NRI industrialist
-
రూ.2.8 కోట్ల విరాళాలు నిలిపేసిన బైడెన్ పార్టీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన డెమోక్రటిక్ పార్టీ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఇచ్చిన మొత్తం సుమారు 3.4 లక్షల డాలర్లు(రూ.2.8 కోట్లు) విరాళాలను నిలిపేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. పొలిటికో కథనం ప్రకారం.. బిడెన్ విక్టరీ ఫండ్(బీవీఎఫ్) కోసం తాజాగా ఇండో అమెరికన్ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ 50,000 డాలర్లు(రూ.41 లక్షలు) విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యంకాదని, ఆ విరాళాన్ని నిలిపివేస్తున్నట్లు జో బైడెన్ ప్రచార అధికారి తెలిపారు. గతంలోనూ డెమోక్రాటిక్ కాంగ్రెషనల్ ప్రచార కమిటీ (డీసీసీసీ)కు తాను ఇచ్చిన 2.9లక్షల డాలర్లను హోల్డ్‌లో పెడుతున్నట్లు చెప్పారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన శ్రీవాస్తవ తన భార్య గౌరవ్ షారన్ పేరుతో, శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. తనకు ఇతర కంపెనీలు ఉన్నాయి. అయితే ఆ సంస్థలు నిత్యం చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అవి ఎలాంటి వివాదాలో మాత్రం తెలియరాలేదు. 2022లో బాలిలో జరిగిన ప్రపంచ ఆహార భద్రతా ఫోరమ్‌కు తన ఫ్యామిలీ 1 మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించింది. అనంతరం అతడి సంస్థల్లో వివాదాలు నెలకొన్నాయి. ఆ అంశాలు కోర్టు వరకు వెళ్లడంతో థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అతనితో సంబంధాలు తెంచుకుంది. అమెరికా ఎన్నికల చట్టాల ప్రకారం..ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఒక వ్యక్తి 3,300 డాలర్లకు మించి విరాళం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అయితే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రచార కమిటీలకు మాత్రం విరాళాలు ఇవ్వడానికి అనుమతులున్నాయి. దాంతో డీసీసీసీకు శ్రీవాస్తవ భారీగా విరాళం ఇచ్చారు. ఆ విరాళాలను బీవీఎఫ్ బైడెన్ ప్రచారానికి, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి, స్టేట్ పార్టీ యూనిట్లకు విభజించింది. ప్రస్తుతం తెరపైకి వస్తున్న వివాదాలతో ఆ విరాళాలను స్వచ్ఛంద సంస్థలకు బదిలీచేస్తున్నట్లు డెమోక్రాట్ల ప్రతినిధి చెప్పారు. డీసీసీసీకు విరాళం ఇచ్చిన సమయంలో గౌరవ్ తాను యూనిటీ రిసోర్స్ గ్రూప్ (యూఆర్జీ) ఛైర్మన్‌ను అంటూ చెప్పుకున్నారని కథనం ద్వారా తెలిసింది. ప్రతికూల వాతావరణంలో విజయాన్ని సాధించే వ్యాపారాలు, ప్రభుత్వాలు, సంస్థల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ యూఆర్జీ అంటూ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! బైడెన్ సెనేటర్‌గా ఉన్న సమయంలో అతడికి సహాయకుడిగా పనిచేసిన అంకిత్ దేశాయ్ నిర్వహించిన లాబీయింగ్ సంస్థ ఏర్పాటులో యూనిటీ రిసోర్స్ గ్రూప్ భాగమైందని పొలిటికో నివేదించింది. నాటో మిత్రపక్ష కమాండర్‌గా పనిచేసి, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజార్చుకున్న రిటైర్డ్ జనరల్ వెస్లీ క్లార్క్‌ను గౌరవ్ శ్రీవాస్తవ కన్సల్టెంట్‌గా నియమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారని పొలిటికో తెలిపింది. గౌరవ్ శ్రీవాస్తవకు వ్యక్తిగతంగా ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి ‘హాయ్.. నేనో ఫిలాంథ్రోఫిస్ట్(పరోపకారిని)’ అంటూ రావడం విశేషం. -
వరంగల్ వాసి అనిల్‌కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు
తెలంగాణకు చెందిన వరంగల్వాసికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. యూఎస్‌లోని వర్జీనియాలో ఉంటున్న బోయినపల్లి అనిల్ ఇండియన్ అమెరికన్ విభాగంలో 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్బీఏ) నేషనల్ స్మాల్ బిజినెస్ వీక్ (ఎన్ఎస్బీడబ్ల్యూ) అవార్డు-2024 గ్రహీతలను ఇటీవల ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పాటుపడిన ప్రముఖ వ్యాపారవేత్తలకు ఈ స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇస్తారు. ఇందులో భాగంగా ‘స్కై సొల్యూషన్స్’ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవోగా ఉన్న అనిల్ వర్జీనియా రాష్ట్రం నుంచి ఈ అవార్డు గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన హెర్న్‌డాన్ కంపెనీతో కలిసి 2008లో స్కై సొల్యూషన్స్ సంస్థను ఆయన ఏర్పాటుచేశారు. ఇది వ్యాపార సంబంధమైన అంశాల్లో సాంకేతిక పరిష్కారాలను అందిస్తోంది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి అనిల్ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనిల్ కొంతకాలం సీఎన్ఎస్ఐ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా హెల్త్‌కేర్ పరిశ్రమలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విధులు నిర్వర్తించారు. ఫెన్నీ మే, హారిస్ కార్పొరేషన్లో కూడా ఆయన పనిచేశారు. ఇదీ చదవండి: ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం ఎన్ఎస్బీడబ్ల్యూ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 28, 29 తేదీల్లో వాషింగ్టన్ డీసీలోని వాల్డోర్స్ ఆస్టోరియా హోటల్లో జరగనుంది. ఎస్బీఏ అడ్మినిస్ట్రేటర్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ క్యాబినెట్లో సభ్యుడైన ఇసాబెల్ కాసిల్లాస్ గుల్మాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డులను అందించనున్నారు. తనకు దక్కిన ఈ అవార్డుకు సంబంధించి అనిల్ స్పందిస్తూ భారత్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనకు ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. అమెరికా వంటి దేశంలో ఇలాంటి ఘనత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈక్యామ్స్, ఈ-ఎంఐపీపీ, ఈ-ఎఫ్ఆర్ఎం, బ్లూబటన్ వంటి సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిసింది. -
రిచెస్ట్ ఎన్ఆర్ఐ వినోద్ అదానీ: తగ్గేదేలే అంటున్న అదానీ బ్రదర్స్
సాక్షి,ముంబై: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 10,94,400 కోట్ల సంపదతో టాప్ ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా తగ్గేదేలా అంటున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ (సెప్టెంబర్ 22, గురువారం) తాజా లిస్ట్ ప్రకారం దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త వినోద్ అదానీ రూ.1,69,000 కోట్లతో అత్యంత ధనవంతులైన ఎన్ఆర్ఐ, ఆరో సంపన్న భారతీయుడుగా నిలిచారు. 1976లో ముంబయిలో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి సింగపూర్దాకా విస్తరించారు. జకార్తాలో వ్యాపార వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. గత సంవత్సరంలో వినోద్ అదానీ సంపద 28 శాతం లేదా 37,400 కోట్లు పెరిగింది. అలా టాప్ 10 సంపన్న వ్యక్తుల జాబితాలో ఆరోస్థానం కోసం రెండు ర్యాంకులు ఎగబాకినట్టు నివేదించింది. గత ఐదేళ్లలో వినోద్ అదానీ సంపద ఏకంగా 850 శాతం లేదా 1,51,200 కోట్లు పెరిగింది. నివేదిక ప్రకారం, 2018లో 49వ స్థానం నుంచి ఈ ఏడాది ఆరో స్థానానికి చేరారు. వినోద్ రోజువారీ ప్రాతిపదికన రూ. 102 కోట్లు. వార్షిక ప్రాతిపదికన నాలుగో అతిపెద్ద గెయినర్.అంతేకాదు ఇద్దరు అదానీల సంపద మొత్తం రూ. 12,63,400 కోట్లుగా ఉంది. అంటే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లోని తొలి పదిమంది వ్యక్తుల సంపదలో దాదాపు 40 శాతం అన్న మాట. ఈ ఏడాది 94 మంది ఎన్నారైలు భారతీయ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
విభేదాలు వీడి దేశాన్ని బాగు చేసుకుందాం..‘మీట్ అండ్ గ్రీట్’లో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘విభేదాలను పక్కనబెట్టి అందరూ ఏకతాటిపైకి రావాలి. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధి కోసం పనిచేసేందుకు మాతో కలిసి రావాలి’అని ప్రవాస భారతీయులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని, పెట్టుబడులతో తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. సొంత రాష్ట్రంలో కంపెనీల ఏర్పాటు ద్వారా సంపద సృష్టించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం లండన్‌లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’లో కేటీఆర్ ప్రసంగించారు. యూకే పర్యటనలో భాగంగా పలువురు విదేశీ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశాల ఫలితాలు త్వరలో కనిపిస్తాయని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు రప్పించడం, రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయడమే తన ప్రథమ కర్తవ్యమని, యూకేతో భవిష్యత్తులో రాష్ట్ర సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ పెట్టుబడులతో ముందుకు రావాలని, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లో ఐటీ టవర్లు ప్రారంభించామని చెప్పారు. త్వరలో మరిన్ని పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతోనే పురోగతి సాధ్యమవుతుందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రాష్ట్రం భారత ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. స్టార్టప్ రాష్ట్రంగా ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్రం.. తలసరి ఆదాయం, జీడీపీ వంటి అంశాల్లో కొత్త రికార్డును సృష్టించిందని, భారత ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా నిలిచిందన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ప్రస్థానాన్ని ప్రవాస తెలంగాణ వాసులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. లండన్ కేంద్రంగా టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న పార్టీ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఇంటికి కేటీఆర్ వెళ్లారు. బతుకమ్మ గురించి క్వీన్ ఎలిజబెత్‌కు వివరాలు తెలుపుతూ అనిల్ కూతురు నిత్య రాసిన లేఖకు క్వీన్ నుంచి వచ్చిన ప్రశంసను తెలుసుకున్న మంత్రి అభినందించారు. ప్రాంతం, దేశమేదైనా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ కుటుంబీకులేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర అవతరణ తర్వాత కూడా రాష్ట్రం సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో తెలంగాణ ప్రవాసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. విద్యా సంస్థల్లో ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యా సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించడాన్ని త్వరలో ప్రోత్సహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యేకించి వాణిజ్యపరంగా బస్సులు, వ్యాన్ల తయారీలో పేరొందిన ‘ఎరైవల్ యూకే’కార్యాలయాన్ని హైదరాబాద్‌కు చెందిన అల్లాక్స్ రిసోర్సెస్ సంస్థ ప్రతినిధులతో కలిసి కేటీఆర్ శనివారం సందర్శించారు. భారత్‌లో ప్రత్యేకించి తెలంగాణలో బస్సులు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి ఎరైవల్ యూకేతో అల్లాక్స్ రిసోర్సెస్ చేతులు కలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణాలో భారత్‌లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలున్న రాష్ట్రంగా మారేందుకు ఎరైవల్ యూకే బస్సులు ఉపయోగపడుతాయన్నారు. కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. -
‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ గా డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి
విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ రెడ్డి అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్.వి మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో యు.ఎస్.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్.లో టాప్–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. ఒక చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. -
సాక్షి ఎన్ఆర్ఐ ఫండ్ ఫ్యాక్టర్ లైవ్ షో
-
'పెంట్‌హౌజ్ మీద నుంచి పడ్డ పారిశ్రామికవేత్త'
లండన్: ఎన్నారై పారిశ్రామిక వేత్త స్వరాజ్ పాల్‌కు పుత్ర శోకం కలిగింది. ఆయన కుమారుడు కపారో గ్రూప్ సీఈవో అంగద్ పాల్ ఎనిమిదంతస్తుల భవనం మీద ఉన్న పెంట్ హౌజ్ నుంచి పడి తీవ్రగాయాలపాలై ప్రాణాలుకోల్పోయారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సాధారణ మరణంగా భావించలేమని అందుకే అనుమానిత మృతిగా కేసు నమోదుచేసుకున్నామని లండన్ పోలీసులు తెలిపారు. ఇటీవల ఉక్కు ధరలు అమాంతం పడిపోవడంతో వారి కంపెనీ కపారో తీవ్ర ఒడిదుడుకుల్లోకి వెళ్లిపోయింది. దాదాపు ఈ కంపెనీకి చెందిన 16 కార్యాలయాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పదేళ్ల కిందట ఓ మీడియా సంస్థకు న్యాయవాదిగా పనిచేస్తున్న మెషెల్లీ బోన్ అనే మహిళను అంగద్ పాల్ వివాహం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 40 కంపెనీలు, పది వేలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీల్లో కార్లకు సంబంధించిన పనిముట్లు, స్టీలు పైపులు, డిజైనింగ్ వస్తువులు, ఫిల్మ్ లు తయారవుతుంటాయి. కంపెనీ ఆర్థిక సమస్యలు మధ్య ఉండగా ఆయన ఎనిమిదో అంతస్తు మీద నుంచి పడి ప్రాణాలుకోల్పోవడం ప్రస్తుతం అనుమానం కలిగిస్తోంది. -
'కలాం గొప్ప మానవతావాది'
లండన్: ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి పట్ల ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన గొప్ప మానవతావాది అని తెలిపారు. ఎందరికో స్ఫూర్తి ప్రధాత అని అబ్దుల్ కలాంను కొనియాడారు. రాష్ట్రపతిగా కలాం దేశానికి చేసిన సేవలను లార్డ్ స్వరాజ్ పాల్ ఈ సందర్భంగా కొనియాడారు. అబ్దుల్ కలాం ప్రసిద్ధ నాయకుడని లార్డ్ స్వరాజ్ పాల్ తెలిపారు. లండన్ చెందిన ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్తగా ఖ్యాతి పొందిన లార్డ్ స్వరాజ్ పాల్ కపారో గ్రూప్ సంస్థలకు అధినేత అన్న విషయం తెలిసిందే. -
అపూర్వ విద్యార్థి పాల్
‘మనవళ్లూ... చూడండి. ఈ స్కూల్లోనే నేను చదువుకుని ఇంత వాడినయ్యా. నన్ను ఈ స్కూల్లో చేర్పించిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు నేను రుణపడి ఉంటా. ఇక్కడికి రావడం అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. ఈ క్షణాలను మర్చిపోలేను...’ అని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఫౌండర్ చైర్మన్ లార్డ్ స్వరాజ్ పాల్ (83) ఉద్వేగంతో అన్నారు. సాతంత్య్రానికి పూర్వం జలంధర్‌లో తాను చదువుకున్న దోబా ప్రైమరీ, సెకండరీ స్కూళ్లను ఆయన శనివారం సందర్శించారు. బ్రిటన్ నుంచి తన కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లను కూడా తీసుకువచ్చారు. ‘వయసు మీదపడుతోంది. మళ్లీ ఎప్పుడొస్తానో తెలియదు. మళ్లీ రాగలనా అనేది కూడా చెప్పలేను. అందుకే, నా సంతానానికి, ముఖ్యంగా నా మనవళ్లకు వారి మూలాలను చూపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకువచ్చాను...’ అని ఆయన చెప్పారు. కుమారుడు అంగద్, కోడలు మిషెల్లీ, కుమార్తె అంజలి, వారి ముగ్గురు సంతానంతో పాటు జలంధర్ వచ్చిన లార్డ్ పాల్, తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
'సుచిత్ర' అసలు సిసలు అందానికి చిరునామా
ప్రముఖ నటి సుచిత్ర సేన్ మృతి చలన చిత్ర ప్రపంచానికి తీరని లోటని ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అన్నారు. అందాని అసలు సిసలు చిరునామా సుచిత్ర అని ఆయన అభివర్ణించారు. అత్యంత ప్రతిభ పాటవాలు ఆమె సొంతమని పేర్కొన్నారు. బెంగాలి నటి అయిన సుచిత్ర సేన్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నటిమణిగా పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. ప్రపంచ ప్రేక్షకుల మదిలో సుచిత్ర చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆమె నటించిన దేవదాసు.. చిత్రాలు అద్భుత కళాఖండాలని కొనియాడారు. ప్రముఖ నటీ సుచిత్ర సేన్ శుక్రవారం కొల్‌కత్తాలో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు వారాల క్రితం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుచిత్ర శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బెంగాలీలో అగ్నిపరీక్ష, సప్తపది, దీప జ్వాల జై, సాత్ పాకీ బందా తదితర 50 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించించారు. అలాగే హిందీలో దేవదాసు, అందీ చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. -
పై-లీన్ బాధితులకు లార్డ్ స్వరాజ్ పాల్ ఆర్థిక సాయం
ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పై-లీన్ తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితలకు పునరావాసం, సహాయక చర్యల కోసం రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం లండన్‌లోని తన నివాసంలో లార్డ్ స్వరాజ్ పాల్ విలేకర్లతో మాట్లాడుతూ... పై-లీన్ తుపాన్ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవహారించిన తీరు నభూతోనభవిష్యత్తు అని ప్రశంసించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అత్యంత భీకరమైన ఆ తుపాన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయన్నారు. వీటితోపాటు భారత ఆర్మీ, వైమానిక దళాలు సహాయక చర్యలపై స్వరాజ్ పాల్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే పై-లీన్ తుపాన్‌పై జాతీయ, స్థానిక మీడియాలు ప్రజలను అప్రమత్తం చేసిందని వివరించారు. అందువల్లే మృతులు కానీ గాయాలపాలైన వారు కాని చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు. పై-లీన్ తుపాన్ దృశ్యాలను టీవీ ద్వారా వీక్షించినట్లు చెప్పారు. రూ. 25 లక్షల విరాళాన్ని సాధ్యమైనంత త్వరగా పై-లీన్ తుపాన్ బాధితులకు అందజేస్తామని లార్డ్ స్వరాజ్ పాల్ వివరించారు.