ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ నేతలకు, తెలుగుదేశం మీడియాకు చాలా నిరాశ మిగిల్చారు. ఆయన మంత్రివర్గంలో మార్పులు చేస్తారని, తద్వారా కొందరిలో కొత్తగా అసంతృప్తి వస్తుందన్న వాళ్ల ఊహలకు జగన్ గండి కొట్టారు. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ తన సొంత బలంతో గెలవాలని అనుకోవడం లేదు. తన సొంత ఆలోచనలతో ముందుకు రావాలని అనుకోవడం లేదు. అంతెందుకు తనకంటూ ఒక విధానాన్ని కూడా నిర్దేశించుకోలేకపోతోంది.
తెలుగు దేశం పార్టీ.. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని చెబుతూనే వాటిని ఎలా వ్యతిరేకించాలా? అనే తర్జనభర్జన పడుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారానికి జగన్ తెర వేయడం వల్ల టీడీపీకి చాలా నష్టం కలిగినట్లే ఉంది. ఆ ప్రచారం జనంలో ఉంచగలిగితే, టీడీపీ కేడర్‌లో కొంత ఉత్సాహం నింపవచ్చన్నది బహుశా వారి ఆశ కావచ్చు. అలాగే విదేశాలలో స్థిరపడిన టీడీపీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడానికి ఇది ఒక మార్గంగా అనుకుని ఉండవచ్చు. కానీ, ముందస్తు ఎన్నికలు లేవని తేలిపోవడంతో విరాళాలు ఇచ్చేవారు కూడా ఇప్పటికిప్పుడు ముందుకు రావకపోవచ్చు. పైగా..
శాంతంగా సీఎం జగన్..
మరో ఆరునెలలపాటు పార్టీ ఉనికిని రక్షించుకోవడానికి తంటాలు పడవలసి వస్తుంది. ఇది ఒక కోణం అయితే.. జగన్ కనుక కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వడం లేదని చెప్పే అవకాశం ఉందని ఒక వర్గం మీడియా ఏకధాటిగా ప్రచారం చేసింది. ఎమ్మెల్యేలు కొందరిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయవచ్చని భావించింది కూడా. కానీ పరిస్థితి అలా లేకుండా పోయింది. జగన్ చాలా శాంతంగా తన అభిప్రాయాలను చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంది. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపరచుకోవాల్సిన విషయాన్ని కూడా ఆయన వదలిపెట్టలేదు. ఈ మొత్తం వ్యవహారంలో నిరుత్సాహానికి గురైన తెలుగుదేశం మీడియా రివర్స్ లో వార్తలు రాసింది.
చంద్రబాబుకు బూమరాంగ్
జగన్ ఆత్మరక్షణలో పడ్డారని, ఎమ్మెల్యేలను ఏమీ అనుకుండానే సమావేశం ముగించారని , స్వరం మార్చారని ఇలా తోచిన వార్తలు రాశారు. నిజానికి ఇందులో జగన్ డిఫెన్స్ లో పడింది ఏముంది? ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ట్రయల్ గా భావించి తనను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు వచ్చే శాసనసభ ఎన్నికలకు టిక్కెట్ ఇవ్వలేనని ఫెయిర్ గా చెప్పేశారు. దాంతో వారు తెలుగుదేశం ట్రాప్ లోకి వెళ్లారు. వారు అమ్ముడుపోయారన్న ఆరోపణలను వైసిపి చేసింది. చంద్రబాబు ఎప్పటిమాదిరే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ రకంగా ఆయన అఫెన్స్ గేమ్ ఆడితే , టిడిపి మీడియాకు మాత్రం అది డిఫెన్స్ గా కనిపించిందని అనుకోవాలి.
ఏ ఎమ్మెల్యేలతో ఎలా మాట్లాడాలో జగన్ కు మాత్రం తెలియదా!. పన్నెండేళ్లుగా అన్నిటిని కాసి వడపోశారు. తమను మించి ఉద్దండులు లేరనుకునే చంద్రబాబు అండ్ కో కి జగన్ చుక్కలు చూపించి అధికారంలోకి వచ్చారు. అలాంటి నేతకు ఎవరితో ఎలా ఉండాలో టీడీపీ మీడియా చెప్పాలా? యాభై ,అరవై మందికి టిక్కెట్లు ఇవ్వరని లిస్టు కూడా తయారు చేసి ,వారిలో ఇంతమంది పార్టీ నుంచి వెళ్లిపోతారని కూడా ప్రచారం చేస్తారని ఎల్లో మీడియా గురించి వైఎస్సార్‌సీపీ నేతలకు జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. పైగా వైసీపీ ఎమ్మెల్యేలను శత్రువులుగా ప్రొజెక్టు చేయడానికి యత్నిస్తున్నారని జగన్ తెలిపారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని, దుష్టచతుష్టయం మారీచుల ముఠా వంటిదని ఆయన నొక్కి చెప్పారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకోవాలని ఆయన స్పష్టంగానే పేర్కొన్నారు.
ఆ ప్రచారాలన్నీ.. ప్చ్
గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ,లేనప్పుడు ఎమ్మెల్యేలకు , ఇన్ చార్జీలకు తన సర్వేలలో వచ్చిన గ్రేడ్ లు ఇచ్చేవారు. అప్పుడు చంద్రబాబు వ్యూహరచన , పార్టీని నడిపే తీరు వేరని ప్రచారం చేసేవారు. అదే జగన్ తన ఎమ్మెల్యేలపై సమీక్షలు చేస్తే మాత్రం భిన్నమైన కధనాలు ఇస్తున్నారు. ముందస్తు ఎన్నికలపై ఎంత ప్రచారం చేశారో చెప్పలేం. నిజంగానే జగన్ అందుకు సిద్దం అవుతున్నారేమో అన్నంతగా ప్రజలను నమ్మించే యత్నం చేశారు.జగన్ డిల్లీ వెళితే చాలు.. అక్కడ కేంద్ర పెద్దలతో ముందస్తు ముచ్చటే మాట్లాడారన్నట్లుగా వదంతులు సృష్టించారు. కాని అవేవి వాస్తవం కాదని, దూది పింజల మాదిరి తేలిపోయింది.
నిజానికి తెలుగుదేశం పార్టీనే గతంలో ముందస్తుకు వెళ్లే ఆలోచనలు చేసింది. 1984లో టిడిపిలో తిరుగుబాటు తర్వాత ఎన్.టి.ఆర్. అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. తదుపరి 1989 లో అసెంబ్లీ రద్దు చేసి లోక్ సభతో పాటు ముందస్తు ఎన్నికలకు ఎన్.టి.ఆర్.సిద్దం అయ్యారు. 1985లో గెలుపొందినా, 1989లో మాత్రం దారుణంగా పరాజయం కావల్సి వచ్చింది. గతంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద నక్సల్స్ బాంబులు పేల్చారు. అదృష్టవశాత్తు ఆయనకు పెద్దగా దెబ్బలు తగలలేదు. అయితే నక్సల్స్ దాడివల్ల తనకు సానుభూతి వస్తుందని ఆశించి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆయన ప్రభుత్వం ఓటమిపాలైంది.
సంక్షేమంతోనే జనాల్లోకి సీఎం జగన్ ..
తెలంగాణ లో గత టర్మ్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరునెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఏపీలో జగన్ ఎప్పుడూ ఇంతవరకు అలాంటి ఆలోచన ఉన్నట్లు చెప్పలేదు. కనీసం సంకేతం కూడా ఇవ్వలేదు. కాని వదంతులు మాత్రం విస్తారంగా సృష్టించారు. వీటన్నిని ఆయన కొట్టిపారేశారు. జగన్ తన ప్రభుత్వం వల్ల లబ్దిపొందిన వారంతా తనకు మళ్లీ మద్దతు ఇస్తారని గట్టిగా విశ్వసిస్తున్నారు. 87శాతం మంది సంక్షేమ పథకాల ఫలాలను అనుభవించారని ఆయన వివరించారు. అందువల్ల తనకు పాజిటివ్ ఓటు వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ప్రస్తావించి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు తేడా ఉందని ఆయన విశ్లేషించారు. ఇది నిజమే.
జగన్ కొత్తగా మరో రెండు కార్యక్రమాలు చేపట్టడం విశేషం. జగనన్నకు చెబుదాం అన్నది ఒకటైతే, జగనన్నే మన భవిష్యత్తు అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇవి వచ్చే ఎన్నికలనాటికి అత్యంత ప్రజాదరణ పొందే విధంగా రూపొందించారు. ఇలా జగన్ తన సొంత ఆలోచనలతో కార్యక్రమాలు స్కీములు అమలు చేసుకుని పోతుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలో తెలియక కొట్టుమిట్టాడుతోది. ఆ నేపధ్యంలో ఆ పార్టీ స్పష్టతను కొరవడి గందరగోళంగా రాజకీయం చేస్తోంది.
::: కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment