
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2,300 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆన్‌లైన్, వెబ్‌ల్యాండ్‌కు ఎక్కించారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఇప్పటిదాకా ఆరుగురిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ భూముల విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. యదమరి మండలం గొల్లపల్లి రిటైర్డ్ వీఆర్‌ఓ గణేష్ పిళ్లై ఈ అక్రమాలకు ప్రధాన సూత్రదారి. జూలై 01, 2009లో ఒకే రోజు ఆన్‌లైన్‌లో ఎక్కించి అక్రమాలకు పాల్పడ్డారు.
చదవండి: (భూదేవి పేట భేష్.. అభినందించిన ప్రధాని మోదీ)
చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో సర్వే నెంబర్ 459లో 45.42 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా.. రాజన్, ధరణి, మధుసూధన్‌లు ఆన్‌లైన్‌లో 160.09 ఎకరాలు చూపించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాలపై సోమల తహశీల్దార్ శ్యాంప్రసాద్ రెడ్డి మే 29, 2020లో పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పెద్ద పంజానీ మండలంలో కూడా 2015లో తహశీల్దార్ శ్రీదేవి సహాయంతో నిందితులు అక్రమాలకు పాల్పడ్డారు. సీసీఎల్‌ఏ నివేదిక ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. ఇదే పేర్లతో 14 మండలాల్లో 93 సర్వే నంబర్స్‌లలో 2,300 ఎకరాలకు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ కుంభకోణంలో గణేష్ పిళ్లైతో పాటు, అతని కుమారులు మధుసూధన్, సుధ, కోమలి, అడవి రమణ మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశాము. గణేష్ పిళ్లై కూతరు ధరణి పరారీలో ఉంది' అని సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు.