సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో తమతో ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై నవయుగ పోర్ట్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అప్పీల్‌ను విచారిస్తున్న ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి (జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు) గతంలో నవయుగ కంపెనీతో కలిసి పని చేశారని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
దీంతో ఈ అప్పీల్‌ను జస్టిస్ సోమయాజులు సభ్యుడిగా లేని ధర్మాసనం విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. ఈ అప్పీల్ విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటవుతుందని, విచారణను ఈ నెల 9న చేపడతామని పేర్కొంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సింగిల్ జడ్జి తీర్పుపై నవయుగ అప్పీల్..
నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జీవో 66 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ నవయుగ హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల తుది విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందనరావు ప్రభుత్వ జీవోను సమర్థించారు. జీవో 66ను సవాలు చేస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.
ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనల ప్రకారం బాధ్యతలను నిర్వర్తించడంలో నవయుగ విఫలమైందన్నారు. ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయడం సబబేనని తేల్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ సీజే ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ప్రస్తావించిన ఏజీ శ్రీరామ్..
తాజాగా ఈ అప్పీల్ విచారణకు రాగా నవయుగ పోర్ట్ లిమిటెడ్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుని,అప్పీల్‌ను విచారిస్తున్న న్యాయమూర్తుల్లో ఒకరు గతంలో నవయుగ కంపెనీతో ఉన్నారని తెలిపారు.
ఏదైనా కేసును విచారిస్తున్న న్యాయమూర్తుల్లో ఎవరికైనా ఆ కేసుకు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రయోజనాలుంటే ఆ విషయాన్ని ముందుగానే వారి దృష్టికి తేవాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పిందని ప్రస్తావించారు. దాని ప్రకారం ఈ కేసులో ఓ న్యాయమూర్తి గతంలో నవయుగ కంపెనీతో ఉన్నారన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెస్తున్నట్లు ఏజీ చెప్పారు.
నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కు నవయుగ కంపెనీ లీడ్ ప్రమోటర్‌గా ఉందని వివరించారు. అయితే తామేమీ ఆ న్యాయమూర్తిపై ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదన్నారు. ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు దృష్టికి తెస్తున్నట్లు చెప్పారు. ఏజీగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని తెలిపారు.
కొంత సమయం పడుతుంది..
నవయుగ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ బందరు పోర్టు పనులను మరో కంపెనీకి అప్పగించేందుకు సర్వం సిద్ధమైందన్నారు. ఈ విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఇందుకు ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ ఈ ప్రాజెక్టు మొదలయ్యేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
ఇప్పటికి ప్పుడు అయ్యేదేమీ లేదన్నారు. అలా అయితే తమ అప్పీల్‌పై శుక్రవారం విచారణ జరిపినా అభ్యంతరం లేదని దమ్మాలపాటి పేర్కొనడంతో దీన్ని ప్రత్యేక ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేస్తూ సీజే ఉత్తర్వులు జారీ చేశారు.
కోర్టు ప్రొసీజర్ అందరికీ ఒకేలా ఉండాలి...
ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి ఈ అప్పీల్ విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తామిద్దరిలో ఒకరికి మాత్రమే ఈ కేసులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ తామే ఈ అప్పీల్‌ను విచారిస్తే దీన్ని ప్రధాన కారణంగా చూపుతూ సుప్రీంకోర్టుకెళ్లే అవకాశం ఉందన్నారు.
అలాంటి పరిస్థితికి తావు లేకుండా ఈ అప్పీల్‌ను మరో ధర్మాసనం విచారించడం నైతికంగా ఉత్తమమని సీజే స్పష్టం చేశారు. కేసుల్లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ కోర్టు విధి విధానాలు మాత్రం అందరికీ ఒకేలా ఉండాలని సీజే తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment