పేదలకు డబ్బు ఆశ చూపి,తప్పుడు పత్రాల సృష్టి
గుంటూరులో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
విజయవాడ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): గుంటూరులో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ మూలాలు బెజవాడలోనే ఉన్నట్టు తేలడం కలవరం సృష్టిస్తోంది. ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్న వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీ రాకెట్ నడుపుతున్నారు. అందుకోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నారు. నగరంలో జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయంటున్నారు.
గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన 31 ఏళ్ల గార్లపాటి మధుబాబుకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బాషా అనే వ్యక్తి కిడ్నీ అమ్మితే రూ.30 లక్షలు ఇస్తామని నమ్మబలికాడు. వెంకట్ అనే మరో మధ్యవర్తిని పరిచయం చేసి మధుబాబును విజయవాడ రప్పించారు. జూన్ 10న అతడిని బెజవాడలోని ఓ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి.. 15వ తేదీన శస్త్రచికిత్స ద్వారా కిడ్నీ కాజేశారు.
రూ.30 లక్షలు ఇస్తామని.. కేవలం రూ.1,09,500 మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని బాధితుడు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన విదితమే. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఇదే తరహాలో మరో ఐదుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్టు బాధితుడు ఆరోపించారు.
గతంలోనూ ఇదే తీరు
కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం దొంగ పత్రాలు సృష్టించేందుకు విజయవాడలోని భవానీపురం తహసీల్దారుకు ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా.. తహసీల్దారు తిరస్కరించారు. అవి తప్పుడు ధ్రువీకరణ పత్రాలుగా నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం ఏలూరుకు చెందిన బాధితుడు తన కిడ్నీ తీసుకుని.. డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారంటూ ఏడాది కిందట అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో తనకు డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నానని, ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదని మరో బాధితుడు ఏడాదిన్నర క్రితం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. వైద్యులు అతనికి డబ్బులిచ్చి అల్లరి కాకుండా కప్పిపుచ్చారు.
విచారిస్తే అనేకం వెలుగులోకి
నగరంలో జరుగుతున్న కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలపై విచారణ జరిపితే మరిన్ని కేసులు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ రాకెట్ వెనుక కొందరు ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖ ఉన్నతాధికారులు దృష్టి పెడితే అనేక అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. రోగి ఎవరు, కిడ్నీ దాత ఎవరూ అనేది క్షేత్రస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు: డీఎస్పీ
గుంటూరు ఈస్ట్: కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబును నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో వెస్ట్ డీఎస్పీ మహేశ్ మంగళవారం విచారించారు. అనంతరం మధుబాబు నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. డీఎస్పీ మహేశ్ మాట్లాడుతూ కిడ్నీ రాకెట్ కేసు త్వరితగతిన ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని మధుబాబు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరించామని, దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో కేసును ట్రాన్స్‌ఫర్ చేయాలా, లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులను సంప్రదించి, తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment