిర్వర్తించిన శాఖ బాధ్యతను నాకు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన హయాంలో పైప్‌లైన్‌లో ఉన్న పరిశ్రమలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. దుబాయ్ ఎక్స్‌పోలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా గ్రౌండింగ్ అయ్యేందుకు పాటుపడతాను. అదే ఆయనకు అర్పించే నివాళి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని తీరప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి.
పోర్టులు, ఎయిర్‌పోర్టుల్ని పూర్తి చేస్తాం...
గతంలో ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న తీరప్రాంత అనుకూలతను ఉపయోగించుకునేలా పోర్టులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా విమానాశ్రయాల అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులతోపాటు ఎయిర్‌పోర్టుల్ని వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాను. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై దృష్టి సారిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతుల్ని త్వరగా తీసుకొచ్చి ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment