జగన్‌ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం | Sakshi
Sakshi News home page

జగన్‌ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం

Published Tue, Apr 30 2024 2:16 AM

Kona Venkat Exclusive Interview With Sakshi

గ్రామాల్లో నిజమైన అభివృద్ధి ఇప్పుడే కనిపిస్తోంది 

సర్కారు బడుల రూపు రేఖలే మారిపోయాయి 

బడిపిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనంతో పాటు అన్నీ నాణ్యమైనవే... 

అత్యాధునిక ఎక్విప్‌మెంట్స్‌తో ఆస్పత్రుల్లో సరికొత్త సేవలు 

పూర్తి సౌకర్యాలతో రూపుదిద్దుకున్న పేదలకిచ్చిన ఇళ్ల కాలనీలు 

ఇవి నేను స్వయంగా గమనించిన విషయాలు 

సాక్షితో సినీ దర్శక, రచయిత కోన వెంకట్‌ 

ఊరూరా కళ్లెదుటే మార్పు 
‘ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండవని చాలా మంది అనుకుంటారు. మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్‌ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్‌మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్‌ స్పెషల్‌ ఐసీయూ, సొంత ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు’ అంటున్నారు సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్‌. చిన్న చిన్న గ్రామాల్లో కూడా హెల్త్‌ క్లినిక్స్, రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు, డిజిటల్‌ బోధన కళ్లెదుటే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత మార్పునకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని నొక్కి చెబుతున్నారు.  

‘చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అది వినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మంచి చెబితే ఏదో ఆశించి భజన చేస్తున్నాం అంటారు. అంటే అనుకోనీయండి. కానీ నిజం చెప్పకపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడమే అని నా అభిప్రాయం. అందుకే నేను నిజాలు చెబుతున్నాను’ అంటున్నారు సినీ దర్శక, రచయిత కోన వెంకట్‌. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి, వాటి గురించి ససాక్ష్యంగా వరుసగా ట్వీట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..    –సత్యార్థ్‌  

బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలోని మారుమూల గణపవరం అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించా. అక్కడి పిల్లలతో కలిసి నిమ్మకాయ పులిహోర తిన్నా. రాగిజావ తాగా. ఉచితం అంటే ఎలా ఉంటాయో అని మనం అనుకుంటాం. కానీ మన అంచనాలన్నీ తప్పని అక్కడ ఆహారం తిన్నాక స్పష్టమైంది. అక్కడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. అంతేకాదు ట్యాబ్స్, స్కూల్‌ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్‌... అన్నీ నాణ్యమైనవే ఇచ్చారు. 

పాఠశాల వాతావరణం బాగుంటే సానుకూల ఫలితాలు వస్తాయి కదా... అదే ఇప్పుడు కనిపిస్తోంది. మేం చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు, సౌకర్యాలు ఉంటే మరింత బాగా రాణించేవాళ్లం కదా అనిపించింది. టీచర్లు, సిబ్బంది కూడా కొత్త ఉత్సాహంతో కనిపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పటికప్పుడు ఆ టీచర్లు అందరికీ శాలువాలు తెప్పించి సన్మానించాను. 

పల్లెలకు చికిత్స 
ప్రభుత్వ ఆస్పత్రులు.. అదీ మారుమూల గ్రామంలో ఎలా ఉంటాయో అనే దానిపై మనం ఒక మైండ్‌ సెట్‌తో ఉంటాం. అయితే మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్‌ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్‌మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్‌ స్పెషల్‌ ఐసీయూ. అంతేకాదు.. సొంత ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు. 

నేను వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రికా, లేక కార్పొరేట్‌ ఆస్పత్రికా అన్న ఆశ్చర్యం కలిగింది. కొన్నేళ్ల క్రితం వరకూ గర్భిణులు సైతం డెలివరీల కోసం చీరాల, తెనాలి అంటూ పొరుగూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక మరో మారుమూల ఉన్న కొత్త నందాయపాలెం అనే చిన్న గ్రామంలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ చూశా. అదీ అద్భుతం అనే చెప్పాలి. ఆ హెల్త్‌ క్లినిక్‌లో ల్యాబ్‌ కూడా పెట్టారు. అక్కడికక్కడ రక్త పరీక్షలు, బీపీ, షుగర్‌ టెస్ట్‌లు చేస్తూ మందులు ఇస్తున్నారు. అక్కడ సేవలందించే డాక్టర్స్‌ విశ్రాంతి తీసుకోవడానికి క్వార్టర్స్‌ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పక్కా ప్రణాళికతో ఈ విలేజ్‌ క్లినిక్స్‌ని డిజైన్‌ చేశారో ఆలోచించండి. 

నా కళ్లు నేనే నమ్మలేనంత గొప్పగా ఇళ్లు 
పేదలకిచ్చిన ఇళ్లను గమనించడానికి మాకు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించా. చెబుతుంటే అతిశయోక్తిలా ఉంటుందేమో. హైదరాబాద్‌లోని గచ్చి»ౌలిలో ఉన్న విల్లా కమ్యూనిటీలాగా అనిపించింది. అది కూడా ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కట్టిన కాలనీ కాదు. బాపట్ల ఎంట్రన్స్‌లో హైవే పక్కనే కట్టించి ఇచ్చారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాదు చక్కగా, పరిశుభ్రంగా అన్ని వసతులతో నిర్వహిస్తున్నారు. 

అక్కడ తాపీ పనిచేసే ఒక ముస్లిం కుటుంబంతో పాటు అనేక మందితో ముచ్చటించినప్పుడు వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని చూస్తే పేదలకు ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉంటుందా? అనిపించింది. ఎందుకంటే వాళ్ల జీవితంలో ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం. నాకు కూడా అలాంటి చోట ఒక ఇల్లు ఉంటే బాగుండు అన్నంత బాగుంది. 

రోడ్లపై జరుగుతోంది దు్రష్పచారమే...
రహదారుల విషయంలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం జరుగుతోంది. దీనిని నిర్ధారించుకోవడానికి నేను మా ఊరి చుట్టుపక్కల రహదారుల్ని సర్వే చేశాను. అదంతా అబద్ధమేనని తేలింది. మీరు నమ్ముతారా? మా బాపట్లకి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ కూడా ఉంది. ఇక గ్రామ సెక్రటేరియట్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో సందర్శిస్తాను. 

ఆం«ధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మంచిని కనపడనీయకుండా, వినపడనీయకుండా చేయాలనే ఆలోచనతో విపక్షాలు, జగన్‌ శత్రువులు కుట్ర చేస్తున్నారు. నేను రాష్ట్రం మంచి కోరుకునే ఆంధ్రప్రదేశ్‌ పౌరుడ్ని. వృత్తి, వ్యాపకాల రీత్యా నేనెక్కడ స్థిరపడినా నా ఊరు బాగుపడుతుంటే ఆ ఊరంటే ప్రేమ ఉన్న నేనెందుకు గర్వంగా చెప్పుకోకూడదు? ఎవరేమనుకున్నా సరే.. నాకు కనపడిన మంచిని ప్రజలతో పంచుకుంటా. 

చిత్తశుద్ధి ఉన్న సీఎం గెలవాలి... 
వైఎస్సార్‌సీపీయా... బీజేపీయా... కాదు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జగన్‌ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు ఆ అవసరం లేకపోవచ్చు. నాన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్ప మరో కోరిక ఉండకపోవచ్చు. కానీ ఆయన సీఎంగా ఉండడం, మళ్లీ గెలవడం ఈ రాష్ట్రానికి... ముఖ్యంగా పేదలకు అవసరం. ఇలాంటి పాలన నిజంగా పేదలకు ఓ వరం.  

Advertisement
Advertisement