
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల వలన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో మొదటి స్థానంలో నిలిచామని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చేసిన సర్వేల కంటే ఈ సారి సర్వే పూర్తిస్థాయిలో చేశారన్నారు. 100 శాతం స్టేక్ హోల్డర్ల తో సర్వే చేశారని, గతంలో ఎప్పుడు ఇలా సర్వే చెయ్యలేదని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ నంబర్ 1)
‘‘గత ఏడాది చివరిలో కేంద్రానికి సమాచారాన్ని పంపాం. ఈ ఏడాది మార్చిలో స్టేక్ హోల్డర్ల సర్వే చేశారు. ఇన్వెస్టర్లు, ఆడిటర్లు, లాయర్లు సహా అందరిని సర్వే చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలపై సర్వే లో వంద శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడు ఇలా సర్వే చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక 10 రోజుల్లోనే భూములను కేటాయించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. భూమి, నీరు, పవర్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో మరిన్ని పారిశ్రామిక సంస్కరణలు చేపడతామని ఆయన వెల్లడించారు. (చదవండి: సీఎం జగన్ సంకల్పం.. ఏపీ నెంబర్ వన్)