సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులను సర్వే చేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరాలతో కూడిన పత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్షా పథకంలో భాగంగా పట్టణాల్లో సర్వేకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో భూ సర్వే చేపట్టిన ప్రభుత్వం.. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలకు వారి ఆస్తికి సంబంధించి కచ్చితమైన సమాచారంతో ధృవీకరణ పత్రం అందించనుంది. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో పైలట్ ప్రాజెక్టుగా రెండు రెవెన్యూ వార్డుల్లో చేపట్టిన సర్వే విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో అమలు చేయనుంది.
పట్టణ ప్రాంత భూములకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఈ నెల 15 తర్వాత సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను వచ్చే ఏడాది జూలైకి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతకంటే ముందే పూర్తి చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంతో కలిసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్ కుమార్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. సర్వే సందర్భంగా తలెత్తే వివాదాలకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రభుత్వం మొబైల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తోంది.
అధికారికంగా 37 లక్షల ఆస్తుల గుర్తింపు
సరిహద్దులు, సర్వే నంబర్లతో కూడిన రికార్డులు పక్కాగా ఉండడంతో పంచాయతీల్లో సర్వేలో పెద్దగా ఆటంకాలు ఎదురవలేదు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రక్రియ సవాలుగానే మారనుంది. ముఖ్యంగా ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు వంటి వివాదాలు చాలానే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దశాబ్దాల తరబడి పట్టణ ప్రాంత ప్రజలు ఆస్తి పన్ను చెల్లిస్తున్నప్పటికీ ఆ భవనం ఏ సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందో తెలియదు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి పన్ను చెల్లించని వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు, ఆస్తి పన్ను చెల్లిస్తున్న డేటా ప్రకారం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 37 లక్షల ఆస్తులు ఉన్నట్టు మున్సిపల్ శాఖ గుర్తించింది.
సర్వేలో ఇవి మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో భవనాలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఖాళీ స్థలాలు.. ఇలా వేటికవి ప్రత్యేకంగా గుర్తిస్తారు. గత ప్రభుత్వాలు పురపాల సంఘాల్లో పన్నుల వసూళ్లపై పెట్టిన దృష్టి ఆస్తుల గుర్తింపుపై పెట్టకపోవడంతో కొనుగోళ్లు, అమ్మకం రిజిస్ట్రేషన్ సమయంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపై ఈ సమస్యలు లేకుండా ఎవరి ఆస్తిపై వారికి అన్ని వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. దీనిద్వారా సర్వే నంబర్లు, పట్టా నంబర్లు, అధికారిక సరిహద్దులు వంటి సమగ్ర వివరాలతో హక్కుదారులకు పత్రాలు అందుతాయి.
నేడు శిక్షణ
ఈ సర్వే ప్రక్రియ అమలుపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించే ఈ శిక్షణలో డ్రోన్ ఉపయోగించి ఆస్తుల కొలతలు తీసుకోవడం, రికార్డుల ప్రకారం రోడ్లు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల గుర్తింపు, ఆయా సర్వే నంబర్లుపై తర్ఫీదునిస్తారు. అనంతరం యూఎల్బీల్లో అవసరమైనంత మంది సిబ్బందికి వీరు శిక్షణ ఇస్తారు.
సర్వేతో పట్టణ ప్రజలకు ఎంతో మేలు
పట్టణ భూ సర్వేతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటి దాకా పట్టణాల్లో ఆస్తులకు పన్ను చెల్లిస్తున్న డేటా ఉంది. సర్వే నంబర్ల డేటా కూడా ఉంది. అయితే ఏ సర్వే నంబర్‌లో ఏ ఆస్తులు.. ఎవరి ఆస్తులు ఉన్నాయో లేదు. ఇప్పుడు ఈ రెండు అంశాలను కలిపి డేటాను రూపొందిస్తాం. అన్ని సరిహద్దులను వివరిస్తూ సర్వే నంబర్‌తో సహా హక్కుదారుకు సర్టిఫికెట్ ఇస్తాం. ఇందుకోసం మున్సిల్ చట్టంలో సవరణలు చేస్తాం. సర్వేలో అనుభం ఉన్న రెవెన్యూ, సీసీఎల్‌ఏ, ఇతర విభాగాల సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి బృహత్తర కార్యక్రమం గతంలో ఎప్పుడూ చేపట్టలేదు.
– ప్రవీణ్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
పట్టణాల్లోనూ భూసర్వే
Published Wed, Aug 10 2022 4:08 AM | Last Updated on Wed, Aug 10 2022 9:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment