ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పై-లీన్ తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితలకు పునరావాసం, సహాయక చర్యల కోసం రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం లండన్లోని తన నివాసంలో లార్డ్ స్వరాజ్ పాల్ విలేకర్లతో మాట్లాడుతూ... పై-లీన్ తుపాన్ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవహారించిన తీరు నభూతోనభవిష్యత్తు అని ప్రశంసించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అత్యంత భీకరమైన ఆ తుపాన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయన్నారు. వీటితోపాటు భారత ఆర్మీ, వైమానిక దళాలు సహాయక చర్యలపై స్వరాజ్ పాల్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే పై-లీన్ తుపాన్పై జాతీయ, స్థానిక మీడియాలు ప్రజలను అప్రమత్తం చేసిందని వివరించారు.
అందువల్లే మృతులు కానీ గాయాలపాలైన వారు కాని చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు. పై-లీన్ తుపాన్ దృశ్యాలను టీవీ ద్వారా వీక్షించినట్లు చెప్పారు. రూ. 25 లక్షల విరాళాన్ని సాధ్యమైనంత త్వరగా పై-లీన్ తుపాన్ బాధితులకు అందజేస్తామని లార్డ్ స్వరాజ్ పాల్ వివరించారు.