కైకలూరు: కొల్లేరు గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. గతంలో ఇక్కడి ప్రజల అమయాకత్వాన్ని ఆసరా చేసుకుని టీడీపీ నాయకులు అభయారణ్యాన్ని అందినకాడికి దోచుకున్నారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. దీంతో కొల్లేరు లంక గ్రామాలు సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుని కృతజ్ఞత తెలుపుతున్నాయి. భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు.
రాష్ట్రంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంగా 5 కాంటూరు వరకు 77,138 ఎకరాలు గుర్తించారు. వీటి పరిధిలో 122 పరివాహక గ్రామాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో కొల్లేరు గ్రామాలన్నీ ఏలూరు జిల్లా గూటికి చేరాయి. కొల్లేరు ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ళ పాలన చూసి తమ గ్రామాలను సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుంటున్నాయి.
ఇందుకు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నాంది పలికింది. కైకలూరు మండలం శృంగవరప్పాడు, చటాకాయి, పందిరిపల్లిగూడెం, మండవల్లి మండలం కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు గ్రామంలో ఘన స్వాగతం పలికి, ముకుమ్మడిగా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ ప్లీనరీకి కూడా వేలాదిగా కొల్లేరు ప్రజలు హాజరవడం విశేషం. గడప గడపకు కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.
కొల్లేరు ప్రజలకు మేలు ఇలా..
స్వచ్ఛ కొల్లేరు సాకారంలో భాగంగా ఉప్పుటేరుపై రూ.412 కోట్లతో మూడు రెగ్యులేటర్లు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ఇదే జరిగితే సముద్రపు ఉప్పునీరుని అరికట్టడంతో పాటు కొల్లేరులో నిత్యం నీరు ఉంటూ చేపల వేటకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ డెవలప్‌మెంటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్‌పర్సన్‌గా సైదు గాయత్రీ సంతోషికి అవకాశం కల్పించారు. రూ.4 కోట్లతో కొల్లేరు రీ సర్వేకు సిద్ధం చేశారు. కొల్లేరు కాంటూరు వారిగా సర్వే పూర్తయితే 70 వేల ఎకరాలు మిగులు భూమిగా వెల్లడవుతుంది. ఇక బాహ్యప్రపంచానికి కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసే కొల్లేటికోట పెద్దింట్లమ్మ వారధిని రూ.14.70 కోట్లతో చేపట్టారు.
కులమతాలకు అతీతంగా పథకాల లబ్ధి
పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను కొల్లేరు లంక గ్రామాల్లో అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కొల్లేరుకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మోసం చేశాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా మరిన్ని మారడానికి సిద్ధంగా ఉన్నాయి.
– దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఎమ్మెల్యే
కొల్లేరుకు న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం
కొల్లేరు ప్రాంత ప్రజలకు నిజమైన న్యాయం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుంది. ఒక మహిళగా నాకు రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. గతంలో ఈ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే మా సామాజికవర్గం అయినా కనీసం గ్రామాలను పట్టించుకోలేదు. రానున్న రోజుల్లో అన్ని కొల్లేరు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారతాయి.
– సైదు గాయత్రీ సంతోషి, రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్
వైఎస్సార్‌సీపీపై పూర్తి నమ్మకం ఉంది
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కొల్లేరు గ్రామాల్లో పర్యటించి మా సమస్యలు తెలుసుకుంటున్నారు. మా గ్రామల్లో అందరికి పథకాలు చేరుతున్నాయి. ఇటీవల కొల్లేరులో వేటకు కొత్త లైసెన్సు ఇచ్చారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించారు. వైఎస్సార్‌సీపీపై పూర్తి నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నాం.
– జయమంగళ తిరుపతి వెంకన్న, సర్పంచ్, కొవ్వాడలంక, మండవల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment