సాక్షి,ఏలూరు టూ టౌన్: రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈనాడు’ వేస్టు పేపర్‌లా, టిష్యూ పేపర్‌లా మారిందని, ప్రభుత్వంపై బురద చల్లేందుకే అసత్య కథనాలు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో అప్పులు, వేల కోట్లు దారి మళ్లింపుపై ఎందుకు రాయలేదని నిలదీశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పౌర సరఫరాల శాఖలో మార్పులు చేశారని, రైతులకు మేలు చేసేలా ధాన్యం కొనుగోలులో దళారులు, మిల్లర్ల పాత్ర లేకుండా చేశారని తెలిపారు. రవాణా, గోనె సంచులు, హమాలీ చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇటీవలి రబీ సీజన్‌లో ధాన్యంలో నూక శాతం ఎక్కువగా వచ్చినా ఒక్క రూపాయి కూడా కోత లేకుండా రైతులకు మద్దతు ధర మొత్తం చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, రూ.28,402 కోట్ల విలువైన 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని తెలిపారు.
అందులో ఇప్పటివరకు రైతులకు రూ.28,200 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.200 కోట్లు సమయంలోగా చెల్లిస్తామన్నారు. జయ బొండాలు ధాన్యాన్ని కేరళ ప్రభుత్వం కోరిక మేరకు మన రైతులు పండించారని, దానిని ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు కొన్నారని, దీనివల్ల లక్ష్య సాధన తగ్గిందన్నారు. ‘మార్గదర్శి’లో వేల కోట్లు దారి మళ్లించారని, దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టడం ఖాయమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment