మూడు రోజులుగా వరద గుప్పెట్లోనే తాగునీరు అందక.. ఆకలితో నకనక
రాత్రిళ్లు చీకట్లో భయం భయంగా.. శవాలను వదిలేసి నిస్సహాయంగా
తెగించి బయటకు రావాల్సిందే.. సర్కారు సాయం శూన్యం
పడవ ఎక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే.. పాలు లేక చిన్నారులు, మందులు కరువై వృద్ధులు విలవిల.. పలు కాలనీలకు ఇప్పటికీ అధికారులు వెళ్లని వైనం
సహాయ చర్యల్లో సర్కారు వైఫల్యంపై ప్రజా సంఘాల మండిపాటు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మూడు రోజులుగా వరద నీటిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నా ఇప్పటికీ సహాయం అందకపోవడంతో బాధితులు విలవిలలాడుతున్నారు. తిండి మాట దేవుడెరుగు కనీసం గుక్కెడు తాగునీరు కూడ అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి చేతులెత్తేసింది. లక్షలాది మంది వరదలో చిక్కుకుని బయటకు వచ్చే మార్గం లేక ప్రాణ భయంతో క్షణమొక యుగంలా గడుపుతున్నారు.
బాధితులు సాహసించి స్వచ్ఛందంగా బయటకు రావడం మినహా ప్రభుత్వం వారిని కాపాడే యత్నం చేయటం లేదు. పలు చోట్ల చంటిబిడ్డలు పాలు లేక గుక్కపట్టి ఏడుస్తుండగా తల్లిదండ్రులు నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. వృద్ధులు, అనారోగ్య బాధితులు మందులు లేక సాయం కోసం కళ్లు కాసేలా ఎదురు చూస్తున్నారు. తమవాళ్లు ఎక్కడున్నారో.. ఉన్నారో లేదో అంతుబట్టక నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక
వరద ప్రాంతాల్లో మూడు రోజులుగా కరెంట్ లేదు. ఫోన్లు పని చేయడం లేదు. నెట్ వర్క్ మొరాయించింది. దీంతో వరద కాలనీల్లో చిక్కుకున్న వారి సమాచారం తెలియక కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సింగ్ నగర్ బ్రిడ్జి వద్ద ఆదుర్దాగా నిరీక్షిస్తున్నారు. రాత్రి బయట అడుగు పెట్టాలంటే వరద నీటిలో జలగలు, పాములు, విష జంతువులు ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు.
ఆహారం లేక ఇంటి నుంచి బయటకు వద్దామనుకుంటే చచ్చిపోతామని భయం వేస్తోందని, అలాగని ఇంట్లో ఉంటే పిల్లలకు ఆహారం అందక చచ్చిపోతారేమోనని భయంగా ఉందని విలపిస్తున్నారు. ఇంట్లో ఉండలేక బయటకు రాలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనీసం తామైనా బతికితే చాలని... రక్త సంబంధీకులు, శవాలను అక్కడే వదిలి వేస్తున్నారంటే ఎలాంటి దుస్థితి దాపురించిందో ఊహించవచ్చు. పడవ ఎక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
కష్టంతో కొన్న సామాన్లు నీళ్ల పాలు
వరద తాకిడికి పలు చోట్ల కార్లు, బైకులు, ఆటోలు కొట్టుకుపోగా సెల్లార్‌లో ఉన్న వాహనాలు బురద నీటిలో మునిగిపోయాయి. కింది ఫ్లోర్లలో నివసించే ఇళ్లలో సామాను అంతా నీటమునిగి పనికి రాకుండా పోయింది. కూలి పనులకు వెళ్లి ఏడాదంతా కూడబెట్టిన డబ్బులతో కొనుక్కున్న ఫ్రిజ్, సామాన్లు వరద పాలు కావడంతో ఓ నిరుపేద మహిళ నిర్వేదంలో మునిగిపోయింది. ఇంట్లో ఒక్కో సామాను సమకూర్చుకునేందుకు 15 ఏళ్లు పట్టిందని, కష్టం అంతా నిమిషాల్లో నీటి పాలైందని విలపించింది. ఎవరిని పలుకరించినా ఇవే దీనగాథలు కనిపిస్తున్నాయి.
కన్నెత్తి చూడలేదు..
మూడు రోజులు గడుస్తున్న ఇప్పటికి చాలా కాలనీల్లోకి అధికారులు కనీసం వెళ్లిన దాఖలాలు లేవు. ‘సాక్షి’ బృందం పీకలోతు నీళ్లలో మారుమూల కాలనీలకు వెళ్లినప్పుడు హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బాధితుల కష్టాలు మాటల్లో వరి్ణంచలేని విధంగా ఉన్నాయి.
రాజీవ్‌నగర్, ఉడా కాలనీ, రాధానగర్, పాయకాపురం, కండ్రిక, ఇందిరా నాయక్‌నగర్, సన్‌సిటీ కాలనీ, గుండపు చలపతిరావు కాలనీ, రాజరాజేశ్వరిపేట, భరతమాత మందిరం కాలనీ, నందమూరి నగర్, తోటవారి వీధి, వాంబేకాలనీ, వైవీరావు ఎస్టేట్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, ఊరి్మళానగర్, రాజీవ్‌శర్మ కాలనీ, విజయవాడ రూరల్ అంబాపురం, పాతపాడు, నున్న, పి.నైనవరం పంచాయతీల్లోకి అధికారులు ఇంత వరకు వెళ్లలేదు.
కనీసం తాగునీరు అందించే ప్రయత్నం చేయలేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఇక్కడ కొంతమేర వరద తగ్గినా 2 లక్షల మందికి పైగా బాధితులు వరదలో ఉన్నారు. వీరి గురించి సమాచారం తెలియక బయట ఉన్న కుటుంబీకులు రోదిస్తున్నారు. కొన్నిచోట్ల బయట పడ్డ శవాలను చూసి తమవారి పరిస్థితి ఎలా ఉందోనని తల్లడిల్లిపోతున్నారు. లోపల నుంచి బయటికి వచ్చేవారు చెప్పే సమాచారం మినహా ప్రభుత్వం తరపున ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు.
కాలనీల్లోకి కాలు పెట్టకుండా..
వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు అందకపోవడంతో ప్రభుత్వం తీరుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో లోపలి కాలనీలకు వెళ్లకుండా సీఎం చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. డివిజన్‌కో మంత్రి, ఐఏఎస్ అధికారులు అంటూ హడావుడి చేస్తున్నా వారు కూడా ఎటు వెళ్లినా నిలదీస్తుండటంతో మమ అనిపిస్తున్నారు.
కాలనీలలోకి కాలు మోపితే బాధితులు ప్రశి్నస్తుండటంతో ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. సహాయ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వరద బాధితులతో పాటు ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రెండు రోజులు పస్తులే
వరద అకస్మాత్తుగా రావడంతో పక్కనే ఉన్న అపార్టుమెంట్‌కు వెళ్లి తల దాచుకున్నాం. నీరంతా ఇంట్లోకి చేరటంతో సామాన్లన్నీ పాడయ్యాయి. హెలికాప్టర్లలో వచ్చే ఆహారం బురదలో పడిపోయింది. రెండ్రోజులు పస్తులున్నాం. ఇద్దరు పిల్లలు ఆకలితో అల్లాడుతుంటే.. వారిని ఓదార్చటానికి చాలా ఇబ్బంది బాధపడ్డాం. ప్రభుత్వం అయితే మాకేమీ ఇవ్వలేదు. – రజియా, న్యూ రాజరాజేశ్వరిపేట
సింగ్‌నగర్ వంతెనపై దయనీయ దృశ్యాలు
సింగ్‌నగర్ ప్రాంతంలోని 8 డివిజన్లు పూర్తిగా నీట మునగడంతో దానికున్న ముఖ్యమైన ఎంట్రీపాయింట్ అయిన సింగ్‌నగర్ వంతెనపై దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిద్దరూ వరద నీళ్లలోనే తాళ్లు పట్టుకుని నాలుగైదు కిలోమీటర్లు గంటల తరబడి నడుచుకుంటూ ఆ బ్రిడ్జి వద్దకు వస్తున్నారు. అక్కడ దొరికింది తీసుకుని మళ్లీ నీళ్లలోనే తమ ఇళ్ల వద్దకు అతికష్టంగా వెతున్నారు.
సుమారు 5 లక్షల మంది వరదలో చిక్కుకుపోతే సోమవారం 200 బోట్లు తెప్పించామంటున్నారు. అవి ఏ మూలకూ సరిపోవడంలేదు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న బోట్లను లోనికి తీసుకెళ్లడానికి ఈ ట్రాఫిక్ అడ్డంకిగా మారిపోయింది. దీంతో చాలా లారీల్లోని పడవలను దించకుండా అలాగే ఉంచేశారు. హెలికాప్టర్లు రప్పించినా వాటివల్లా ఉపయోగం లేదని కొందరు అధికారులే పెదవి విరుస్తున్నారు.
సాయం శూన్యం...
వరద ప్రాంతాల్లో స్వయంగా తిరుగుతున్నట్లు గాంభీర్యంగా ప్రకటిస్తూ ప్రచారం చేసుకోవడం మినహా ప్రజలకు అందుతున్న సాయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవటం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానంటూ వైఫల్యాలను వారిపైకి నెట్టేయత్నం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు వరదతో ప్రజలను ముంచిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు.
మంచినీళ్లకూ కటకట!2
» రెండ్రోజుల నుంచి నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేత
» హెడ్ వాటర్ వర్క్స్‌లో ప్లాంట్లపై వరద ప్రభావం
» ట్యాంకర్ల సరఫరాలను ఏర్పాటుచేయని వీఎంసీ
పటమట (విజయవాడ తూర్పు) : వరదతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఓ వైపు బుడమేరు.. మరోవైపు కృష్ణానది ఉప్పొంగడంతో నగరమంతా జలమయమైంది. ఫలితంగా సిటీ మొత్తానికి తాగునీటిని అందించే హెడ్‌వాటర్ వర్క్స్ నుంచి తాగునీటి సైతం సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ మొత్తం ఐదు ప్లాంట్లు ఉండగా వాటిలో మూడు ప్లాంట్లు వరదలకు మునిగిపోయాయి. మిగిలిన రెండు ప్లాంట్లు వరద ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు వాటికి నీటి సరఫరాను పూర్తిగా ఆపేశారు. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాలు తాగునీరు, వాడుక నీటికి కటకటలాడుతున్నారు.
సొంత బోర్లు ఉన్న వారు నీటిని సమకూర్చుకుంటే చాలామంది మున్సిపల్ నీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. సోమవారం ఉదయం నుంచి నీటి సరఫరా నిలిచిపోవటంతో నగరంలోని పలు ప్రాంతాల వారు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, విద్యుత్ సరఫరాలేని కారణంగా కూడా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇక తాగునీటి సరఫరాను నిలిపివేసే విషయంలో వీఎంసీ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో చాలాచోట్ల నగరవాసులు నీటిని నిల్వ చేసుకోలేకపోయారు. పైగా.. ప్రత్నామ్యాయంగా ట్యాంకర్లు ఏర్పాటుచేయకపోవటంతో తాగునీటి కోసం గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు.. వరద ప్రభావితం కాని ప్రాంతాలకు 15 పెద్ద ట్యాంకర్లు, 80 ట్రాక్టర్ ట్యాంకర్లు ఏర్పాటుచేసినట్లు వీఎంసీ ప్రకటిస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment