సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కోనసీమలో మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. అమలాపురం రూరల్ జనుపల్లిలో శుక్రవారం వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.
అమలాపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉన్న జనుపల్లిలోని స్టేడియం సభాస్థలికి చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టింది. అడుగడుగునా ప్రజలు జైజగన్ నినాదాలు చేస్తుండగా.. వారందరికీ అయన అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. ప్రాంగణం బయట, రోడ్లపైన జనం బారులు తీరారు. అమలాపురం, ఎర్రవంతెన–నల్లవంతెన మార్గం తిరునాళ్లను తలపించింది.
బాధితులకు సీఎం ఓదార్పు..
తాడేపల్లి తిరిగి వెళ్లే సమయంలో హెలిప్యాడ్ వద్ద బాధితులు సీఎం జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగులు, వృద్ధులు, అభాగ్యులు, అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 146 మంది విన్నపాలను సీఎం జగన్ రెండు గంటలపాటు ఎంతో ఓపికగా ఆలకించారు. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. వారంతా భోజనం చేయలేదని తెలుసుకుని, వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
అంతకు ముందు సీఎం జగన్ అమలాపురం–బెండమూర్లంక మధ్య రూ.17.44 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. బెండమూర్లంక ఓహెచ్‌ఆర్‌సీ ట్యాంకు నుంచి ఓఎన్జీసీ ప్లాంట్ వరకు రూ.7.62 కోట్ల ఓఎన్జీసీ సీఎస్‌ఆర్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి, సాంఘిక సంక్షేమ నిధులు రూ.12.16 కోట్లతో అంబేడ్కర్ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment