సాక్షి, తూర్పుగోదావరి: గోదావరి ఒడ్డున, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి విజన్ కలిగిన యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత పురోగమించేలా ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేస్తోంది.
ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతోంది. ఈ పరిశ్రమ మా గ్రూప్‌లో ఒక మైలు రాయిగా నిలిచిపోనుంది. మా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్, ఆదిత్య ఫ్యాషన్, గార్మెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ (ఫైనాన్షియల్ బిజినెస్) ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మందికి ఉపాధి కలుగుతుంది. రాష్ట్రంలో విశాల తీర ప్రాంతం, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మంచి సామర్థ్యం కలిగిన మానవ వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు (వర్క్‌ఫోర్స్) ఉండటానికి తోడు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించే ప్రభుత్వం.. వెరసి పెట్టుబడుల రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నా.ఔ
చదవండి: (కుమార మంగళం బిర్లాకు సీఎం జగన్ ప్రత్యేక విందు)
మా గ్రూప్ రసాయన విభాగం విశ్వవ్యాప్తంగా 2.4 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతోంది. భారత్, థాయిలాండ్, జర్మనీ, అమెరికాలో ప్రధానంగా పని చేస్తూ దాదాపు 80 దేశాల్లో 1000కి పైగా ఉత్పత్తులు కొనసాగిస్తోంది. ఇందులో క్లోర్ ఆల్కలీ వ్యాపారం ముఖ్యం. దేశంలోకెల్లా ఇక్కడే.. బలభద్రపురం యూనిట్‌లో ఎక్కువ ఉత్పత్తి (ఏటా 1.5 లక్షల టన్నులు) జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాస్టిక్ సోడా అనేక పరిశ్రమల అవసరాలు తీర్చనుంది.
ఈ ప్లాంట్‌లో స్థానికులకే ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాం. వచ్చే నెలల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 10 రోజుల్లోనే, 1947లో మా తాత జీడీ బిర్లాతో మొదలైన మా ప్రస్థానం.. ఇప్పుడు పలు రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం గ్రాసిమ్ కంపెనీ 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్లాంట్ ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఇందుకు అన్ని విధాలా సహకరించిన సీఎం వైఎస్ జగన్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూపు
Comments
Please login to add a commentAdd a comment