కేపీ ఉల్లి: అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్‌ సమ్మేళనాలు! | Krishnapuram Onions: Get International Fame Rich In Anti Accidents | Sakshi
Sakshi News home page

Krishnapuram Onions: కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి

Published Tue, Jul 6 2021 2:22 PM | Last Updated on Tue, Jul 6 2021 2:27 PM

Krishnapuram Onions: Get International Fame Rich In Anti Accidents - Sakshi

వైవీయూ: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే నానుడి తెలుగునాట ఎంతో ప్రాచుర్యం.. అలాంటి ఉల్లిలో ప్రత్యేకమైన కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఈ ఉల్లిపై వైవీయూ (యోగి వేమన విశ్వవిద్యాలయం) వృక్షశాస్త్ర విభాగం చేపట్టిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి రావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. దీనికి తోడు కేపీ ఉల్లిని ఈ ప్రాంత పంటగా జియోట్యాగ్‌ కోసం వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నిస్తుండగా, అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్స్‌ స్ప్రింగర్‌లో పరిశోధక పత్రం ప్రచురితమై ఖ్యాతిని మరింత విస్తరించేలా చేసింది. 

కేపీ ఉల్లిగా కృష్ణాపురం ఉల్లి 
వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు పరిధిలోని కృష్ణాపురంలో రైతులు ఉల్లి పంటను ఎక్కువగా పండించడంతో కృష్ణాపురం ఉల్లి (కేపీ ఉల్లి)గా ప్రసిద్ధికెక్కింది. కేపీ ఉల్లిని సలాడ్స్, సాస్, సూప్‌లలో విపరీతంగా వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అనేక రకాల పేర్లతో ఉల్లి వంగడాలను పండిస్తున్నప్పటికీ కేపీ ఉల్లి ఎగుమతి కావడానికి ఆరోగ్యపరంగా అత్యధిక ప్రయోజనాలు ఉండటమేనని పరిశోధకులు గుర్తించారు. 

వ్యాధి నిరోధకత పెంచే యాంటీ ఆక్సిడెంట్లు.. 
కేపీ ఉల్లిలో ఫినోలిక్‌ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో పాటు అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం కారణంగా ఇందులో వ్యాధి నిరోధకతను పెంచే సామర్థ్యం ఉన్నట్లు వైవీయూ వృక్షశాస్త్ర పరిశోధకులు వెల్లడించారు. వైవీయూ వృక్షశాస్త్ర ఆచార్యులు డాక్టర్‌ పీఎస్‌ షావల్లీఖాన్‌ మార్గదర్శకంలో డాక్టర్‌ జి. విజయలక్ష్మి, ఇటలీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్, నేషనల్‌ కౌన్సెల్‌ పరిశోధకులు సంయుక్తంగా కేపీ ఉల్లిపై పరిశోధనలు సాగించారు.

ఈ పరిశోధనల్లో కేపీ ఉల్లికి ఒక ప్రత్యేకత ఉందని.. దీనికి సంబంధించిన విశిష్టతలను తెలియజేస్తూ ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్స్‌ స్ప్రింగర్‌’లో పరిశోధక వ్యాసం ప్రచురితమైంది. అలాగే, వైఎస్సార్‌ జిల్లాకు చెందిన కేపీ ఉల్లిని ప్రత్యేక వంగడం (లాండ్‌రేస్‌)గా పరిశోధకులు పేర్కొన్నారు.  ప్లేవనాయిడ్‌ కంటెంట్, యాంటి యాక్సిడెంట్‌లు ఇందులో ఎక్కువని పరిశోధనల్లో తేల్చారు. కేపీ ఉల్లి ప్రత్యేకించి ముదురు ఎరుపు రంగును కలిగి ఉండటానికి కారణం అందులోని ఆంథోసైనిన్‌ అని గుర్తించారు. అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్‌ అయిన ప్లావినాయిడ్స్‌ రోగ నిరోధకతను కల్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించారు. ఇందులోని లక్షణాలు మరే ఇతర రకాల్లో లభించవని పరిశోధకులు స్పష్టంచేశారు.

జియోట్యాగ్‌ కోసం ప్రయత్నం.. 
కేపీ ఉల్లికి జియోట్యాగ్‌ (భౌగోళికపరమైన గుర్తింపు) పొందేందుకు వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది.  

  • జియోట్యాగ్‌ వస్తే కేపీ ఉల్లికి న్యాయపరమైన రక్షణ లభిస్తుంది.  
  • ఈ వంగడాన్ని ఇతరులు అనధికారికంగా వినియోగించుకునే అవకాశం ఉండదు.  
  • ఈ ప్రాంత ఉత్పత్తిదారులకు ఎగుమతుల విషయంలో ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.  అందువల్ల ప్రభుత్వ గుర్తింపు సంస్థలు, రిజిస్టర్డ్‌ రైతు సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందించి జియోట్యాగ్‌ లభించేలా చూడాలని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్‌ పీఎస్‌ షావల్లీఖాన్‌ కోరారు. మరోవైపు.. కేపీ ఉల్లిపై పరిశోధనలు చేసిన డాక్టర్‌ విజయలక్ష్మి దాని పుష్పాల నుంచి ఉల్లి మొక్కలు సృష్టించడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement