పాదరక్షలు లేకుండా మండుటెండలో రోడ్డుపై నడుస్తున్న దూదేకుల ఖాశీం
సాక్షి, నంద్యాల : అసలే ఎండాకాలం.. గతంలో ఎప్పుడూ లేనంతగా భానుడు భగభగా మండిపోతున్నాడు.. బయటికి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్న తరుణంలో ఓ వ్యక్తి చెప్పుల్లేకుండానే నడుచుకుంటూ కూలి పనులకెళుతున్నాడు.. పైగా తారు రోడ్డు మీద. గమనించిన ‘సాక్షి’ అతడిని పలుకరించింది. సాక్షిని చూడగానే సంతోషంతో అతను ఇలా చెప్పాడు.. ‘నా పేరు దూదేకుల ఖాశీం. మాది కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామం. ఓదార్పు యాత్రలో భాగంగా 2010లో కర్నూలు జిల్లాకు వచ్చిన జగనన్నను కలిశాను.
వైఎస్సార్ బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలని.. ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ అన్నను కలిసేంత వరకూ కాళ్లకు చెప్పులు ధరించనని స్నేహితులు, గ్రామస్తులందరి సమక్షంలో శపథం చేశాను. 11 ఏళ్లుగా పాదరక్షలు లేకుండానే నడుస్తున్నాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డిని కలిశాను.. సీఎం దగ్గరకు తీసుకెళతానన్నారు’ అని చెప్పాడు. అంతలో గ్రామస్తులు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిందాకా ఖాశీం చెప్పులు వేసుకునేలా లేడు.. ఆయనను త్వరగా సీఎం దగ్గరకు తీసుకెళ్లండయ్యా.. అంటూ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment