Vijayawada Crime News: Lady Police Constable Death Due To Blood Cancer - Sakshi
Sakshi News home page

ఆశలు సమాధి: పదిరోజుల్లో వివాహం.. మహిళా కానిస్టేబుల్‌ మృతి

Published Sat, Nov 20 2021 10:15 AM | Last Updated on Sun, Nov 21 2021 1:02 PM

Lady Police Constable Death Due To Blood Cancer Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: కాళ్లకు పారాణి పెట్టుకుని, పట్టు వస్త్రాలతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువతి.. నిస్తేజంగా పరుండిపోయింది. అనుకున్న లక్ష్యాన్ని చిన్న వయస్సులోనే అధిగమించి.. కొంగొత్త ఆశలతో కొత్త జీవితం వైపు పరుగులు పెడుతున్న సమయాన విధి వైచిత్రికి తలవంచాల్సి వచ్చింది. ఉన్నపాటున బ్లడ్‌ కేన్సర్‌ రూపంలో విరుచుకుపడిన మృత్యువు.. కోలుకునే అవకాశం ఇవ్వకుండా కబళించేసి, ఆశల్ని సమాధి చేసింది. కన్నవారికి కన్నీటి వేదనను మిగిల్చింది.

సేకరించిన వివరాలు ఇవి.. 
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం నందమూరి గ్రామానికి చెందిన పరసా శ్రీరమ(21) అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 19 ఏళ్లకే కానిస్టేబుల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాదించింది. 2020 బ్యాచ్‌కు చెందిన శ్రీరమ శిక్షణ పూర్తయిన తర్వాత తొలిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ మహిళా కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈ నెల 28వ తేదీన శ్రీరమ వివాహం కూడా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

కన్నవారి కలలు కల్లలు.. 
ఉద్యోగం తర్వాత పెళ్లితో తమ కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశకు పది రోజుల్లోనే తీరని నిరాశను మిగిల్చింది. గత పదిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నాలుగు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోగా బ్లడ్‌ క్యాన్సర్‌ అని వైద్యులు నిర్ధారించారు. తనకు ఆ వ్యాధి ఎలా వచ్చింది, ఎలా తగ్గించుకోవాలని తెలుసుకునే లోపే ఆమె తన జీవితాన్ని కోల్పోయింది.

బుధవారం మధ్యాహ్నం విధుల్లో ఉన్న శ్రీరమకు చెవుల్లో, ముక్కుల్లో నుంచి ఒక్కసారిగా రక్తం రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. స్టేషన్‌ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకువెళ్లారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె గురువారం అర్ధరాత్రి దాటాక తుది శ్వాస విడిచింది. 

స్టేషన్‌ సిబ్బంది నివాళి.. 
సింగ్‌నగర్‌ స్టేషన్‌ సిబ్బంది, ఆమె స్వగ్రామం నందమూరి గ్రామ వాసులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. స్టేషన్‌ ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది అంతా శుక్రవారం శ్రీరమ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement