వరద ప్రాంతాల్లో ప్రభుత్వానికి పట్టని జనం అవస్థలు
మూడు రోజుల తర్వాత ముంపు నుంచి బయటకు వస్తున్న బాధితులు
కట్టుబట్టలతో వరద నీటిలో నుంచి సురక్షిత ప్రాంతాలకు పయనం
కొంతమంది నిత్యావసరాలు తీసుకుని మళ్లీ ముంపు ఇళ్లకు చేరుతున్న వైనం
మంచినీరు, ఆహారం, పాల ప్యాకెట్లు, మందుల కోసం ప్రయాసలు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కన్నీటి సుడులతో ముంపు ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా బాధితులు బయటకు వస్తున్నారు. పాలు, మందులు, నిత్యావసర సరుకుల కోసం వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్నారులను ఎత్తుకున్న తల్లులు, వృద్ధులను భుజాలకు ఎత్తుకుని మరికొందరు, వికలాంగులను మోసుకుని కుటుంబ సభ్యులు కిలోమీటర్ల మేర వరద నీటిలో సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు పడుతున్న అవస్థలు వర్ణానాతీతం. ఇలా వందలాది మంది బయటకు రావడంతో ముంపునకు సమీపంలోని ప్రాంతాలు బాధితులతో కిక్కిరిసిపోయాయి.
ముంపు ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధుల బృందం: వరద తాకిడితో తల్లడిల్లుతున్న బాధితులపై కూటమి సర్కారు కనీస కనికరం చూపడంలేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో ముంపు బాధితులు నరకయాతన పడుతున్నారు. మూడు రోజులుగా వరద నీటిలో అల్లాడిన ప్రజలు.. మంగళవారం కొంతమేర ముంపు నీరు తగ్గడంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు.
పీకల్లోతు నీటిని సైతం లెక్కచేయక కర్రల ఊతంతో ముంపు నుంచి ఒడ్డుకు చేరే సాహసం చేశారు. సర్వస్వాన్ని ఇళ్లలోనే వదిలి కట్టుబట్టలతోనే వారంతా పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో ముంపు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు రద్దీగా మారాయి. ప్రధానంగా మూడు కిలోమీటర్ల పొడవైన సింగ్‌నగర్ ఫ్లయ్‌ఓవర్ సైతం వరద బాధితులతో కిక్కిరిసిపోయింది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతుంటే.. మరికొందరు నిత్యావసర సరుకులు కొనుక్కుని మళ్లీ ముంపులోని ఇళ్లకు చేరుతున్నారు.
ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ధరలు పెంచేసి బాధితుల నుంచి ఎక్కువ వసూలు చేశారు. దీనిపై సర్కారు నియంత్రణ కొరవడింది. వరద నీటి గండం నుంచి బయట పడేందుకు ప్రైవేట్ బోట్లు మనిíÙకి రూ. వెయ్యి నుంచి రూ.1,500 డిమాండ్ చేయడంతో.. కొంతమంది లారీ ట్యూబ్‌లు, ధర్మాకోల్ షీట్స్ కొనుగోలు చేసి తెచ్చుకుని దానినే తెప్పలా తయారుచేసి ముంపు నుంచి బయటపడ్డారు.
వాటర్ ట్యాంక్ నీళ్లు తాగి బతికాం
ఇందిరానాయక్ నగర్‌లో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ గ్రౌండ్‌ఫ్లోర్‌లో రూమ్ కుటుంబంతో కలిసి ఉంటున్నా. వరద నీటితో గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. పిల్లలతో బిల్డింగ్‌పైకి చేరాం. మూడు రోజులు భోజనం లేక వాటర్ ట్యాంక్‌లోని నీళ్లతో ప్రాణాలు దక్కించుకున్నాం. చిన్న పిల్లలతో నరకం చూశాం. పడవలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి తప్ప మావైపు చూడలేదు. మంగళవారం పిల్లలను భుజాలపై ఎత్తుకుని తాళ్ల సాయంతో వరద నీటిలో నడిచొచ్చి ప్రాణాలు కాపాడుకున్నాం. – పాము ధనుంజయ్, హనుమాన్‌వీధి, సింగ్‌నగర్
మంచినీళ్లు కూడా ఇవ్వరా
రెండు రోజుల నుంచి పైపుల ద్వారా నీరు రాలేదు. మంగళవారం మాత్రమే కేవలం 10 బిందెలు నీళ్లొచ్చాయి. ఇంట్లో ఉన్న వారికి సరిపోలేదు. నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు పట్టించుకోవడంలేదు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేరా? – పి.మేరీ, రామలింగేశ్వరనగర్
మూడు రోజులు పడవ కోసం చూసినా..
ఇళ్లల్లో పని చేసుకుంటూ భర్త రాములుతో కలిసి ఇందిరానాయక్ నగర్‌లో రేకుల షెడ్డులో అద్దెకు ఉంటున్నాం. వరదకు మేం ఉంటున్న ఇల్లు మునిగిపోయింది. సమీపంలోని భవనంలోకి వెళ్లి మూడు రోజులు తలదాచుకున్నాం. మా సామాన్లన్నీ నీట మునిగి తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూసినా ఎవరూ పట్టించుకోలేదు. తిండి లేక వాటర్ ట్యాంక్‌లో నీళ్లు తాగి బతికాం. కట్టుబట్టలతో ఎట్టకేలకు రోడ్డుపైకి చేరాం. – దాసరి అచ్చాయమ్మ, ఇందిరానాయక్, సింగ్‌నగర్
తడిసిన బట్టలతోనే పడిగాపులు
రెండు రోజులుగా తడిసిన దుస్తులతోనే రోడ్డు మీద పడిగాపులు కాస్తున్నాం. ఇంట్లో బట్టలన్నీ వదిలి వచ్చాం. అన్నం, నీరు దొరకడం లేదు. ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీసం కట్టుకోవడానికి చీరలైనా పంపిణీ చేయాలి. – శిరీష, విజయవాడ
ట్యూబ్ సాయంతో బయటపడ్డాం
ఎటు చూసినా వరద నీరే. భోజనం, మంచినీళ్లు అందించేవారే కరువయ్యారు. బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంక్‌లోని నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాం. చివరకు మూడు రోజుల తరువాత కర్ర పట్టుకుని నడుచుకుంటూ ఒడ్డుకు చేరా. అక్కడ దొరికిన ఒక ట్యూబ్ ద్వారా 10 మంది కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఎక్కించుకుని తోసుకుంటూ ఒడ్డుకు చేర్చాం. వరద వస్తుందని తెలిసినా ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. – ఎస్.ప్రభాకర్, ఎంకే బేగ్ స్కూల్ ప్రాంతం, సింగ్‌నగర్
అమ్మాయి పెళ్లి వస్తువులన్నీ కొట్టుకుపోయాయి
మా కుమార్తె వివాహం వచ్చే నెలలో జరుగనుంది. రూ.లక్ష విలువైన దుస్తులు, వస్తువులు కొనుగోలు చేశాం. వీటన్నింటిని ఇంట్లోనే జాగ్రత్త చేశాం. వరద నీటిలో ఇవన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా కూతురి వివాహం ఎలా చేయాలో దిక్కుతోచని స్ధితిలో ఉన్నాం. – షేక్ జుబేద, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment