సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని.. రైతులకు ఏ కష్టం రాకుండా చూడాలన్నదే ఆయన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 11,22,912 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయిస్తే.. కేవలం రెండేళ్ల పాలనలోనే సీఎం జగన్ 19,30,199 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని రూ.6,348 కోట్లతో కొనుగోలు చేయించారని తెలిపారు. ఇలా కొనుగోళ్లు జరపడం వల్ల పెద్దఎత్తున నష్టం వచ్చినా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించి పంటల్ని కొనుగోలు చేయిస్తున్నారని వివరించారు. ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం వస్తుందని తెలిసినా జొన్నలు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
లక్షన్నర టన్నుల మామిడి కొన్నాం
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 1.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేసినట్లు కన్నబాబు తెలిపారు. సుమారు 4 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశామని, ఇంకా లక్షన్నర టన్నుల వరకూ ప్రాసెసింగ్ కోసం కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. లాక్‌డౌన్ ఉన్నా ప్రస్తుతం కేజీ మామిడికి రూ.9.50 ధర వస్తోందని, ధర కనీసం రూ.11కి తగ్గకుండా చూడాలని సీఎం జగన్ తమను ఆదేశించారని చెప్పారు. చంద్రబాబుకు మామిడి రైతులపై సీజనల్‌గా ప్రేమ పుట్టుకొచ్చిందని, మామిడి ధరలు బాగా పడిపోయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ లేఖ రాశారని విమర్శించారు. మామిడి ప్రాసెసింగ్ కంపెనీలను మంత్రి పెద్దిరెడ్డి ఏకం చేసి ధరలను పడగొట్టారని చంద్రబాబు అనడానికి సిగ్గుండాలన్నారు. గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ ఎవరివని ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్‌ను కూడా పెద్దిరెడ్డి మేనేజ్ చేశారా అని ప్రశ్నించారు. చిత్తూరులో మామిడి బోర్డు పెట్టాలని సలహా ఇచ్చిన చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఎందుకు దాన్ని పెట్టించలేదని నిలదీశారు. సీఎం జగన్ 3 నెలల నుంచి వివిధ సందర్భాల్లో పంటల ధరలు, మార్కెట్ గురించి సమీక్ష చేశారని, 3 రోజుల క్రితం కూడా సమీక్ష చేశారని గుర్తు చేశారు. ధరల స్థిరీకరణకు సీఎం రూ.3 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. నష్టం వచ్చినా గత ఏడాది మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. ధాన్యం రైతులకు రోజు రూ.200 కోట్ల చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉందని.. అయినా రైతులకు డబ్బు చెల్లిస్తున్నామన్నారు.
‘జూమ్’ రాజకీయాలు చెల్లవు
చంద్రబాబు జూమ్‌ను నమ్ముకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి కన్నబాబు హితవు పలికారు. రైతులకు లేని సమస్యలను సృష్టించి రాజకీయం చేయాలనుకుంటే.. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికీ వెనకాడమని హెచ్చరించారు. మామిడి కొనుగోళ్లకు సంబంధించి చేపట్టిన చర్యలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు. వివిధ పంటల కొనుగోళ్లకు సంబంధించి చేపట్టిన చర్యలను మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శ్రీధర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment