త్రిశూల్‌ సిమెంట్స్‌ వ్యాజ్యం ధర్మాసనానికి  | Justice Rao Raghunandan Rao orders Trishul Cements Litigation | Sakshi
Sakshi News home page

త్రిశూల్‌ సిమెంట్స్‌ వ్యాజ్యం ధర్మాసనానికి 

Published Tue, Sep 6 2022 4:56 AM | Last Updated on Tue, Sep 6 2022 3:03 PM

Justice Rao Raghunandan Rao orders Trishul Cements Litigation - Sakshi

సాక్షి, అమరావతి: పరిమితికి మించి ఖనిజాన్ని తవ్వినందుకు పెనాల్టీ కట్టాలంటూ గనుల శాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ త్రిశూల్‌ సిమెంట్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి సోమవారం ధర్మాసనానికి నివేదించారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామంలో లైమ్‌స్టోన్‌ లీజు పొంది, పరిమితికి మించి ఖనిజాన్ని తవ్వి రవాణా చేసినందుకు గనుల శాఖ రూ.100.24 కోట్ల పెనాల్టీ విధించింది.

ఈ పెనాల్టీ చెల్లించాలంటూ 2020 మే 7న డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ త్రిశూల్‌ సిమెంట్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ రావు రఘునందన్‌రావు సోమవారం మరోసారి విచారణ జరిపారు. త్రిశూల్‌ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. మనుగడలో లేని కంపెనీ పేరు మీద నోటీసు ఇచ్చారని తెలిపారు.  

ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలని కోర్టు భావిస్తే, తమకు కొంత రక్షణ కల్పించాలని కోరారు. త్రిశూల్‌ సిమెంట్స్‌ అక్రమాలపై పోరాటం చేస్తున్న తాడిపత్రికి చెందిన వి.మురళీప్రసాద్‌రెడ్డి తరఫు న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ వాదనలు వినిపిస్తూ, తాము దాఖలు చేసిన వ్యాజ్యంతోనే త్రిశూల్‌ అక్రమాలపై ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యం ధర్మాసనానికి వెళ్లడమే సముచితమన్నారు. 

ఆ ఆధారాలను చూస్తే కోర్టు వారిని ఉరి తీస్తుంది 
అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. త్రిశూల్‌ అక్రమాలపై పెద్ద సంఖ్యలో ఆధారాలున్నాయంటూ ఓ పెద్ద పుస్తకాన్ని చూపారు. ఇందులోని ఆధారాలను పరిశీలిస్తే త్రిశూల్‌కు చెందిన వారిని ఈ కోర్టు ఉరి తీస్తుందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపారు.

ఈ వ్యవహారంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా మొదలైన కొన్ని అంశాలను వ్యాజ్యంలో లేవనెత్తారని, అందువల్ల ధర్మాసనమే విచారించడం సబబు అని చెప్పారు. ఈ వ్యాజ్యం ఫైళ్లన్నింటినీ త్రిశూల్‌ సిమెంట్స్‌పై దాఖలైన వ్యాజ్యాలతో జత చేసే విషయంలో పరిపాలన పరమైన ఆదేశాల నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. త్రిశూల్‌ సిమెంట్స్‌పై రెండు వారాలపాటు ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని గనుల శాఖ అధికారులను ఆదేశించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement