సాక్షి, అమరావతి: తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం ఆయన మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
తుపాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాలను సీఎం జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఉదయం మరోమారు సమీక్ష చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
ధాన్యం తడిసిపోకుండా చూడండి..
పొలాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యం తడిసిపోకుండా వెంటనే మిల్లులు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యతను తీసుకోవాలన్నారు. తేమలాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే సేకరించి తరలించాలన్నారు. దీనిపై పురోగతిని వెంటనే తనకు తెలియజేయాలని ఆదేశించారు.
మరోవైపు.. తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరుల శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను అనంతరం ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment