
సాక్షి, అమరావతి: ఏబీఎన్‌లో తనపై వచ్చిన కథనాలన్నీ ఊహాజనితాలేనని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీఎన్ తనపై ప్రసారం చేసిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాల ప్రతినిధి అయిన తన ప్రతిష్టకు ఏబీఎన్ భంగం కలిగేలా కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడ్డారు.
‘‘తనపై, బీసీ వర్గాలపై ఏబీఎన్ బురద జల్లుతుంది. తన పరువుకు భంగం కలిగేలా కుట్రలు చేసింది. తన వాయిస్ ఏబీఎన్ ట్యాంపరింగ్ చేసింది. గతంలో మీడియా సమావేశం పెట్టి బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులు జడ్జిలుగా ఎందుకు పనికిరారని ప్రశ్నించా?. జడ్జి రామకృష్ణతో జరిపిన సంభాషణలు ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అన్యాయం జరిగిందన్న కోణంలో చేసినవి. నా వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి అంటగట్టడం దురుద్దేశపూర్వకమేనని’’ ఆయన పేర్కొన్నారు.
రామకృష్ణతో నేను మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి వాడారని, న్యాయవ్యవస్థలో వెనుకబడిన వర్గాలకు ప్రాతినిథ్యం ఉండాలని కోరుకునే వ్యక్తినని తెలిపారు. ఓ రాజకీయ పార్టీ ప్రోద్బలంతో ఏబీఎన్ తనపై బురద జల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ ఓ రాజకీయ పార్టీ కోసం పనిచేస్తోందన్నారు. తాను పదవిలో ఉన్నప్పుడు, ఇప్పుడు న్యాయవ్యవస్థపై గౌరవంతోనే ఉన్నానని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు.