అపూర్వ విద్యార్థి పాల్
‘మనవళ్లూ... చూడండి. ఈ స్కూల్లోనే నేను చదువుకుని ఇంత వాడినయ్యా. నన్ను ఈ స్కూల్లో చేర్పించిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు నేను రుణపడి ఉంటా. ఇక్కడికి రావడం అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. ఈ క్షణాలను మర్చిపోలేను...’ అని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఫౌండర్ చైర్మన్ లార్డ్ స్వరాజ్ పాల్ (83) ఉద్వేగంతో అన్నారు.
సాతంత్య్రానికి పూర్వం జలంధర్‌లో తాను చదువుకున్న దోబా ప్రైమరీ, సెకండరీ స్కూళ్లను ఆయన శనివారం సందర్శించారు. బ్రిటన్ నుంచి తన కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లను కూడా తీసుకువచ్చారు. ‘వయసు మీదపడుతోంది. మళ్లీ ఎప్పుడొస్తానో తెలియదు.
మళ్లీ రాగలనా అనేది కూడా చెప్పలేను. అందుకే, నా సంతానానికి, ముఖ్యంగా నా మనవళ్లకు వారి మూలాలను చూపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకువచ్చాను...’ అని ఆయన చెప్పారు. కుమారుడు అంగద్, కోడలు మిషెల్లీ, కుమార్తె అంజలి, వారి ముగ్గురు సంతానంతో పాటు జలంధర్ వచ్చిన లార్డ్ పాల్, తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.