ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం
సస్పెన్షన్ వేటు.. షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలపై ఆందోళన
సహాయ చర్యల్లో దారుణంగా విఫలమైనకూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు! వరద బాధితులను ఆదుకోవడంలో తన ఘోర వైఫల్యాన్ని అధికారులపై నెట్టివేయడం ఆయన దిగజారుడుకు తార్కాణంగా నిలుస్తోంది. విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు ఇప్పటికే తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రుల పర్యటన సందర్భంగా బాధితులు నేరుగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం దీనికి నిదర్శనం. దీంతో సీఎం చంద్రబాబు అధికారులపై నిందలు మోపుతూ వారిని బలి పశువులుగా మారుస్తున్నారు.
తాజాగా జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించడం గమనార్హం. మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అసలు ఏ ప్రాంతాల్లో ఎంత వరద ఉంది? ఎక్కడ ఎలాంటి నిత్యావసరాలు, ఇతర సామగ్రి అవసరం అనే ప్రాథమిక సమాచారం కూడా ముఖ్యమంత్రి వద్ద లేదు. మరోవైపు చంద్రబాబు భజన బృందం, మంత్రులు ప్రభుత్వ వైఫల్యానికి వక్రభాష్యం చెబుతూ తప్పించుకునేందుకు యతి్నస్తోంది.
ఓ మంత్రి అందులో భాగంగానే తమ ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టిన కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వరద ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్లు తాజాగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి అవగాహనా రాహిత్యంతో మాట్లాడినా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే సీఎం చంద్రబాబు సైతం అందుకు వంత పలకడం విస్మయం కలిగిస్తోంది. ‘ఆ అధికారులకు ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలి. సహాయ, పునరావాస చర్యలను సక్రమంగా నిర్వహించకుంటే ఉపేక్షించం’ అంటూ హెచ్చరించారు.
ఏరికోరి పోస్టింగులు.. ఎవరిది బాధ్యత?
అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులను చంద్రబాబు ఏరికోరి ఎంపిక చేసుకుని మరీ పోస్టింగులు ఇచ్చారు. అంటే అదంతా తన జట్టు అని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై వారితోనే ఆయన సమీక్షిస్తున్నారు.
మరి బాధితులకు సహాయం, పునరావాసం అందకపోతే అందుకు తాను ఏరికోరి పోస్టింగులు ఇచ్చిన ఉన్నతాధికా>రులే బాధ్యత వహించాలి కదా? అంతకుమించి ఆ వైఫల్యాలకు ముఖ్యమంత్రిగా ఆయన జవాబుదారీగా ఉండాలి. అయితే తాను ఏమాత్రం నమ్మకుండా, పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచిన అధికారులపై నెపం మోపాలని చంద్రబాబు యతి్నస్తుండటం విడ్డూరంగా ఉందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment