Trishul
-
G20 Summit: సరిహద్దుల్లో భారీ సైనిక విన్యాసాలు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) త్రిశూల్ పేరిట భారీ సైనిక విన్యాసాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. త్రిశూల్‌లో భాగంగా రఫేల్ వంటి యుద్ధ విమానాలను, ఎస్–400, ఎంఆర్‌సామ్, స్పైడర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దించనుంది. దీంతోపాటు, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు వేరుగా విన్యాసాలు చేపడతాయి. దేశ ఉత్తర సరిహద్దులతోపాటు ఢిల్లీలో, ఢిల్లీ వెలుపల ఐఏఎఫ్ పలు రక్షణ వ్యవస్థలను మోహరించనుంది. జీ20 సదస్సుకు సమగ్ర గగనతల రక్షణను కల్పించడమే త్రిశూల్ ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తాయి. పారా ట్రూపర్లు, పర్వత ప్రాంత యుద్ధ విద్యలో ఆరితేరిన విభాగాలు సైతం ఇందులో పాల్గొంటాయి. త్వరలో జరిగే జీ20 శిఖరాగ్రానికి 20 మందికి పైగా ప్రపంచ దేశాల నేతలు రానున్న దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం. -
త్రిశూల్ సిమెంట్స్ వ్యాజ్యం ధర్మాసనానికి
సాక్షి, అమరావతి: పరిమితికి మించి ఖనిజాన్ని తవ్వినందుకు పెనాల్టీ కట్టాలంటూ గనుల శాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ త్రిశూల్ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి సోమవారం ధర్మాసనానికి నివేదించారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామంలో లైమ్‌స్టోన్ లీజు పొంది, పరిమితికి మించి ఖనిజాన్ని తవ్వి రవాణా చేసినందుకు గనుల శాఖ రూ.100.24 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ పెనాల్టీ చెల్లించాలంటూ 2020 మే 7న డిమాండ్ నోటీసు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ త్రిశూల్ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రావు రఘునందన్‌రావు సోమవారం మరోసారి విచారణ జరిపారు. త్రిశూల్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. మనుగడలో లేని కంపెనీ పేరు మీద నోటీసు ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలని కోర్టు భావిస్తే, తమకు కొంత రక్షణ కల్పించాలని కోరారు. త్రిశూల్ సిమెంట్స్ అక్రమాలపై పోరాటం చేస్తున్న తాడిపత్రికి చెందిన వి.మురళీప్రసాద్‌రెడ్డి తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ, తాము దాఖలు చేసిన వ్యాజ్యంతోనే త్రిశూల్ అక్రమాలపై ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యం ధర్మాసనానికి వెళ్లడమే సముచితమన్నారు. ఆ ఆధారాలను చూస్తే కోర్టు వారిని ఉరి తీస్తుంది అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. త్రిశూల్ అక్రమాలపై పెద్ద సంఖ్యలో ఆధారాలున్నాయంటూ ఓ పెద్ద పుస్తకాన్ని చూపారు. ఇందులోని ఆధారాలను పరిశీలిస్తే త్రిశూల్‌కు చెందిన వారిని ఈ కోర్టు ఉరి తీస్తుందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా మొదలైన కొన్ని అంశాలను వ్యాజ్యంలో లేవనెత్తారని, అందువల్ల ధర్మాసనమే విచారించడం సబబు అని చెప్పారు. ఈ వ్యాజ్యం ఫైళ్లన్నింటినీ త్రిశూల్ సిమెంట్స్‌పై దాఖలైన వ్యాజ్యాలతో జత చేసే విషయంలో పరిపాలన పరమైన ఆదేశాల నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. త్రిశూల్ సిమెంట్స్‌పై రెండు వారాలపాటు ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. -
త్రిసూల్ సిమెంట్ కంపెనీ లీజు రద్దు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని యాడికిలో మెస్సర్స్ త్రిసూల్ సిమెంట్ కంపెనీ లీజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి.. మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
జేసీ అక్రమాలపై టీడీపీ నేతలు స్పందించాలి
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కందిగోపుల మురళి డిమాండ్ చేశారు. త్రిసూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరుకు సంబంధించి మురళి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జేసీ అక్రమాలపై 2011లోనే హైకోర్టులో కేసు వేశానని అన్నారు. త్రిసూల్ సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులకు సంబంధించి ఎందుకు రద్దు చేయకూడదని హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. నోటీసులు సైతం జారీ చేసిందని అన్నారు. తన పని మనుషుల పేరుతో త్రిసూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు పొందిన ఘనుడు జేసీ అని విమర్శించారు. జేసీ ఆధీనంలో ఉన్న 1600 ఎకరాల త్రిసూల్ ఫ్యాక్టరీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రూ. 500 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి మోసం చేసిన జేసీ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ అక్రమాలపై టీడీపీ నేతలు కూడా స్పందించాలన్నారు. కాగా, త్రిసూల్ సిమెంట్ వ్యవహారంలో జేసీకి నేడు హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. చదవండి : జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టు నోటీసులు -
ఏపీ హైకోర్టులో జేసీ దివాకర్ రెడ్డికి చుక్కెదురు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చుక్కెదురైంది. త్రిసూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై జేసీ కుటుంబ స భ్యులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. త్రిసూల్ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్ణీత సమయంలో నిర్మించలేదని, దానికి కేటాయించిన లైమ్ స్టోన్ గనులు రద్దు చేయాలన్న పిటిషన్‌పై హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రతివాదులుగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమార్తె, కోడలును చేర్చి నోటీసులు జారీ చేసింది. లైమ్ స్టోన్ గనుల లీజు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసులో పేర్కొంది. తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. బినామీలతో జేసీ చేస్తున్న దందాపై 2011లోనే పిటిషన్ వేసినట్లు తాడిపత్రికి చెందిన మురళీప్రసాద్ రెడ్డి చెప్పారు. తమకు న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘త్రిశూల’ వ్యూహంతో టీటీడీలో దళారులకు చెక్
సాక్షి, తిరుమల : కలియుగ వైకుంఠం తిరుమలలో దళారులకు బ్రహ్మాస్త్రంగా మారిన సిఫార్సు లేఖలను నియంత్రించేందుకు టీటీడీ నడుంబిగించింది. త్రిశూల వ్యూహంతో దళారులుకు చెక్ పెట్టే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఏడుకొండలపై ఏళ్లుగా పాతుకుపోయిన దళారీ వ్యవస్థకు మూడు మార్గాల్లో అడ్డుకట్ట వేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. తొలి మార్గం ఇలా.. సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది, భక్తులకు అధిక మొత్తంలో విక్రయిస్తున్న వారిని గుర్తించి, అదుపులోకి తీసుకోవడం. గతంలో మాదిరి కాకుండా వారిపై బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించడం. రెండో మార్గం ఇలా.. దళారులు సిఫార్సు లేఖలు ఎలా పొందుతున్నారో గుర్తించడం. సిఫార్సు లేఖలు అక్రమంగా పొందేవారిని అరికట్టడం. మూడో మార్గం ఇలా.. భక్తులు దళారులను ఆశ్రయించకుండా, సిఫార్సు లేఖలు లేకుండానే బ్రేక్ దర్శనాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధానం అవలంబించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను టీటీడీ ఇప్పటికే ప్రారంభించింది. విజిలెన్స్ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ దళారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు పీఆర్వోల ముసుగులో దళారీతనం చేస్తున్న వారిపై నిఘా ఉంచారు. ఇక నిత్యం సిఫార్సు లేఖలపై టికెట్లు జారీ చేసే జేఈఓ కార్యాలయంలో అక్రమార్కులు వివరాలను గుర్తించి, విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తూ దళారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల పట్టుకున్న దళారీ 65 రోజుల్లో 185 సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది, విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 46 మంది ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలను ఒక దళారీనే పొందాడు. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రజా ప్రతినిధుల పీఏలు వద్ద దళారీలు సిఫార్సు లేఖలను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సిఫార్సు లేఖలు జారీ చేసే ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేయాలని భావిస్తున్నారు. దళారులను పట్టుకున్న సమయంలో అతను సిఫార్సు లేఖలు పొందిన ప్రజా ప్రతినిధులకు సమాచారం అందిస్తే వారు అప్రమత్తంగా వ్యవహరిస్తారని టీటీడీ భావిస్తోంది. సామాన్యుల బ్రేక్ దర్శనానికి ‘శ్రీవాణి’ భక్తులు, దళారులను ఆశ్రయించకుండా ఉండేందు కు శ్రీవాణి పథకంపై భక్తులకు అవగాహన కల్పించాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళంగా అందజేసిన భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనభాగ్యాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎలాంటి సిఫార్సు లేఖ లేకుండానే వీఐపీ ప్రొటోకాల్ దర్శనం లభిస్తుండడంతో భక్తులు కూడా దళారీలను ఆశ్రయించకుండా నేరుగా టీటీడీ పథకానికే డబ్బు చెల్లించవచ్చు. దీంతో స్వామివారికి కానుక సమర్పించామన్న తృప్తి మిగులుతుండడంతో భక్తు లు ఈ పథకంపై మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ఈ పథకానికి వస్త్ను్న విరాళాలే నిదర్శనంగా చెప్పవచ్చు. 10 రోజుల్లో 533 మంది భక్తులు శ్రీవాణి పథకానికి విరాళాలు అందించగా, గత శుక్రవారం ఏకంగా 153 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందజేశారు. దీంతో దళారులను భక్తులు ఆశ్రయించకూండా ప్రత్యామ్నాయ మార్గంగా శ్రీవాణి ట్రస్టును వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఇలా దళారీ వ్యవస్థను అరికట్టేందుకు అన్ని వైపుల టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇంటి దొంగల గుట్టు రట్టు ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరన్న సామెత నిజం కాదన్న విషయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు రుజువు చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో విధుల్లో ఉన్న మధుసూదన్ అనే వ్యక్తి భక్తులకు సులభ దర్శనం చేయిస్తానని పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఘటన వెలుగు చూడగా... అతన్ని విచారించగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటకొచ్చాయి. రోజుకి 25 మంది భక్తుల వరకు టీటీడీ ఉద్యోగి మధుసూదన్ దర్శనా లు చేయిస్తున్నాడు. ఇక ఫోన్ పే ద్వారా 300 ట్రాన్సెక్షన్లు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇంత స్థాయిలో అక్రమాలకు పాల్పడిన దళారీ ఉద్యోగిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. దళారీ వ్యవస్థను మట్టి కరిపిస్తాం తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిస్థాయి లో అణచివేస్తాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనా న్ని సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చి, లంచగొండితనం అరికట్టే వి«ధంగా చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్సింఘాల్ పూర్తిస్థాయి సహాయ సహాకారాలతో ఇప్పటికే పూర్తిస్థాయిలో దళారీ వ్యవస్థను నాశనం చేశాం. శ్రీవాణి ట్రస్టుతో దళారీ అనే పదం ఉండకుండా చేశాం. – టీటీడీ అడిషనల్ ఈఓ ఏవీ ధర్మారెడ్డి -
హీరో.. డీఆర్డీవో మనకే!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : సత్యవేడు మండలం మాదనపాళెంలో హీరో మోటార్స్ వాహనాల తయారీ పరి శ్రమ, ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండలో డీఆర్డీవో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థల యాజమాన్యంతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్థ యాజమాన్యాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఆ రెండు పరిశ్రమలు ఏర్పాటైతే నాలుగువేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..దేశ రక్షణ వ్యవస్థ అమ్ములపొదిలో తిరుగులేని ఆకాశ్, త్రిశూల్, అగ్ని వంటి అస్త్రాలను రూపొందిం చిన డీఆర్డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) పరిశ్రమను జిల్లాలో ఏర్పాటుచేయడానికి 2008లో ఆ సంస్థ ప్రతిపాదించింది. డీఆర్డీవో ప్రతిపాదన మేరకు ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండ, చిన్నతయ్యూరు గ్రామాల పరిధిలోని 1102.30 ఎకరాల భూ మిని అప్పటి కలెక్టర్ శేషాద్రి గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొం డలో సర్వే నెంబర్ 285/1లో 502.30 ఎకరాలు, చిన్నతయ్యూర్‌లో సర్వే నెంబర్ 285/2లో ఆరు వందల ఎకరాలు మొత్తం 1102.30 ఎకరాలను డీఆర్డీవోకు కేటాయిస్తూ ఆగస్టు 13న రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. ఎకరానికి రూ.1.25 లక్షల చొప్పున డీఆర్డీవోకు ఆ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో రూ.600 కోట్లతో క్షిపణుల తయారీ పరిశ్రమ, రక్షణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి డీఆర్డీవో యాజమాన్యంతో మంగళవారం ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సత్యవేడు మండలం మాదనపాళెంలో మో టారు వాహనాల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి హీరో మోటార్స్ సంస్థ ముందుకొచ్చిన విషయం విదితమే. ఆ సంస్థకు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.1600 కోట్ల వ్యయంతో ఏడాదికి ఎనిమిది మిలియన్ల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఎస్ఆర్పురంలో ఏర్పాటుచేసే డీఆర్డీవో పరిశ్రమ ద్వారా వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పదేళ్లపాటు వ్యాట్(విలువ ఆధారిత) పన్ను, సీఎస్టీ(సెంట్రల్ సేల్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపు, విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, భూమి ధరల్లో రాయితీ ఇస్తేనే మోటారు వాహనాల సంస్థను ఏర్పాటుచేస్తామని హీరో మోటార్స్ మెలిక పెట్టింది. కేంద్రం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీపై ఆశలు పెంచుకున్న ప్రభుత్వం ఆ మేరకు హీరో మెటార్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పేర్కొనడం గమనార్హం.