సీఎం వైఎస్ జగన్ సచివాలయాలు ఏర్పాటు చేస్తామన్నప్పుడు కొందరు హేళన చేశారు
అయినా, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు
మనకు 1.36 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు
మరో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించారు
ఇంకొకరైతే వ్యవస్థ ఏర్పాటు నుంచి నియామకాలయ్యేసరికి ఎన్నికలొచ్చేవి
సీఎం జగన్ కరోనా కాలంలో అధికారులు వద్దన్నా వినకుండా ప్రొబేషన్ ఇచ్చారు
మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నించారు
ఈ వ్యవస్థ పనికిమాలినదని ఓ ముఖ్య నాయకుడు అన్నాడు
వలంటీర్ల గురించి మరో నేత నీచంగా మాట్లాడారు
సీఎం జగన్ మనపై నమ్మకముంచి కీలకమైన స్థానం కల్పించారు
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం.. ప్రజలను చైతన్యపరుద్దాం
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, అమరావతి: ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే మారుమూల గ్రామీణ ప్రజలకు సైతం సొంత గ్రామాల్లోనే సంపూర్ణంగా ప్రభుత్వ సేవలందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు.
ఈ వ్యవస్థ ద్వారా 1.36 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. మరో 2.66 లక్షల మందిని వలంటీర్లగా నియమించారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందారు. అందువల్ల మనకు లక్షల ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిష్టను మనమూ పెంచుదాం’ అంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి సచివాలయాల ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఏపీజీఈఎఫ్ సెక్రటరీ జనరల్ అరవ పాల్, సచివాలయాల ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ట్రెజరర్ మధుబాబు తదితరులతో కలిసి శుక్రవారం అనంతపురంలో ఈ లేఖను విడుదల చేశారు. బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలు..
ఇచ్చిన మాట ప్రకారం..
‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది ఉద్యోగులను నియమించి ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం రాకుండా అన్ని సేవలూ గ్రామంలో వారి ఇంటి దగ్గర అందిస్తామని చెప్పినప్పుడు కొందరు హేళన చేశారు. కానీ ప్రజలు నమ్మారు. బ్రహ్మరథం పట్టారు. చెప్పిన మాట ప్రకారమే వైఎస్ జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే పాలనా వ్యవస్థలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు.
కొన్ని సమస్యలు ఉండొచ్చు.. కానీ..
సచివాలయాల ఉద్యోగులకు సమస్యల్లేవని, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. సమస్యలు ఒకటి పోతే ఒకటి రిటైరయ్యే వరకు వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందాం. సీఎం వైఎస్ జగన్ ఎన్నో కష్టనష్టాలకోర్చి సచివాలయాల వ్యవస్థను రూపుదిద్దుతుంటే ఓర్చుకోలేని కొందరు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రొబేషన్ ఖరారు కాకముందు ఎంత మంది హేళన చేశారో అందరికీ తెలుసు. ఒక మాజీ మంత్రి మేం అధికారంలోకి వస్తే సచివాలయాల ఉద్యోగులను తొలగిస్తామని అన్నట్టు వార్తలు వచ్చాయి. మరో ముఖ్య నాయకుడు ఈ వ్యవస్థ పనికిమాలినదని అన్నాడు.
ఇంకో నాయకుడు ఈ వ్యవస్థలో భాగమైన వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడాడు. కానీ ఈరోజు ఎవరైనా మన సచివాలయ వ్యవస్థను టచ్ చేయగలరా? ఒకవైపు ఈ వ్యవస్థ గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కొందరు చూస్తుంటే.. సీఎం జగన్ సచివాలయాల ఉద్యోగులపై నమ్మకముంచి కీలకమైన స్థానం కల్పించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడానికి కొన్ని చానళ్లు, పత్రికలు విషపు రాతలతో అసత్యాలు ప్రచారం చేస్తూ మానసిక దాడి చేస్తున్నాయి. ఈ దుష్ప్రచారాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపైనే ఉంది. ప్రజలకు వాస్తవాలు వివరించడానికి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరూ రోజుకు ఇద్దరిని చైతన్యం చేయాలి. ఇలా రాబోయే 50 రోజుల్లో కనీసం వంద మందిని చైతన్యం చేయాలని కోరుతున్నా’ అనివెంకట్రామిరెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
ఇంకెవరన్నా అయితేనా..
‘వైఎస్ జగన్ కాకుండా వేరే ఎవరైనా సచివాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయాలనుకుంటే.. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంవత్సరం పట్టేది. ఆ తర్వాత ఉద్యోగాల నియామక నోటిఫికేషన్‌కు మరో సంవత్సరం, పరీక్షలకు ఇంకో సంవత్సరం, నియామకాలకు మరో సంవత్సరం తీసుకొనేవారు. 2024 ఎన్నికలకు నియామకాలు చేపట్టి, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిపిస్తేనే ప్రొబేషన్ ఇస్తామని ఓట్ల రాజకీయం చేసేవారు. కానీ, మన ముఖ్యమంత్రి అవేమీ ఆలోచించకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే ఇంత పెద్ద వ్యవస్థకు ప్రాణం పోశారు.
తర్వాత 010 పద్దు కింద జీతాలు ఇచ్చారు. ప్రసూతి సెలవులు ఇచ్చారు. ప్రొబేషన్ ఖరారులో ఇబ్బంది లేకుండా శాఖాపరమైన పరీక్షల్లో నెగెటివ్ మార్కులు తొలగించారు. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కరోనా రూపంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవడంతో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ వాయిదా వేయాలని అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకోలేదు. ప్రొబేషన్ డిక్లేర్ చేసి, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చారు.’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment