relief and rehabilitation
-
ఆకలి కేకలు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మూడు రోజులుగా వరద నీటిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నా ఇప్పటికీ సహాయం అందకపోవడంతో బాధితులు విలవిలలాడుతున్నారు. తిండి మాట దేవుడెరుగు కనీసం గుక్కెడు తాగునీరు కూడ అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి చేతులెత్తేసింది. లక్షలాది మంది వరదలో చిక్కుకుని బయటకు వచ్చే మార్గం లేక ప్రాణ భయంతో క్షణమొక యుగంలా గడుపుతున్నారు. బాధితులు సాహసించి స్వచ్ఛందంగా బయటకు రావడం మినహా ప్రభుత్వం వారిని కాపాడే యత్నం చేయటం లేదు. పలు చోట్ల చంటిబిడ్డలు పాలు లేక గుక్కపట్టి ఏడుస్తుండగా తల్లిదండ్రులు నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. వృద్ధులు, అనారోగ్య బాధితులు మందులు లేక సాయం కోసం కళ్లు కాసేలా ఎదురు చూస్తున్నారు. తమవాళ్లు ఎక్కడున్నారో.. ఉన్నారో లేదో అంతుబట్టక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక వరద ప్రాంతాల్లో మూడు రోజులుగా కరెంట్ లేదు. ఫోన్లు పని చేయడం లేదు. నెట్ వర్క్ మొరాయించింది. దీంతో వరద కాలనీల్లో చిక్కుకున్న వారి సమాచారం తెలియక కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సింగ్ నగర్ బ్రిడ్జి వద్ద ఆదుర్దాగా నిరీక్షిస్తున్నారు. రాత్రి బయట అడుగు పెట్టాలంటే వరద నీటిలో జలగలు, పాములు, విష జంతువులు ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఆహారం లేక ఇంటి నుంచి బయటకు వద్దామనుకుంటే చచ్చిపోతామని భయం వేస్తోందని, అలాగని ఇంట్లో ఉంటే పిల్లలకు ఆహారం అందక చచ్చిపోతారేమోనని భయంగా ఉందని విలపిస్తున్నారు. ఇంట్లో ఉండలేక బయటకు రాలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనీసం తామైనా బతికితే చాలని... రక్త సంబంధీకులు, శవాలను అక్కడే వదిలి వేస్తున్నారంటే ఎలాంటి దుస్థితి దాపురించిందో ఊహించవచ్చు. పడవ ఎక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కష్టంతో కొన్న సామాన్లు నీళ్ల పాలు వరద తాకిడికి పలు చోట్ల కార్లు, బైకులు, ఆటోలు కొట్టుకుపోగా సెల్లార్లో ఉన్న వాహనాలు బురద నీటిలో మునిగిపోయాయి. కింది ఫ్లోర్లలో నివసించే ఇళ్లలో సామాను అంతా నీటమునిగి పనికి రాకుండా పోయింది. కూలి పనులకు వెళ్లి ఏడాదంతా కూడబెట్టిన డబ్బులతో కొనుక్కున్న ఫ్రిజ్, సామాన్లు వరద పాలు కావడంతో ఓ నిరుపేద మహిళ నిర్వేదంలో మునిగిపోయింది. ఇంట్లో ఒక్కో సామాను సమకూర్చుకునేందుకు 15 ఏళ్లు పట్టిందని, కష్టం అంతా నిమిషాల్లో నీటి పాలైందని విలపించింది. ఎవరిని పలుకరించినా ఇవే దీనగాథలు కనిపిస్తున్నాయి. కన్నెత్తి చూడలేదు.. మూడు రోజులు గడుస్తున్న ఇప్పటికి చాలా కాలనీల్లోకి అధికారులు కనీసం వెళ్లిన దాఖలాలు లేవు. ‘సాక్షి’ బృందం పీకలోతు నీళ్లలో మారుమూల కాలనీలకు వెళ్లినప్పుడు హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బాధితుల కష్టాలు మాటల్లో వరి్ణంచలేని విధంగా ఉన్నాయి. రాజీవ్‌నగర్, ఉడా కాలనీ, రాధానగర్, పాయకాపురం, కండ్రిక, ఇందిరా నాయక్‌నగర్, సన్‌సిటీ కాలనీ, గుండపు చలపతిరావు కాలనీ, రాజరాజేశ్వరిపేట, భరతమాత మందిరం కాలనీ, నందమూరి నగర్, తోటవారి వీధి, వాంబేకాలనీ, వైవీరావు ఎస్టేట్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, ఊరి్మళానగర్, రాజీవ్‌శర్మ కాలనీ, విజయవాడ రూరల్ అంబాపురం, పాతపాడు, నున్న, పి.నైనవరం పంచాయతీల్లోకి అధికారులు ఇంత వరకు వెళ్లలేదు. కనీసం తాగునీరు అందించే ప్రయత్నం చేయలేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఇక్కడ కొంతమేర వరద తగ్గినా 2 లక్షల మందికి పైగా బాధితులు వరదలో ఉన్నారు. వీరి గురించి సమాచారం తెలియక బయట ఉన్న కుటుంబీకులు రోదిస్తున్నారు. కొన్నిచోట్ల బయట పడ్డ శవాలను చూసి తమవారి పరిస్థితి ఎలా ఉందోనని తల్లడిల్లిపోతున్నారు. లోపల నుంచి బయటికి వచ్చేవారు చెప్పే సమాచారం మినహా ప్రభుత్వం తరపున ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాలనీల్లోకి కాలు పెట్టకుండా.. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు అందకపోవడంతో ప్రభుత్వం తీరుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో లోపలి కాలనీలకు వెళ్లకుండా సీఎం చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. డివిజన్‌కో మంత్రి, ఐఏఎస్ అధికారులు అంటూ హడావుడి చేస్తున్నా వారు కూడా ఎటు వెళ్లినా నిలదీస్తుండటంతో మమ అనిపిస్తున్నారు. కాలనీలలోకి కాలు మోపితే బాధితులు ప్రశి్నస్తుండటంతో ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. సహాయ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వరద బాధితులతో పాటు ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు రోజులు పస్తులే వరద అకస్మాత్తుగా రావడంతో పక్కనే ఉన్న అపార్టుమెంట్‌కు వెళ్లి తల దాచుకున్నాం. నీరంతా ఇంట్లోకి చేరటంతో సామాన్లన్నీ పాడయ్యాయి. హెలికాప్టర్లలో వచ్చే ఆహారం బురదలో పడిపోయింది. రెండ్రోజులు పస్తులున్నాం. ఇద్దరు పిల్లలు ఆకలితో అల్లాడుతుంటే.. వారిని ఓదార్చటానికి చాలా ఇబ్బంది బాధపడ్డాం. ప్రభుత్వం అయితే మాకేమీ ఇవ్వలేదు. – రజియా, న్యూ రాజరాజేశ్వరిపేట సింగ్‌నగర్ వంతెనపై దయనీయ దృశ్యాలు సింగ్‌నగర్ ప్రాంతంలోని 8 డివిజన్లు పూర్తిగా నీట మునగడంతో దానికున్న ముఖ్యమైన ఎంట్రీపాయింట్ అయిన సింగ్‌నగర్ వంతెనపై దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిద్దరూ వరద నీళ్లలోనే తాళ్లు పట్టుకుని నాలుగైదు కిలోమీటర్లు గంటల తరబడి నడుచుకుంటూ ఆ బ్రిడ్జి వద్దకు వస్తున్నారు. అక్కడ దొరికింది తీసుకుని మళ్లీ నీళ్లలోనే తమ ఇళ్ల వద్దకు అతికష్టంగా వెతున్నారు. సుమారు 5 లక్షల మంది వరదలో చిక్కుకుపోతే సోమవారం 200 బోట్లు తెప్పించామంటున్నారు. అవి ఏ మూలకూ సరిపోవడంలేదు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న బోట్లను లోనికి తీసుకెళ్లడానికి ఈ ట్రాఫిక్ అడ్డంకిగా మారిపోయింది. దీంతో చాలా లారీల్లోని పడవలను దించకుండా అలాగే ఉంచేశారు. హెలికాప్టర్లు రప్పించినా వాటివల్లా ఉపయోగం లేదని కొందరు అధికారులే పెదవి విరుస్తున్నారు. సాయం శూన్యం...వరద ప్రాంతాల్లో స్వయంగా తిరుగుతున్నట్లు గాంభీర్యంగా ప్రకటిస్తూ ప్రచారం చేసుకోవడం మినహా ప్రజలకు అందుతున్న సాయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవటం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానంటూ వైఫల్యాలను వారిపైకి నెట్టేయత్నం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు వరదతో ప్రజలను ముంచిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు. మంచినీళ్లకూ కటకట!2» రెండ్రోజుల నుంచి నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేత» హెడ్ వాటర్ వర్క్స్‌లో ప్లాంట్లపై వరద ప్రభావం » ట్యాంకర్ల సరఫరాలను ఏర్పాటుచేయని వీఎంసీపటమట (విజయవాడ తూర్పు) : వరదతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఓ వైపు బుడమేరు.. మరోవైపు కృష్ణానది ఉప్పొంగడంతో నగరమంతా జలమయమైంది. ఫలితంగా సిటీ మొత్తానికి తాగునీటిని అందించే హెడ్‌వాటర్ వర్క్స్ నుంచి తాగునీటి సైతం సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ మొత్తం ఐదు ప్లాంట్లు ఉండగా వాటిలో మూడు ప్లాంట్లు వరదలకు మునిగిపోయాయి. మిగిలిన రెండు ప్లాంట్లు వరద ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు వాటికి నీటి సరఫరాను పూర్తిగా ఆపేశారు. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాలు తాగునీరు, వాడుక నీటికి కటకటలాడుతున్నారు. సొంత బోర్లు ఉన్న వారు నీటిని సమకూర్చుకుంటే చాలామంది మున్సిపల్ నీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. సోమవారం ఉదయం నుంచి నీటి సరఫరా నిలిచిపోవటంతో నగరంలోని పలు ప్రాంతాల వారు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, విద్యుత్ సరఫరాలేని కారణంగా కూడా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక తాగునీటి సరఫరాను నిలిపివేసే విషయంలో వీఎంసీ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో చాలాచోట్ల నగరవాసులు నీటిని నిల్వ చేసుకోలేకపోయారు. పైగా.. ప్రత్నామ్యాయంగా ట్యాంకర్లు ఏర్పాటుచేయకపోవటంతో తాగునీటి కోసం గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు.. వరద ప్రభావితం కాని ప్రాంతాలకు 15 పెద్ద ట్యాంకర్లు, 80 ట్రాక్టర్ ట్యాంకర్లు ఏర్పాటుచేసినట్లు వీఎంసీ ప్రకటిస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలోకి రాలేదు. -
కనికరం లేని సర్కార్
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కన్నీటి సుడులతో ముంపు ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా బాధితులు బయటకు వస్తున్నారు. పాలు, మందులు, నిత్యావసర సరుకుల కోసం వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్నారులను ఎత్తుకున్న తల్లులు, వృద్ధులను భుజాలకు ఎత్తుకుని మరికొందరు, వికలాంగులను మోసుకుని కుటుంబ సభ్యులు కిలోమీటర్ల మేర వరద నీటిలో సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు పడుతున్న అవస్థలు వర్ణానాతీతం. ఇలా వందలాది మంది బయటకు రావడంతో ముంపునకు సమీపంలోని ప్రాంతాలు బాధితులతో కిక్కిరిసిపోయాయి. ముంపు ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధుల బృందం: వరద తాకిడితో తల్లడిల్లుతున్న బాధితులపై కూటమి సర్కారు కనీస కనికరం చూపడంలేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో ముంపు బాధితులు నరకయాతన పడుతున్నారు. మూడు రోజులుగా వరద నీటిలో అల్లాడిన ప్రజలు.. మంగళవారం కొంతమేర ముంపు నీరు తగ్గడంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. పీకల్లోతు నీటిని సైతం లెక్కచేయక కర్రల ఊతంతో ముంపు నుంచి ఒడ్డుకు చేరే సాహసం చేశారు. సర్వస్వాన్ని ఇళ్లలోనే వదిలి కట్టుబట్టలతోనే వారంతా పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో ముంపు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు రద్దీగా మారాయి. ప్రధానంగా మూడు కిలోమీటర్ల పొడవైన సింగ్‌నగర్ ఫ్లయ్‌ఓవర్ సైతం వరద బాధితులతో కిక్కిరిసిపోయింది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతుంటే.. మరికొందరు నిత్యావసర సరుకులు కొనుక్కుని మళ్లీ ముంపులోని ఇళ్లకు చేరుతున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ధరలు పెంచేసి బాధితుల నుంచి ఎక్కువ వసూలు చేశారు. దీనిపై సర్కారు నియంత్రణ కొరవడింది. వరద నీటి గండం నుంచి బయట పడేందుకు ప్రైవేట్ బోట్లు మనిíÙకి రూ. వెయ్యి నుంచి రూ.1,500 డిమాండ్ చేయడంతో.. కొంతమంది లారీ ట్యూబ్‌లు, ధర్మాకోల్ షీట్స్ కొనుగోలు చేసి తెచ్చుకుని దానినే తెప్పలా తయారుచేసి ముంపు నుంచి బయటపడ్డారు. వాటర్ ట్యాంక్ నీళ్లు తాగి బతికాం ఇందిరానాయక్ నగర్లో అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ గ్రౌండ్‌ఫ్లోర్‌లో రూమ్ కుటుంబంతో కలిసి ఉంటున్నా. వరద నీటితో గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. పిల్లలతో బిల్డింగ్‌పైకి చేరాం. మూడు రోజులు భోజనం లేక వాటర్ ట్యాంక్‌లోని నీళ్లతో ప్రాణాలు దక్కించుకున్నాం. చిన్న పిల్లలతో నరకం చూశాం. పడవలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి తప్ప మావైపు చూడలేదు. మంగళవారం పిల్లలను భుజాలపై ఎత్తుకుని తాళ్ల సాయంతో వరద నీటిలో నడిచొచ్చి ప్రాణాలు కాపాడుకున్నాం. – పాము ధనుంజయ్, హనుమాన్వీధి, సింగ్‌నగర్ మంచినీళ్లు కూడా ఇవ్వరా రెండు రోజుల నుంచి పైపుల ద్వారా నీరు రాలేదు. మంగళవారం మాత్రమే కేవలం 10 బిందెలు నీళ్లొచ్చాయి. ఇంట్లో ఉన్న వారికి సరిపోలేదు. నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు పట్టించుకోవడంలేదు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేరా? – పి.మేరీ, రామలింగేశ్వరనగర్మూడు రోజులు పడవ కోసం చూసినా.. ఇళ్లల్లో పని చేసుకుంటూ భర్త రాములుతో కలిసి ఇందిరానాయక్ నగర్లో రేకుల షెడ్డులో అద్దెకు ఉంటున్నాం. వరదకు మేం ఉంటున్న ఇల్లు మునిగిపోయింది. సమీపంలోని భవనంలోకి వెళ్లి మూడు రోజులు తలదాచుకున్నాం. మా సామాన్లన్నీ నీట మునిగి తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూసినా ఎవరూ పట్టించుకోలేదు. తిండి లేక వాటర్ ట్యాంక్‌లో నీళ్లు తాగి బతికాం. కట్టుబట్టలతో ఎట్టకేలకు రోడ్డుపైకి చేరాం. – దాసరి అచ్చాయమ్మ, ఇందిరానాయక్, సింగ్‌నగర్ తడిసిన బట్టలతోనే పడిగాపులు రెండు రోజులుగా తడిసిన దుస్తులతోనే రోడ్డు మీద పడిగాపులు కాస్తున్నాం. ఇంట్లో బట్టలన్నీ వదిలి వచ్చాం. అన్నం, నీరు దొరకడం లేదు. ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీసం కట్టుకోవడానికి చీరలైనా పంపిణీ చేయాలి. – శిరీష, విజయవాడట్యూబ్ సాయంతో బయటపడ్డాం ఎటు చూసినా వరద నీరే. భోజనం, మంచినీళ్లు అందించేవారే కరువయ్యారు. బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంక్‌లోని నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాం. చివరకు మూడు రోజుల తరువాత కర్ర పట్టుకుని నడుచుకుంటూ ఒడ్డుకు చేరా. అక్కడ దొరికిన ఒక ట్యూబ్ ద్వారా 10 మంది కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఎక్కించుకుని తోసుకుంటూ ఒడ్డుకు చేర్చాం. వరద వస్తుందని తెలిసినా ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. – ఎస్.ప్రభాకర్, ఎంకే బేగ్ స్కూల్ ప్రాంతం, సింగ్‌నగర్ అమ్మాయి పెళ్లి వస్తువులన్నీ కొట్టుకుపోయాయి మా కుమార్తె వివాహం వచ్చే నెలలో జరుగనుంది. రూ.లక్ష విలువైన దుస్తులు, వస్తువులు కొనుగోలు చేశాం. వీటన్నింటిని ఇంట్లోనే జాగ్రత్త చేశాం. వరద నీటిలో ఇవన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా కూతురి వివాహం ఎలా చేయాలో దిక్కుతోచని స్ధితిలో ఉన్నాం. – షేక్ జుబేద, విజయవాడ -
తన వైఫల్యాలకు అధికారులు బలి
సాక్షి, అమరావతి: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు! వరద బాధితులను ఆదుకోవడంలో తన ఘోర వైఫల్యాన్ని అధికారులపై నెట్టివేయడం ఆయన దిగజారుడుకు తార్కాణంగా నిలుస్తోంది. విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు ఇప్పటికే తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రుల పర్యటన సందర్భంగా బాధితులు నేరుగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం దీనికి నిదర్శనం. దీంతో సీఎం చంద్రబాబు అధికారులపై నిందలు మోపుతూ వారిని బలి పశువులుగా మారుస్తున్నారు. తాజాగా జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించడం గమనార్హం. మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అసలు ఏ ప్రాంతాల్లో ఎంత వరద ఉంది? ఎక్కడ ఎలాంటి నిత్యావసరాలు, ఇతర సామగ్రి అవసరం అనే ప్రాథమిక సమాచారం కూడా ముఖ్యమంత్రి వద్ద లేదు. మరోవైపు చంద్రబాబు భజన బృందం, మంత్రులు ప్రభుత్వ వైఫల్యానికి వక్రభాష్యం చెబుతూ తప్పించుకునేందుకు యతి్నస్తోంది. ఓ మంత్రి అందులో భాగంగానే తమ ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టిన కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వరద ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్లు తాజాగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి అవగాహనా రాహిత్యంతో మాట్లాడినా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే సీఎం చంద్రబాబు సైతం అందుకు వంత పలకడం విస్మయం కలిగిస్తోంది. ‘ఆ అధికారులకు ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలి. సహాయ, పునరావాస చర్యలను సక్రమంగా నిర్వహించకుంటే ఉపేక్షించం’ అంటూ హెచ్చరించారు.ఏరికోరి పోస్టింగులు.. ఎవరిది బాధ్యత?అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులను చంద్రబాబు ఏరికోరి ఎంపిక చేసుకుని మరీ పోస్టింగులు ఇచ్చారు. అంటే అదంతా తన జట్టు అని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై వారితోనే ఆయన సమీక్షిస్తున్నారు. మరి బాధితులకు సహాయం, పునరావాసం అందకపోతే అందుకు తాను ఏరికోరి పోస్టింగులు ఇచ్చిన ఉన్నతాధికా>రులే బాధ్యత వహించాలి కదా? అంతకుమించి ఆ వైఫల్యాలకు ముఖ్యమంత్రిగా ఆయన జవాబుదారీగా ఉండాలి. అయితే తాను ఏమాత్రం నమ్మకుండా, పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచిన అధికారులపై నెపం మోపాలని చంద్రబాబు యతి్నస్తుండటం విడ్డూరంగా ఉందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
సహాయక చర్యలకు సిద్ధంగా ఉండండి
సాక్షి, అమరావతి: తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం ఆయన మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. తుపాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాలను సీఎం జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఉదయం మరోమారు సమీక్ష చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ధాన్యం తడిసిపోకుండా చూడండి.. పొలాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యం తడిసిపోకుండా వెంటనే మిల్లులు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యతను తీసుకోవాలన్నారు. తేమలాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే సేకరించి తరలించాలన్నారు. దీనిపై పురోగతిని వెంటనే తనకు తెలియజేయాలని ఆదేశించారు. మరోవైపు.. తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరుల శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను అనంతరం ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
పై-లీన్ బాధితులకు లార్డ్ స్వరాజ్ పాల్ ఆర్థిక సాయం
ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పై-లీన్ తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితలకు పునరావాసం, సహాయక చర్యల కోసం రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం లండన్‌లోని తన నివాసంలో లార్డ్ స్వరాజ్ పాల్ విలేకర్లతో మాట్లాడుతూ... పై-లీన్ తుపాన్ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవహారించిన తీరు నభూతోనభవిష్యత్తు అని ప్రశంసించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అత్యంత భీకరమైన ఆ తుపాన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయన్నారు. వీటితోపాటు భారత ఆర్మీ, వైమానిక దళాలు సహాయక చర్యలపై స్వరాజ్ పాల్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే పై-లీన్ తుపాన్‌పై జాతీయ, స్థానిక మీడియాలు ప్రజలను అప్రమత్తం చేసిందని వివరించారు. అందువల్లే మృతులు కానీ గాయాలపాలైన వారు కాని చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు. పై-లీన్ తుపాన్ దృశ్యాలను టీవీ ద్వారా వీక్షించినట్లు చెప్పారు. రూ. 25 లక్షల విరాళాన్ని సాధ్యమైనంత త్వరగా పై-లీన్ తుపాన్ బాధితులకు అందజేస్తామని లార్డ్ స్వరాజ్ పాల్ వివరించారు.